Sunday, November 17, 2024

తరచు పార్టీలు మారడం కలవరం కలిగిస్తోంది

- Advertisement -
- Advertisement -

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినం చేయాలి
వెంకయ్య నాయుడు సూచన
‘ఉచితాల’ ప్రకటనను నిరుత్సాహపరచాలి
అట్టి వాగ్దానాలపై నేతలు, పార్టీలను జనం నిలదీయాలి

న్యూఢిల్లీ : రాజకీయ నేతలు ‘తరచు’ పార్టీలు మారడం ‘కలవరం కలిగిస్తోంది’ అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు మంగళవారం చెప్పారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత కఠినంగా మార్చాలని ఆయన పిలుపు ఇచ్చారు. పద్మ విభూషణ్ అవార్డు స్వీకరణ అనంతరం న్యూఢిల్లీలోని తన నివాసంలో ఒక కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, నిధులు ఎలా సమీకరించేది వివరించకుండానే ఎన్నికల సమయంలో ‘ఉచితాలు’ ప్రకటించడం సమంజసం కాదని అన్నారు. వాటిని నిరుత్సాహపరచాలని, అటువంటి బడా వాగ్దానాలు చేసే నేతలు, పార్టీలను ప్రజలు ప్రశ్నించాలని వెంకయ్య నాయుడు పిలుపు ఇచ్చారు.

సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెంకయ్య నాయుడుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ అవార్డు ప్రదానం చేసిన విషయం విదితమే. ‘ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మనం మరింత కఠినతరం చేయాలి’ అని ఆయన ఉద్ఘాటించారు. ‘ఇప్పుడు ప్రజా జీవితంలో ప్రమాణాల పతనం కలవరం కలిగిస్తోంది. రాజకీయ పార్టీల్లో వ్యక్తులు తమ పార్టీలను తరచు మారుస్తుంటారు. తాజా సరళి ఎలా ఉంది అంటే ఉదయం ఒక పార్టీలో ఉన్నవారు సాయంత్రం మరొక పార్టీలో చేరుతూ, మీ నాయకుని విమర్శిస్తారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. వారిలో కొందరికి టిక్కెట్లు కూడా ఇస్తున్నారు. ఇది ఎంతగానో ఆందోళన కలిగిస్తోంది. జనం ఇలా చేయకూడదు. వ్యక్తులు పార్టీలో పని చేస్తూ తమ అర్హతలను రుజువు చేసుకోవాలి. ఎవరైనా పార్టీ మారాలని అభిలషిస్తే వారు తమకు పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేసి ఆ తరువాతే మరొక పార్టీలో చేరాలి. ఆరోపణలు చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ జరుగుతోంది ఏమిటంటే ఆరోపణలు చేయడం కాదు& దూషించడం’ అని వెంకయ్య నాయుడు అన్నారు. మరొక అసమంజస వైఖరి ఏమిటంటే వ్యక్తులు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించకుండానే ఎడాపెడా వాగ్దానాలు చేస్తుండడం. అక్కడ డబ్బే లేదు. రాజకీయ పార్టీలు ముందు మేనిఫెస్టోతో రావాలి.

తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి పథకాలతో ముందుకు రావాలి. అటుపిమ్మట తాము వనరులను ఎలా సమీకరిస్తామో, ఏవిధంగా వ్యయం చేయాలనుకుంటున్నామో ప్రకటించాలి’ అని వెంకయ్య నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘డబ్బు చెట్లకు కాయదు’ కనుక ప్రతిదీ ఎలా ఉచితంగా ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్బలంగా ఉన్నా కొందరు నేతలు, పార్టీలు ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రాలపై లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఉన్నప్పటికీ నేతలు వాగ్దానాలు చేస్తున్నారని, ప్రతిదీ ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘నేను ఉచితాలకు వ్యతిరేకిని. విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇవ్వడానికి నేను అనుకూలం. విద్య, ఆరోగ్యం ఉచితం చేయండి. తక్కినవాటిని తప్పించుకోండి. కానీ వారు అలా చేయడం లేదు’ అని వెంకయ్య నాయుడు విచారం వెలిబుచ్చారు. హేయనీయమైన భాష వాడే, అవినీతిపరులని తెలిసిన అభ్యర్థులను తిరస్కరించవలసిందని వోటర్లకు వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News