Sunday, January 19, 2025

ఆ అమ్మ ఆశీస్సులుంటే విజయం తథ్యం!

- Advertisement -
- Advertisement -

బనస్వారా: ఎన్నికల సమయంలో రాజస్థాన్‌లోని బనస్వారా జిల్లాలోని ఓ ఆలయం అమ్మవారి ఆశీస్సులను కోరుతూ వచ్చే రాజకీయ నాయకులతో సందడిగా ఉంటుంది. శక్తి, లేదా సామ్రాజ్యాన్ని కోరుకునే వారికి కృపను ప్రసాదించే ఈ ఆలయంలో ఉండే మా త్రిపుర సుందరి అమ్మవారి పట్ల రాజస్థ్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె సింధియాకు అపార నమ్మకం ఉందని భక్తులు చెప్తారు. ఉమ్రాయి గ్రామంలో ఉండే ఈ ఆలయానికి గ్రామసర్పంచులు మొదలుకొని మంత్రులదాకా పార్టీలతో సంబంధంం లేకుండా అన్ని పార్టీల రాజకీయ నేతలు సందర్శిస్తుంటారు.‘ సామ్రాజ్యాన్ని కోరుకునే భక్తులను త్రిపుర సుందరీ దేవి ఆశీస్సులు అందిస్తుందని, అందుకనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఈ ఆలయాన్ని దర్శించడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిందని ఆలయ పూజారుల్లో ఒకరైన మోహన్ పాండ్య చెప్పారు. రాజస్థాన్‌లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుండగా, ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.

‘సామ్రాజ్యాన్ని, ఎన్నికల్లో విజయాన్ని కోరుకునే వారు ఈ ఆలయాన్ని సందర్శించి త్రిపుర సుందరి మాతను ప్రార్థిస్తూ ఉంటారు.అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. కొంతమందికి అమ్మవారి పట్ల ఎంతో నమ్మకం ఉంది. అలాంటి వారు తరచూ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఆలయంలో సాధన కూడా చేస్తారు’ అని పాండ్య చెప్పారు. ముఖ్యమైన యుద్ధాల్లో పాల్గొనడానికి ముందు ఒకప్పుడు రాజులు, సంస్థానాధీశులు ఇక్కడి అమ్మవారికి పూజలు చేసే వారని కూడా ఆయన చెప్పారు. తరచూ ఈ ఆలయాన్ని సందర్శించే వసుంధరా రాజె 2013 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యేవరకు ఆలయంలోనే ఉన్నట్లు చెప్తారు. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఈ ఏడాది ఈ ఆలయాన్ని సందర్శించారు.

ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించినట్లు ఆలయం మేనేజర్ జగేశ్ పాంచాల్ చెప్పారు. ఆయనే కాకుండా మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అమ్మవారి దర్శనం కోసం వచ్చినట్లు ఆయన చెప్పారు. గురువారం నాడు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా ఆలయంలో పూజలు చేశారు. వసుంధరా రాజె ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ఆలయం వెలుపల పలు అభివృద్ధి పనులు జరిగాయి. త్రిపుర సుందరి అమ్మవారు ఉన్న ప్రాంతం చాలా శక్తివంతమైనదని, సమాజంలో ప్రజలకు మరింత ఉత్సాహంగా సేవ చేయడం కోసం జనం ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారని తరచూ ఈ ఆలయాన్ని సందర్శించే రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష డిప్యూటీ నాయకుడు సతీశ్ పునియా అంటారు. తనకు అమ్మవారి పట్ల బలమైన విశ్వాసం ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు.

రాజకీయ నాయకులే కాకుండా సామాన్య భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. బనస్వారా జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఎన్నో శతాబ్దాల నాటిదని చెప్తారు. కానీ ఈ ఆలయం ఎప్పుడు నిర్మాణమైందో కచ్చితమైన తేదీ మాత్రం తెలియదు. ఇంతకు ముందు ఆలయం చుట్టూ శక్తిపురి, శివపురి, విష్ణుపురి అనే మూడు కోటలు ఉండేవని, మూడు కోటల నడుమ వెలసినందునే భగవతి అమ్మవారిని త్రిపుర సుందరిగా పిలస్తారని చెప్తారు. ఆలయం గర్భగుడిలో అమ్మవారి నల్లరాతి విగ్రహం 18 చేతులతో ఒక్కో చేతిలో ఒక్కో అయుధంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దశ మహా విద్యగా పిలవబడే ఇతర చిన్నపాటి విగ్రహాలు కూడా ఉన్నాయి.

విగ్రహం పాదాల వద్ద శ్రీ యంత్రం చెక్కి ఉందని, అందువల్లనే అమ్మవారు చాలా శక్తిమంతురాలయిందని చెప్తారు. రాజస్థాన్ నలువైపులనుంచే కాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలనుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. నవరాత్రుల సమయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో లక్షలాది మంది ఆలయాన్ని సందర్శిస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ ఆలయంలో భక్తులు ఏది కోరుకుంటే అమ్మవారు దాన్ని నెరవేరుస్తారని, అందుకే దేశంలోని బడా నేతలంతా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి ముందు శిరసు వంచి నమస్కరిస్తారని ఆలయ ట్రస్టు మాజీ అధ్యక్షుడు అశోక్ పాంచాల్ అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News