Saturday, January 11, 2025

‘వ్యూహా’ల పరుగులో రాజకీయం చిత్తు

- Advertisement -
- Advertisement -

ఇటీవల తెలంగాణ సచివాలయం వెళ్లినపుడు కలిసిన జర్నలిస్టు మిత్రుడొకరు, రాజకీయ పార్టీలు, వ్యూహ సంస్థలు -మీడియా మద్దతు అంశం ప్రస్తావించారు. ‘ఎపిలో, తెలంగాణలో ఏమైంది? వ్యూహాలు, ఎత్తుగడలు, మీడియా మద్దతు- అంచనాలూ… తలకిందులై పెద్ద పెద్ద పార్టీలే బక్కబోర్లాపడ్డ పరిస్థితులు కళ్లకు కట్టాయం’టూ రాజకీయ పరిణామాలను నెమరేశారు. ఒక్క తెలుగునాట మాత్రమే కాదు… దేశంలోని చాలా రాజకీయ పార్టీలు వ్యూహకర్తల్ని, వ్యూహ సంస్థల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు వారి సేవల్ని పొందుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల పని తీరులో, నాయకుల వ్యవహార శైలిలో పెనుమార్పులున్నాయి. నాయకులు సామాన్య ప్రజలతోనే కాకుండా వివిధ వృత్తుల నిపుణులు, అకడమీషియన్లు, మేధావులు, చివరకు పార్టీ కార్యకర్తలతో భేటీలనూ తగ్గించుకుంటున్నారు. పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజాభిప్రాయం తెలుసుకునే ‘చానల్’ నేడెంతో బలహీనంగా ఉంది. నిర్ణాయక స్థానాల్లోని నేతలు, నేరుగా ప్రజానాడి తెలుసుకునే మార్గాలన్నింటినీ దాదాపు మూసుకుంటున్నారు. ‘ప్రజలేమనుకుంటున్నారు?’ వారికేమీ తెలియటంలేదు. తాము నియమించుకున్న వ్యూహకర్తలో, సంస్థలో ఇచ్చే సమాచారం మీదే ఆధారపడి ఆ మేర నడుచుకుంటున్నారు. దాంతో, ఎన్నికల్లో తమకు కలిసొచ్చే పరిస్థితుల కన్నా బెడిసికొట్టే సందర్భాలే ఎక్కువ! అందుకే, ఎన్నికల్లో గెలుపోటములు ‘లాటరీ’ లాగా మారిపోతున్నాయి. పార్టీ టిక్కెట్లివ్వటం నుంచి ప్రచారాంశాలు, ప్రాధాన్యతలు, పదవులు, బాధ్యతల కేటాయింపు వరకు అన్నీ వ్యూహకర్తలు-సంస్థలు సర్వే జరిపి ఇచ్చే సమాచారం ఆధారంగా చేస్తున్నారు. ఒకోసారి ‘సర్వే’ బూచి చూపి, నాయకులు తమ ఇష్టాయిష్టాలను అమలు చేస్తుంటారు. సర్వేను సాకుగా చెప్పి నాయకులు తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే, అసలు సర్వే చేస్తున్నారా? ఆ పేరిట బురిడీ కొడుతున్నారా? అనే సందేహం రావటం ఖాయం!
పార్టీల గెలుపు తమవల్లే అని ఖాతాలో వేసుకునే వ్యూహసంస్థలు ఓటమికి మాత్రం బాధ్యత వహించవు. 2019లో వైఎస్‌ఆర్‌సిపి 151 (175లో) స్థానాలు గెలిస్తే, అదంతా తమ ప్రయోజకత్వం అని జబ్బలుచరుచుకున్న ఐప్యాక్ సంస్థ 2024లో అదే పార్టీ, 11 స్థానాలకు పడిపోయినపుడు ఓటమికి కూడా సమాన బాధ్యత వహించాలి కదా! కర్ణ్ణాటకలో, తెలంగాణలో ఆనాడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు వాతావరణం కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. కానీ, అదంతా తాము నమ్ముకున్న వ్యూహకర్త సునీల్ కనుగోలు గొప్పతనమనుకొని పార్టీ వ్యవస్థ మొత్తాన్ని ఆయన చెప్పుచేతల్లోకి తెచ్చిన ఫలితం ఏమిటో… హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నాయకత్వానికి స్పష్టంగా కనిపించే ఉంటుంది. నిజాయితీగా మాట్లాడుకుంటే… వై.ఎస్. విజయమ్మకు విశాఖపట్నంలో సీటిచ్చి పోటీ చేయించాలని వైఎస్‌ఆర్‌సిపికి ఏ సర్వే చెబుతుంది? వికారాబాద్ నాయకుడికి జహీరాబాద్‌లో జనాదరణ ఉంటుందనో, తాండూరును తనకోసం మలుచుకున్న ఓ నాయకుడికి మహేశ్వరంలో టిక్కెట్టిస్తే గెలుస్తాడనో సర్వేల్లో వస్తుందా? నిర్హేతుకమైన ఆ వాదనకు ఏమైనా అర్థముందా? ప్రజాదరణ ఉండాలే తప్ప వ్యూహం పన్ని, ప్రభుత్వాధికారుల్ని బదిలీ చేసినట్టు చంద్రగిరి ఎంఎల్‌ఎ స్థాయి నాయకుడిని ఒంగోలులో ఎంపి అభ్యర్థిని చేసినా, గజ్వేల్‌లో సిఎం స్థాయి నాయకుడిని కామారెడ్డిలో కేవలం ఎంఎల్‌ఎ అభ్యర్థిగా పోటీ చేయించినా…. గెలవాలని లేదు, గెలవరు! రెండు వేల సంవత్సర మొదటి దశకం నుంచి ఈ అవలక్షణాలు మొదలయ్యాయి. పార్టీ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు, వివిధ సామాజిక వర్గాల- వృత్తుల నాయకుల మాటల్ని రాజకీయ పార్టీలు పరిగణనలోకి తీసుకోవడం లేదు, నేతలకు జనంతో సంపర్కం పోయింది. నెహ్రూ, ఇందిర, వాజ్‌పేయ్ వంటి కేంద్ర నాయకులతో పాటు చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఎన్‌టిఆర్, వైఎస్‌ఆర్ వంటి రాష్ట్ర నాయకులు… వివిధ పద్ధతుల్లో జనంతో మమేకమయ్యేవారు. ప్రజల మనోగతంపై పార్టీల స్థాయిలో మథనం జరిగేది. జనాభిప్రాయం తెలుసుకొని, అవసరాలు తీరుస్తూ… వారి విశ్వాసం పొందడం ద్వారా గెలవాలనే తలంపే క్రమంగా మరుగునపడుతోంది. ఎన్నికలంటే వ్యూహ ప్రతివ్యూహాలు, ప్రచారపుటెత్తుగడలు, దైనందిన ప్రకటనల్లో, వ్యాఖ్యల్లో, వ్యాఖ్యానాల్లో… ఎదుటివారిపై స్కోర్ చేయడం… ఇదీ వరస!
రాజకీయం సరుకా? సేవా?
పార్టీలు నియమించుకునే వ్యూహకర్తలు -సంస్థల్లోని అత్యధికులు మేనేజ్‌మెంట్ కోర్సులు చేసినవారు. కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను కూడా సమీపంగా చూసి ఉండరు. ప్రజల్ని కేవలం ఓటర్లుగా, ఇంకా చెప్పాలంటే మార్కెట్‌గా చూసే వారి కంటికి రాజకీయ పార్టీ ఒక ‘ఉత్పతి సరుకు’, అది గరిష్టంగా అమ్ముడుపోయేలా చూడటమే వారి పని! అదే వ్యాపార దక్షత!! అందుకే, వారి నైపుణ్యాల అమ్ములపొది నుంచి వచ్చిన స్కీంలు, రిబేట్లు, డిస్కౌంట్లు, ఆఫర్లు మారు పేర్లతో రాజకీయాల్లోనూ చెలామణి అవుతున్నాయి. ‘నవరత్నాల’యినా, అయిదు, ఆరు, ఏడు గ్యారెంటీల వరాలిస్తూ ‘రాహుల్ గ్యారెంటీ’ అని కాంగ్రెస్ చెప్పినా, ‘మోడీ గ్యారెంటీ’ అని బిజెపి ప్రచారం చేసినా… వీటికి మూలాలు ఈ వ్యూహకర్తల వ్యాపారపు మెదళ్లలోవే! భారత రాజ్యాంగం ప్రజలకు ‘గ్యారెంటీ’ ఇచ్చిన ప్రతి అంశానికీ దేశంలోని అన్ని పార్టీలు, ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని, ఉన్నాయనే మౌలికాంశాన్నే వీరు మరచిపోతున్నారు. ‘భారత్ వెలుగుతోంది’ నుంచి ‘బై బై బాబు’ వరకు, ‘ఇంటికో ఉద్యోగం’ నుంచి ‘ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని’ వరకు, ‘సబ్ కే సాత్ సబ్ కా వికాస్’ నుంచి ‘బాటింగేతో కాటింగే’ వరకు… ప్రాసలతో కూడిన నినాదాల జోరంతా వ్యూహకర్తల చలువే! ఆచరణకు వచ్చే సరికి అన్నీ తుస్సుమనేవే! నినాదాలతో ప్రజల్ని గొర్రెల్లా తమ వైపుకు లాక్కోవాలనే కుయుక్తుల కన్నా… జనం అసలు ఏం కోరుకుంటున్నారో గ్రహించి, అవి తమ విధానాలుగా ప్రకటించే చొరవ రాజకీయ పార్టీల్లో సన్నగిల్లుతోంది. రాజకీయం వ్యాపారం కాదు, సేవ అనే స్పృహే లోపిస్తోంది. వ్యూహకర్తల ఎత్తులు-జిత్తుల కన్నా… ప్రజల మనోభావాలే తమ రాజకీయ మనుగడను శాసిస్తాయనే వాస్తవాన్ని పార్టీలు మరచిపోతున్నాయి. కార్యకర్తల్ని లక్ష్యపెట్టడం లేదు. 2014 ఓటమి తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ, కార్యకర్తల భేటీలో ఓ చేదు అనుభవం చవిచూశారు. ‘పార్టీ కష్టాల్లో ఉంది…’ అని ఆయన ప్రసంగించబోతుంటే, ‘పార్టీ కష్టాల్లో ఉన్న సంగతి మాకూ తెలుసు, పార్టీ బాగుండి, అధికారంలో ఉన్నప్పుడెప్పుడైనా మీరు మా వంక చూశారా?’ అని ఓ కార్యకర్త గొంతెత్తడంతో ఆయన బిత్తరపోవాల్సి వచ్చింది.
అడ్డదారుల వెతుకులాట వల్లే…
రాజకీయ పార్టీలు ఒకప్పుడు సిద్ధాంతరీత్యా బలంగా ఉండేవి. విధానాలపై చర్చ, మేధో మథనానికి భేటీలు జరిగేవి. విధానపత్రాలు వెలువరించేది. ఎప్పటికప్పుడు శిక్షణా శిబిరాలుండేవి. 1995లో అధికార మార్పిడి తర్వాత సిఎం అయిన చంద్రబాబు, అటు ప్రజాక్షేత్రంలో నిరంతర కార్యక్రమాల్లో, ఇటు పార్టీ కార్యాలయంలో రోజూ సగటున రెండు, మూడు గంటలు గడిపేవారు. అధికారంలో ఉన్నా, దాదాపు అన్ని ప్రధాన పార్టీలకూ కార్యక్రమాలుండేవి. అట్టడుగు స్థాయి సమావేశాలు, ఇంటింటికీ వెళ్లటం, ప్రతి మనిషినీ కలవడం… వంటివి తరచూ జరిగేది. వీటన్నిటి ద్వారా ప్రజలతో రాజకీయ నాయకులకు ప్రత్యక్ష బంధం ఏర్పడేది. అది వారి ఆలోచనా విధానాన్ని, పాలనా పద్ధ్దతుల్ని ప్రభావితం చేసేది. ఇప్పుడేమీ జరగట్లేదు, జరిగినా… తూతూ మంత్రంగానే! కాలేజీలు, యూనివర్శిటీల్లో ‘విద్యార్థి రాజకీయాల’ ద్వారా యువతరం రాజకీయాల్లోకి వచ్చే మార్గమొకటి ఉండేది. అక్కడ్నుంచి యువనాయకుల్ని పార్టీలు ఎంపిక చేసుకునే ‘క్యాంపస్ సెలక్షన్’ ప్రక్రియ అమలయ్యేది. ఫలితంగా ప్రజలనాడి ప్రాధాన్యత తెలిసిన యువతరం రాజకీయాల్లో క్రమంగా ఎదిగేది. పార్టీల్లో… ప్రతి ఎన్నిక తర్వాత గెలుపోటముల్ని అధ్యయనం చేసే సమీక్షలుండేవి. చంద్రబాబు 27కు పరిమితమైనప్పుడు గానీ, జగన్మోహన్ రెడ్డి 11కు దిగజారినప్పుడు గానీ, కెసిఆర్ ఆరుమాసాల్లో రెండు ఎన్నికల్లో ఘోరంగా ఓడినపుడు గానీ… నిజాయితీ సమీక్షలే జరుగలేదు. ఇక తప్పొప్పులు తెలిసేదేలా? పార్టీల బలహీనతలు తెలుసు కాబట్టే వ్యూహ సంస్థలు, వ్యూహకర్తలు సమర్థ్థంగా వారిని తమ బుట్టలో వేసుకుంటున్నారు. బంధం కొనసాగుతోంది!

దేవరకొండ బాలగంగాధర్ తిలక్
ప్రార్థన (అమృతం కురిసిన రాత్రి)లో అన్నట్టు
‘దేవుడా రక్షించు నా దేశాన్ని….
కోట్ల మనుష్యుల, నిజమైన ప్రాణంవున్న
మనుష్యులతో నిండిన దేశం నాది
సరదాగా నిజాయితీగా జాలీజాలీగా
హాయి హాయిగా బ్రతుకుతాం
మాకు నటనలు వద్దు మా చుట్టూ కటకటాలు వద్దు
గొప్పలూ గోసాయి చిట్కాలూ వద్దు…’

దిలీప్ రెడ్డి(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News