మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికపై మూడు ప్రధాన పార్టీలు మరింత దూకుడును పెంచాయి. ఎన్నికల ప్రచార పర్వాన్ని మరింత ముమ్మరం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ బహిరంగ సభలను ఏర్పాటే చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన టిఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా.. ఆ మర్నాడే బిజెపి నిర్వహిస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేసుకునే పనిలో నిమగ్నమైంది. దీంతో మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సెగలు పుట్టిస్తోంది. ఉపఎన్నికకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాకముందే టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు
ఉపఎన్నికను సవాల్‌గా తీసుకుని పనిచేస్తున్నాయి. మరోసారి సత్తా చాటాలనిఉవ్విళ్లూరుతున్నాయి. ఈ ఎన్నికల్లో వెలువడే తీర్పు ప్రజల మూడును తెలియజేనుండడంతో.. గెలవడం అన్నది అన్ని పార్టీలకు అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నువ్వా? నేనా? అన్నట్లుగా తలబడుతున్నాయి. ఇందులో టిఆర్‌ఎస్ ఒకింత దూకుడుగానే ముందుకు సాగుతోంది. ఆ నియోజకవర్గంలో ఇప్పటికే మంత్రి జగదీశ్‌రెడ్డి మకాం వేసి అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ప్రతి రోజు పాదయాత్రలను నిర్వహిస్తున్నారు. గడప..గడపకు ప్రచారం చేస్తూ దూసుకపోతున్నారు. ఇదిలా ఉండగాఈ నెల 20వ తేదీన మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరవుతుండడంతో పార్టీ శ్రేణులంతా జన సమీకరణలో నిమగ్నమయ్యారు. ప్రతి బస్తీ, గ్రామం, మండలం వారిగా పెద్దఎత్తున బహిరంగ సభకు జనాలను తరలించే విధంగా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలకు ఇప్పటికే ఆ బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మనుగోడును గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో మరోసారి తమకు ఎదురులేదని నిరూపించుకోవాలన్న కసితో గులాబీ శ్రేణులు పనిచేస్తున్నారు.
కాగా కాంగ్రెస్ సిట్టింగ్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఆ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఉపఎన్నికలో ఆ పార్టీ పక్షానే ఆయనే అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. దీంతో మునుగోడులో విజయం సాధించడం అన్నది బిజెపి చాలా ముఖ్యం. ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని బిజెపి నేతలు పదేపదే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌గోపాల్‌రెడ్డి విజయం సాధిస్తే అది ప్రజల్లో బలంగా వెళ్లే అవకాశముంది. దీంతో మునుగోడుపై కాషాయ జెండా ఎగిరితేనే… రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చే అవకాశముంటుందని రాజకీయవర్గాల్లోనూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలో విజయం సాధించడంపై దృష్టి సారించిన కమలనాధులు ఈ నెల 21వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఆహ్వానించారు. ఈ సభకు ఆయనకు హాజరుకానుండడంతో బిజెపి నాయకులు, శ్రేణులంతా జన సమీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. తమ సభకు ఒక రోజు సిఎం సభకు జరుగుతుండడంతో….ఆసభకు వచ్చిన ప్రజలను మించి సమీకరించే విధంగా కసరత్తు చేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ కూడా మునుగోడును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ సిట్టింగ్ స్థానామైన ఈ నియోజకవర్గాన్ని మరోసారి గెలుచుకోవాలని ఉవ్వీలూరుతోంది. ఈ నేపథ్యంలో మన మునుగోడు…మన కాంగ్రెస్ అనే నినాదంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రచారంలో దిగనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్‌తో బాధపడుతున్న రేవంత్ ఇప్పుడుప్పుడే కోలుకున్నారు. ఈ నేపథ్యంలో మనుగోడులో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని సాగించే విధంగా ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో రేవంత్ మంతనాలు కూడా సాగించారు. ఉపఎన్నికల ముగిసేంత వరకు నాయకులు ఎవరు పార్టీ క్రమ శిక్షణను దాటవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే విబేధాలు ఏమైనా ఉన్నా వాటిని పూర్తిగా పక్కనపెట్టాలని సూచించారు. మునుగోడులో విజయం సాధిస్తే.. తప్పకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు ప్రజల్లో మరింత బలపడతాయని పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఆ పార్టీ నేతల్లో సమైఖ్య రాగాలు వినిపిస్తున్నాయి. ఇది పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ను నింపుతోంది. నాయకుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుండడంతో రేవంత్‌రెడ్డి మరింత దూకుడుగా వెళ్లే అవకాశముందని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. దీంతో మొత్తంగా మునుగోడు ఉపఎన్నికల రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూడం ఖాయమని తెలుస్తోంది.
Political Parties focus on Munugode Bypoll 2022