Wednesday, December 25, 2024

పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా

భూపాలపల్లి కలెక్టరేట్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమవంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఖర్చుల నమోదు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా మాట్లాడుతూ పారదర్శకంగా ప్రతి అభ్యర్థికి సమాన హక్కులు కల్పిస్తూ ఎన్నికలను నిర్వహించడమే లక్షంగా పని చేస్తున్నామని, ప్రతి అభ్యర్థి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థి ఎన్నికల ఖర్చు వేయడం గరిష్ట పరిమితి రూ.40లక్షలుగా నిర్ధారించిందని, అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుండి కౌంటింగ్ రోజు వరకు చేసే ప్రతి ఖర్చును అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు.

అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ విడుదల జరిగిందని, అభ్యర్థులు నామినేషన్ వేసే వరకు ప్రచారానికి వినియోగించే డబ్బును పార్టీ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, వాటి వివరాలను సైతం ఎన్నికలు ముగిసిన 70 రోజులలో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ వేసినప్పటి నుండి అభ్యర్థి ఎన్నికల కోసం చేసే ఖర్చులకు ప్రత్యేకమైన బ్యాంక్ ఖాతా ప్రారంభించాల్సి ఉంటుందని, అందులో నుండి మాత్రమే ఎన్నికల ఖర్చులు చేయాలని, వీటిని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల బృందాలు నిశితంగా పరిశీలిస్తాయని అన్నారు. రాబోయే రోజులలో జిల్లాలో జరిగే రాజకీయ పార్టీల సమావేశాలు, సభలు ప్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు పంపిణీ, విఐపిలు పాల్గొనే బహిరంగ సభలు వాటికి అయ్యే వివరాలను నిషితంగా పరిశీలించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అభ్యర్థి ఖాతాలో నమోదు చేస్తామని, జిల్లాలో ఉన్న ప్రింటర్లు జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం అందించకుండా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రింటింగ్ చేయడానికి వీలులేదని, ఎన్నికల ప్లెక్సీలపై ఎవరు ముద్రిస్తున్నారో వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ప్రింట్ చేయాలని అన్నారు.

ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం ప్రభావం ఉండకుండా నిరంతరం నిఘా ఉంటుందని, డబ్బు, మద్యం పంపిణీ చేసి ప్రజలు ప్రలోభ పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రజా ప్రాతినిధ్య 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియామవళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సి విజిల్ యాప్ ద్వారా లైవ్ వీడియో, లైవ్ ఫోటోలతో ఫిర్యాదు చేయవచ్చని, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు 24గంటల పాటు నమోదు చేయవచ్చని తెలిపారు. 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామని, సి విజిల్ యాప్‌లో నమోదైన ఫిర్యాదులను 100 నిముషాలలో పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు.రాజకీయ పార్టీలకు నాయకులకు సమావేశాలు నిర్వహించేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, సువిధా యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, 10గంటల నుండి ఉదయం 6గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని అన్నారు. రాజకీయ సమావేశాలు, ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలు, పోలింగ్ కేంద్రాలకు 100మీటర్ల పరిధిలో నిర్వహించవద్దని ఎన్నికల అధికారి తెలిపారు.

అక్టోబర్ 30 వరకు నూతన ఓటరు నమోదు కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఓటరు జాబితాలో పేర్లు లేకుండా ఎవరైన అర్హులైన ఓటర్లు ఉంటే వెంటనే దరఖాస్తు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఆడిట్ అధికారి శ్రవణ్, డిపిఆర్‌ఓ వి శ్రీధర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రింటింగ్ ప్రెస్, ప్లెక్సీ షాప్స్ యజమానులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News