Saturday, November 23, 2024

విలువలు లేని పాలక పార్టీలు!

- Advertisement -
- Advertisement -

పాలక పార్టీలైన జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు, ఆ పార్టీల నాయకులకు కనీసం బూర్జువా విలువలు కూడా లేకుండాపోయాయి. ఎలాగైన తాము, తమ పార్టీ అధికారంలో ఉండాలి. అందుకోసం ఏమైనా చేస్తాం, ఎవరితోనైనా కలుస్తాం, పార్టీలను విలీనం చేస్తాం, పార్టీలను మారుస్తామని సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నాయి. వారు ‘పవిత్రంగా’ భావించే రాజ్యాంగానికే తూట్లు పొడుస్తున్నాయి. మతం, కులం, తెగలను, ప్రాంతీయతను రెచ్చగొడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాయి.బిజెపి నాయకత్వాన అధికారంలో ఉన్న ఎన్‌డిఎ కూటమి హిందు మతం, హిందుత్వ అనే దాన్ని తన అధికారానికి సోపానంగా ఎంచుకుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హిందు మత ప్రచారం చేస్తూ, మైనారిటీ మతాలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొడుతున్నది. మైనారిటీ మత ప్రజలు దేశ ప్రజలు కాదనే భావన ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నది. బాబ్రీ మసీదు కూల్చివేత, రామ జన్మ భూమి పేరుతో అయోధ్యలో రామాలయ ఏర్పాటు, అట్టహాసం ప్రారంభం, బాల రాముని విగ్రహ ప్రతిష్ట, అందుకు వందల కోట్ల రూపాయల ఖర్చు, పెద్దఎత్తున ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడం, దేశ వ్యాప్తంగా ఒక పూట సెలవు ప్రకటించడం అందుకు స్వయంగా ప్రధాని మోడీనే కార్యక్రమానిక నాయకత్వం వహించడం ప్రత్యేకత సంతరించుకుంది.

భారత రాజ్యాంగాన్ని గొప్ప లౌకిక, ప్రజాస్వామికమైనదిగా పాలక పార్టీలన్నీ కీర్తిస్తూ ప్రచారం చేస్తున్నాయి. మత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండరాదని, అది ప్రజల విశ్వాసానికి సంబంధించిందని భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణగా ఉన్న ప్రభుత్వం దాన్ని పాటించాలి. గత పాలకులు పరోక్ష పద్ధతుల్లో అందుకు తిలోదకాలు ఇవ్వగా, మోడీ ప్రభుత్వం ‘పవిత్ర’ రాజ్యాంగాన్ని పక్కన పెట్టింది. ఒక మతానికి ప్రచారకులుగా ప్రాంతీయ పార్టీలు కూడా వ్యవహరిస్తున్నాయి. మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఒక అంశమైతే, వారు నమ్మే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా ఏ మాత్రం పాటించడం లేదు. అధికారంలోకి ఎలా రావాలి, ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి, ప్రతిపక్ష ప్రభుత్వాలను ఎలా కూల్చాలి. ఇతర పార్టీల సభ్యులను ఎలా ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకోవాలి, ఒక కూటమిని మరొక కూటమి ఎలా విచ్ఛిన్నం చేయాలి అన్నకుట్రలు, కుతంత్రాలతో మునిగితేలుతున్నాయి. ఇందు లో బిజెపి అగ్రస్థానంలో ఉంది. ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీల ఎంపిలను, ఎంఎల్‌ఎలను ప్రలోభాలతో తనవైపుకి తిప్పుకుని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం, వారి మద్దతుతో ప్రభుత్వాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.

పార్లమెంట్, శాసనసభ సభ్యులు మరొక పార్టీలోకి ఫిరాయిస్తే వారి సభ్యత్వం రద్దు అవుతుందని పార్లమెంట్ చట్టం చేయడం జరిగింది. స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ దీన్ని తనకు అనుకూలంగా ఉన్న వారికి వర్తింపచేయకుండా అడ్డుపడుతున్నది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ సభ్యులకు మాత్రమే వర్తింపు జరుపుతున్నది. దీన్ని గమనిస్తే అధికారంలో ఉన్న పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎలా అపహాస్యం చేసేది తెలుపుతున్నది.
ఎన్నికలు దగ్గరపడిన సమయంలో వివిధ పార్టీలతో కూడిన ఫ్రంట్‌లు ఏర్పడ్డాయి. ఎన్‌డిఎ కూటమిలో అదనంగా కొన్ని పార్టీలు చేరాయి. కాంగ్రెస్‌తో కలసి 28 పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడి ఎన్‌డిఎను ఎన్నికల్లో ఎదుర్కొంటామని ప్రకటించాయి. దీనికి సమన్వయ కర్తగా బీహార్ ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ వ్యహరించాడు. ‘ఇండియా’ కూటమిలో ప్రాంతీయ పార్టీలే ఎక్కువగా ఉన్నాయి.ఈ కూటమిలో సిపిఐ, సిపిఐ(ఎం) పార్టీలూ చేరాయి. ఈ కూటమి లక్ష్యం ఎన్‌డిఎను ఓడించడం. ఈ కూటమిలోని అనేక ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌కు మధ్య విభేదాలతో పాటు సీట్ల సర్దుబాటు తీవ్రసమస్యగా ముందుకు వచ్చింది. అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన కూడా అలాగే ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో ఎన్నికల సర్దుబాటును వ్యతిరేకించింది.

‘ఇండియా’ కూటమి రెండు మూడు సార్లు సమావేశమై మల్లికార్జున ఖర్గేను ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఎక్కువ మంది బలపర్చారు. మమత, కేజ్రీవాల్ కూడా ఖర్గేకి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామానికి ముందు జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలకు కాంగ్రెస్ సీట్లను కేటాయించక పోవడం, నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో ‘ఇండియా’ కూటమిలో విభేదాలు తీవ్రమయ్యాయి. కూటమి ప్రధాని అభ్యర్ధిగా ఖర్గేను ప్రకటించడం నితీశ్ కుమార్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. దాంతో ‘ఇండియా’ కూటమి నుండి బయటకు రావాలనే నిర్ణయానికి వచ్చారు. ఎన్‌డిఎ కూటమిని ఎదుర్కోవడానికి ఆ కూటమి నుండి బయటకు వచ్చి ‘ఇండియా’ కూటమి ఏర్పాటుకి ముఖ్య భూమిక వహించిన నితీశ్ కుమార్ తిరిగి బిజెపి కూటమిలో చేరాలని నిర్ణయం తీసుకుని కాంగ్రెస్, ఆర్‌జెడితో కలసి ఏర్పాటు చేసిన ప్రభుత్వ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ‘ఇండియా’ కూటమి నుండి బైటకు వచ్చారు. బిజెపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు.సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ పదవే పరమావధిగా భావిస్తూ అనేక పార్టీలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ‘ఇండియా’ కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్ధిగా తానే ఉంటాననే భావించించారు. అది జరగకపోయేసరికి ఎన్‌డిఎ పంచనచేరారు. దీన్ని గమనిస్తే ఆయన ఊసరవెల్లి రాజకీయాలు, పదవీకాంక్ష, అవకాశవాదం వెల్లడిఅవుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇందుకు మినహాయింపు కాదు.

కాంగ్రెస్‌ని వ్యతిరేకించడం, సమర్ధించడం అనే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. నేడు కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ప్రకటించారు. తన ప్రభుత్వంపై అనేక అవినీతి కుంభకోణాల కేసులు ఉన్నాయి. వాటి నుండి బయటపడడానికే కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకించడం. ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్ పెద్ద పార్టీ. అది ఇతర పార్టీలను కలుపుకుపోవడంలో వైఫల్యం చెందింది. ఒంటెత్తు ధోరణితో వ్యవహరించింది. తన ప్రజా వ్యతిరేక విధానాలతో అధికారానికి దూరమైంది. అత్యంత బలహీనంగా మారింది. ఈ పార్టీలో అనైక్యత తరచూ వ్యక్తమవుతున్నది. ‘ఇండియా’ కూటమిని ముందుకు నడిపించే సామర్థాన్ని కోల్పోయినా పెద్దన్న పాత్రను కోరుకుంటున్నది. భారత రాజ్యాంగ పరిధిలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా అధికారంలోకి వచ్చి సోషలిజాన్ని సాధిస్తామని చెబుతున్న సిపిఐ, సిపిఐ(ఎం) పార్టీలు అందుకోసమైనా స్వతంత్ర పార్లమెంటరీ విధానాలను ఎందుకు ఆచరించడం లేదు. స్వతంత్రంగా ఎందుకు పోటీ చేయడంలేదు? ఏదో ఒక పాలక పార్టీతో ముడివేసుకుని ఎందుకు నడుస్తున్నాయి? పార్లమెంటరీ ‘ప్రజాస్వామ్యం’లో గెలవడానికైనా ప్రజాఉద్యమాలు ఎందుకు చేపట్టలేకపోతున్నాయి? ఎన్‌డిఎ కూటమిని ఓడించాలనుకుంటున్న పార్టీలు అందుకు అనుగుణంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నాయి? ప్రజలను పేదరికం నుండి బయటపడేందుకు వారి ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరుస్తామని అన్ని పాలక పార్టీలు చెబుతున్నాయి.

ఎలా మెరుగుపరిచేది చెప్పడం లేదు. దేశ సంపద కొద్ది మంది సంపన్నుల వద్ద పోగుపడి ఉంది. పాలక పార్టీల నాయకులు వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా ఉన్నారు. బడాభూస్వాముల, ఎస్టేట్‌దారుల వద్ద పెద్ద ఎత్తున భూములు వున్నాయి. సంపన్నవర్గాల వద్ద పోగుబడిన సంపదను, బడాభూస్వాముల వద్ద ఉన్న భూములను పేదలకు పంచినప్పుడే వారు పేదరికం నుండి బయటపడతారు. ఇలాంటి విధానాలు అమలు జరుపుతామని ఏ పాలక పార్టీ చెప్పడం లేదు. పేదరికం గురించి పాలక పార్టీలు మాట్లాడడమంటే వారిని మభ్యపెట్టి మోసగించడమే. జాతీయ పార్టీలైనా, ప్రాంతీయ పార్టీలైనా ఒకే ఆర్థిక, రాజకీయ విధానాలు అమలు జరుపుతున్నాయి. సామ్రాజ్యవాదుల, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాముల దోపిడీకి అనుకూలమైన విధానాలనే అమలు జరుపుతున్నాయి. ఇందులో ఎటువంటి మినహాయింపులు లేవు. వారి ప్రయోజనాలు కాపాడడానికి మేమంటే మేము అధికారంలో ఉంటామని మాత్రమే తగవులు పడుతున్నాయి. ఈ వాస్తవాలను గమనించి పాలకుల విధానాలకు వ్యతిరేకంగా అన్ని రకాల దేశ సహజ వనరులు, సంపదలు, భూములు తమకే చెందాలని ప్రజలు ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News