Thursday, January 23, 2025

ఇసిపై రాజకీయ పెత్తనం!

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అదే విధంగా ప్రజాస్వామ్య విలువలు పాటించడంలో ప్రపంచంలోనే భారత దేశం అగ్ర స్థానంలో ఉంది. ఇటీవల దేశ వ్యాప్తంగా జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలు ఆదర్శవంతమైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అగాధంలోకి నెట్టివేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ప్రజాస్వామ్య పరిరక్షణలో దేశ ఎన్నికల సంఘం ప్రధాన పాత్ర పోషిస్తున్నది. స్వయం ప్రతిపత్తి కలిగిన భారత దేశ ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం జనవరి 25 వతేదీ 1950 సంవత్సరంలో ఏర్పడింది.ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు ఉన్న చట్టాలకు లోబడి ఎన్నికల సంఘం తమ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఎన్నికల సంఘానికి అనుబంధంగా ఆర్టికల్ 327లోని 43 చట్టం ద్వారా ప్రజాప్రాతినిధ్యం చట్టం జులై 17 వతేదీ 1951 సంవత్సరంలో రూపొందించబడింది. ఏడు దశాబ్దాల క్రితం ఏర్పడిన ఎన్నికల సంఘం, ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951లోని బలహీనమైన నియమాలను ఆసరా చేసుకుని అధికారం కొరకు దేశంలోని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ ఉండడం దురదృష్టకరం.

ఎన్నికల సంఘం, ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951లోని బలహీన నియమాలను తొలగించి ప్రజాస్వామ్య పరిరక్షణకు వాటి స్థానంలో కఠిన నియమాలు రూపొందించమని దేశ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అనేక దశాబ్దాల నుంచి సంబంధిత కేంద్ర ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారు. ఓటర్ కార్డుకు ఆధార్ ను లింకు చేసే ఎన్నికల నియమావళి సవరణ బిల్‌ను 2021వ సంవత్సరం డిసెంబర్ నెల 22, 23 తేదీలలో పార్లమెంటు ఉభయ సభలు క్షణాల వ్యవధిలో ఓటింగ్ ప్రక్రియ లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదించాయి. ఈ బిల్ ద్వారా బోగస్ ఓటర్లను తొలగించి ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళన చేసి ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత పెంచినట్లు అయ్యిందని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పరిపూర్ణ సంస్కరణలతో దేశ ఎన్నికల వ్యవస్థను పటిష్ట పరుస్తుందని ఈ పరిణామం చూసిన ప్రజలందరూ ఆశించారు. భారత దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించే త్రిసభ్య కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో

ఎన్‌డిఎ ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రత్యేక బిల్లు ఆమోదించింది. ఈ పరిణామం ప్రజాస్వామ్యవాదులను షాక్ గురి చేసింది. ఆ బిల్లు ప్రకారం తొలగించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధా ని సూచించిన కేంద్ర కేబినెట్ మంత్రిని త్రిసభ్య కమిటీలో నియమించాల్సి ఉంది. ప్రస్తుతం సిఇసి, ఇద్దరు ఇసిలను నియమించే త్రిసభ్య కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని సూచించిన కేంద్ర కేబినెట్ మంత్రి ఉంటారు. ఈ త్రిసభ్య కమిటీలో ఉన్న ముగ్గురూ రాజకీయ నేతలే. వీరిలో ఇద్దరు అధికార పార్టీకి చెందిన వారు కాగా, ఒక్కరు విపక్ష నేత కావడం గమనార్హం. కనుక సహజంగానే ప్రధాని, కేబినెట్ మంత్రి ఇద్దరూ సూచించిన వ్యక్తినే సిఇసి, ఇసిలుగా రాష్ట్రపతి నియమిస్తారు. ఎన్నికల వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకొని తమ రాజకీయ ఆధిపత్యాన్ని అప్రతిహతంగా దేశ వ్యాప్తంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన త్రిసభ్య కమిటీని రూపొందించినట్లు ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని కచ్చితంగా చెప్పవచ్చు. ఓటర్ కార్డుకు ఆధార్ కార్డ్ లింకు చేసి మొత్తం ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసినట్లు గొప్పలు చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన త్రిసభ్య కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం

అప్రజాస్వామ్యమని గుర్తుకు రాకపోవడం శోచనీయం. బోగస్ ఓటర్ల విషయంలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటా యి. ఏ మాత్రం అనుమానం ఉన్నా సంబంధిత ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేసే పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో బోగస్ ఓటర్ల విషయంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలే దీనికి నిదర్శనం.ఓటర్ కార్డుకు ఆధార్ లింకు చేయడం మంచి నిర్ణయమే అయినా -చేయవలసిన ఎన్నికల సంస్కరణలతో పోలిస్తే అది అణువంతు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఎన్నికలలో పరిమితికి మించి జరుగుతున్న ధన ప్రవాహాన్ని అరికట్టవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎన్నికల నియమావళి ప్రకారం శాసన సభకు పోటీ చేసే అభ్యర్థి రాష్ట్రాల వారీగా రూ. 54 నుంచి రూ. 70 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి రూ. 70 నుంచి రూ. 95 లక్షలు ఎన్నికల కోడ్ ప్రారంభం అయిన నాటి నుంచి కౌంటింగ్ రోజు వరకు ఖర్చు చేయవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు, అభ్యర్థుల కోసం వారి అనుచరులు చేసే పబ్లిసిటీ ఖర్చు కూడా ఈ మొత్తాన్ని

కంటే ఎక్కువ ఉంటుందనేది నిర్వివాదాంశం. ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు లేదా స్టార్ క్యాంపయినర్‌లు నిర్వహించే ఒక్కొక్క బహిరంగ సభకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అనధికారికంగా రూ. 40 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తూ ఉంటారు. అదే విధంగా ఎన్నికల ముందు ఓటుకు రెండు వేల నుంచి అయిదు వేల రూపాయలు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈ విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసే వ్యక్తులకే ప్రధాన రాజకీయ పార్టీలు శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తున్నాయి. పర్యవసానంగా కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేసే పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఎన్నికల్లో నెగ్గిన ఇటువంటి వారికి ప్రజాసేవ పై ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటుందో , ప్రజాస్వామ్య విలవలు, నైతిక విలువలు ఏ మాత్రం పాటిస్తారు? సామాన్య మానవుడు సైతం అర్ధం చేసుకోవచ్చు. అదే విధంగా గెలిచిన రాజకీయ పార్టీలను వీడి అధికార పార్టీలలోకి ఫిరాయింపులు ఎక్కువయ్యాయి. ఆ విధంగా పార్టీ ఫిరాయించిన వారిలో కొందరు మంత్రి పదవులు కూడా పొందుతున్నారు.

ఈ విధంగా పార్టీ ఫిరాయించిన వారు పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న లోప భూయిష్టమైన నియమాల వలన తమ పదవీ కాలాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటూ ఉండడం గమనార్హం. 1985 సంవత్సరంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయబడింది. ఆ చట్టంలో స్పీకర్ లేదా ఛైర్మన్‌కు పార్టీ ఫిరాయించిన వారిపై చర్య తీసుకునే అధికారం ఇవ్వబడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం సక్రమంగా అమలయ్యే విషయం లో ఈ నియమమే గుదిబండగా మారింది. ఈ నియమాన్ని పునః సమీక్ష చేయవలసిన అవసరం ఉంది. ఎన్నికల్లో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం మెరుగ్గానే ఉంది. పట్టణ, నగర ప్రాంతాలలో ఓటింగ్ శాతం ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ముఖ్యంగా విద్యావంతులు ఓటింగ్‌లో పాల్గొనడం లో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. ఓటు వేసిన వారు ప్రభుత్వ వైఫల్యాలపై గుంభనంగా వ్యవహరిస్తూ తమ పని తాము చేసుకుంటూ రాబోయే ఎన్నికల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఓటు హక్కు వినియోగించుకోని విద్యావంతులలో అధిక భాగం తమకు లబ్ధి చేకూర్చలేదని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కాలయాపన చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఓటింగ్ శాతం పెరిగే విధంగా కఠిన నియమాలు రూపొందాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఇటువంటి అనేక విషయాలపై కఠిన నియమాలు రూపొందించి ఎన్నికల సంఘాన్ని, ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్ట పరచవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News