Saturday, November 23, 2024

పశువులను బలిగొంటున్న రాజకీయ ర్యాలీలు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: రాజకీయ పార్టీలు నిర్వహించిన ర్యాలీలు పశువులకు ప్రాణాంతకంగా మారాయి. కర్నాటకలోని యాద్గిర్, రాయచూర్ జిల్లాలలో ఇటీవల జరిగిన రెండు రాజకీయ పార్టీల ర్యాలీలలో మిగిలిపోయిన ఆహారాన్ని తిని 22 పశువులు మరణించాయి. తాజా సంఘటన మార్చి 25న యాద్గిర్ జిల్లాలోని యోర్గోల్ గ్రామంలో వెలుగు చూసింది.
మార్చి 24న గుర్మిత్కల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జెడిఎస్ తరఫున పోటీ చేయనున్న శరణగౌడ కందకూర్ యెర్గోల్ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

కాగా.. ర్యాలీ తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని గ్రామానికి చెందిన 30, 35 పశువులకు ర్యాలీ నిర్వాహకులు తినిపించారు. తమ పశువులు కనిపించకపోవడంతో వెతుక్కుంటూ ర్యాలీ జరిగిన ప్రాంతానికి చేరుకున్న వాటి యజమానులకు కడుపు ఉబ్బిపోయి చనిపోయిన తమ పశువులు కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని వారు పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియచేయగా వారు పోస్టు మార్టం నిర్వహించి చనిపోయిన పశువులు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని అపరిమితంగా తిన్నాయని, అధికంగా అన్నం తినడంతో అవి మరణించాయని డాక్టర్లు నిర్ధారించారు. ఒక్కో పశువు దాదాపు 5 కిలోల అన్నం తిన్నట్లు వారు తెలిపారు.

ఇటువంటిదే మరో సంఘటన మార్చి 10న కూడా జరిగింది. రాయచూర్ తాలూకాలోని గుంజల్లి గ్రామంలో బిజెపి నిర్వహించిన విజయసంకల్ప యాత్ర సందర్భంగా మిగిలిపోయిన ఆహారాన్ని తిని ఏడు పశువులు మరణించినట్లు అధికారులు తెలిపారు. అపరిమితంగా అన్నం తినడం వల్లే ఈ పశువులు మరణించినట్లు వారు చెప్పారు. రాజకీయ పార్టీలు తమ ర్యాలీల తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని, ఇతర ఆహార పదార్థాలను పశువులకు పెట్టవద్దని, బిర్యానీ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల పశువులు జీర్ణశక్తి నశించి మరణిస్తాయని పశు సంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News