Sunday, December 22, 2024

కశ్మీరీ మనోభావాలకు కాలపరీక్ష

- Advertisement -
- Advertisement -

రాష్ర్ట హోదా కోల్పోయిన తర్వాత లడఖ్ రహిత జమ్మూకశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతమైంది. ఎప్పట్లాగే జమ్మూ, కశ్మీర్… ఈ రెండు ప్రాంతాలు వైవిధ్య రాజకీయ స్వభావాన్నే ఇంకా కనబరుస్తున్నాయి. కశ్మీర్‌లోయ ప్రధానంగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి)కి పట్టున్న ప్రాంతం కాగా, జమ్మూ ప్రాంతంపై బిజెపికి పట్టుంది. 2014 ఎన్నికల తర్వాత నాటకీయ పరిణామాల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరచి, 2018 వరకు నడిపిన బిజెపి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పిడిపి)ల మధ్య ఇపుడు ఎన్నికల పొత్తేమీ లేదు. విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. పిడిపి నిజానికి, కాంగ్రెస్ పరోక్ష నాయకత్వంలోని ‘ఇండియా’ విపక్ష కూటమిలో ఉంది. నిన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌సి లాగే పిడిపి కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంది. ఇప్పుడా బంధం లేదు. సీట్ల ఒప్పందంతో ఎన్‌సి కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక్కడొక ఆసక్తికర అంశముంది. ఈ కూటమి జమ్మూలో, బిజెపి కశ్మీర్‌లో ఏ మేరకు అదనపు ప్రభావం చూపగలవు? అన్నది స్థూలంగా రేపటి ఎన్నికల ఫలితాల మొగ్గును నిర్ణయిస్తుంది.

2002 ఎన్నికల గెలుపు తర్వాత పిడిపి ఒక శక్తిగా ఎదిగినా, ఎన్‌సికి ఉన్నంత పార్టీ యంత్రాంగం వ్యవస్థ దానికిలేవు. పైగా సంకీర్ణ ప్రభుత్వం (2014-18) నడిపిన తర్వాత పిడిపి బలహీనపడిపోయినట్టు, లోక్‌సభ ఎన్నికల్లో వారి ఆధిక్యత 5 అసెంబ్లీ స్థానాలకు పడిపోవడాన్ని బట్టి తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కశ్మీర్‌లోని రెండు స్థానాలు శ్రీనగర్, అనంతనాగ్ ఎన్‌సి గెలిస్తే, బారాముల్లా నుంచి ఎన్‌సి నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ ఫరూఖ్‌ను, జైలు నుంచే పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ఇంజనీర్ రషీద్ ఓడించారు. బెయిల్‌పైన వచ్చి, ఆయనిపుడు ప్రచారం చేస్తున్నారు. అది ఎవరి అవకాశాలకు దెబ్బ? అన్నది చర్చనీయాంశమే! ఉదవ్‌ుపూర్‌తో సహా జమ్మూ ప్రాంతపు రెండు స్థానాలు బిజెపి నెగ్గింది. నిన్నటి ఎన్నికల్లో ఎన్‌సి (36), కాంగ్రెస్ (7) సాధించిన ఆధిక్య అసెంబ్లీ స్థానాలను కలిపితే 43. అంటే, రేపటి ఎన్నికల్లో కొంత శ్రమిస్తే మ్యాజిక్ నంబర్ 46/ 90 చేరుకోవడం ఈ కూటమికి సాధ్యపడొచ్చు! ఇప్పటి వరకున్న సమాచారం, సంకేతాలను బట్టి ఈ కూటమికే ఆధిక్యత కనిపిస్తోంది. పిడిపితో పాటు అప్ని (ఎపిఎన్‌ఐ), గులావ్‌ు నబీ ఆజాద్ నేతృత్వంలోని డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి),

సాజాద్‌లోనేకు చెందిన ‘పీపుల్స్ కాన్ఫరెన్స్’ వంటి చిన్నా చితకా పార్టీలున్నా… వాటి ప్రభావం అంతంతే!
మంత్రానికి చింతకాయలు రాలనట్టే అభివృద్ధికి ఓట్లు పడవా? అంటే, అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. గత అయిదేళ్లలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అభివృద్ధి, ఏ ప్రమాణాలతో కొలచినా ఎన్నదగిందే! కేంద్ర రాష్ర్ట పథకాలతో కలిపి, పెద్ద మొత్తం నిధులు వెచ్చించి వివిధ పనులు చేపట్టారు. అందులో ఇప్పటికే కొన్ని మొదలైతే, ఇంకొన్ని ప్రణాళికలో ఉన్నాయి. అందుకే, బిజెపి ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తోంది. అధికరణం 370 ఎత్తివేసిన తర్వాత భూఉపరితల రైలు విమాన మార్గాలను కలిపే రవాణాతో పాటు ఇతర మౌలిక సదుపాయాల వృద్ధిలో, ప్రయివేటు పెట్టుబడులు రాబట్టి ఉద్యోగఉపాధి అవకాశాలు పెంచడంలో, పట్వారీ వ్యవస్థను వదిలించుకొని ల్యాండ్ రికార్డులను డిజిటలైజ్ చేయడంలో, సరిపడా విద్యుత్ ఉత్పత్తిలో… ఇలా పలు రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించినట్టు గణాంకాలతో వివరిస్తోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన అమలులో దేశంలోనే జమ్మూకశ్మీర్ అగ్రగామిగా ఉంది.

అయిదేళ్లలో ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగాలు 43 వేలు ఇస్తే, ఒక్క 2023 24 లోనే 1.2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. పబ్లిక్ సర్వీసెస్ గ్యారెంటీ చట్టం తీసుకువచ్చి, 1100 సేవల్ని ఆన్‌లైన్ చేసిన తర్వాత, పౌరుల సౌలభ్యం పెరగటమే కాక అవినీతి రమారమి తగ్గినట్టు పాలకపక్షం ప్రచారం చేస్తోంది. విమాన రోడ్డు రైల్ మార్గాల మధ్య సమన్వయం పెంచి చేపట్టిన పలు ప్రాజెక్టులకు రూ. 1.5 లక్షల కోట్లు వెచ్చించారు. శ్రీనగర్ నుంచి జమ్మూ రావాలంటే 8 గంటలు పట్టేది, ఇప్పుడు 5 గంటల్లో హాయిగా వచ్చేస్తున్నారు. ఇది వరకు రోజూ సగటున జమ్మూ నుంచి అయిదారు, శ్రీనగర్ నుంచి 20 22 విమానాలు మాత్రం ఎగి రేవి. ఇప్పుడు… రోజూ జమ్మూ నుంచి 48, శ్రీనగర్ నుంచి 140 విమానాలు తిరుగుతున్నాయి. ప్రజల భాష కూడా మారింది. జిఐ ట్యాగ్, క్యూఆర్ కోడ్ వంటి కొత్త పదజాలం వ్యాప్తి పెరిగింది. ఇది అభివృద్ధికి సంకేతమనే భావన కశ్మీరీల్లోనూ ఉంది. కశ్మీరీలంటే, అటు లోయ, ఇటు జమ్మూ మైదాన ప్రాంతాలతో కలిపి ఉన్న ప్రదేశాల్లోని అందరూ అని లెక్క! ఇవన్నీ ఒక ఎత్తయితే, అధికరణం 370 ఎత్తివేత తర్వాత తాము శక్తి కోల్పోయినట్టు, స్వేచ్ఛా స్వతంత్ర భావన కొరవడ్డట్టు అత్యధికులు కలత చెందుతున్నారు. ఈ విషయాల్లో వారి మనోభావాలు, అభివృద్ధిని ప్రశంసించడంలో వెనుకాడుతున్నట్టున్నాయి. అందుకే, కశ్మీరీల సెంటిమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర వహించి, ఎటు మొగ్గుతుందన్నది కోటి రూకల ప్రశ్న!

కమ్మిన పొరకమ్మిన పొరు
నిజానికి పౌరుల మౌలిక సమస్యలే అంతర్లీనంగా కశ్మీరీల ఓటు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. ఆహార సంబంధ నిత్యావసరాలు, విద్యుత్తు, నీరు వంటి పౌర సదుపాయాలు, రోడ్లు, బడులు, ఆస్పత్రులు, కాలేజీలు వంటి మౌలిక వసతులు కశ్మీరీల మదిలో ఉన్నాయి. ఉన్నత విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో యువత ఆందోళనతో ఉన్నారు. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం ఇంటింటి బాధే! ఎన్నికల వేళ కొన్ని ఇతర ప్రాధాన్యతాంశాలు వీటిని కమ్మేస్తున్నాయి. 370 ఎత్తివేసిన తర్వాత రాజ్యాంగమ్మీద ప్రజలకు విశ్వాసం పెరిగిందా? తరిగిందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకటొకటిగా చోటు చేసుకుంటున్న పలు పరిణామాలను కశ్మీరీలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికలకు ప్రచారం ఊపందుకున్న క్రమంలోనే, పార్టీలు ఏ వాదనలతో వస్తాయోనని జనం నిరీక్షించారు. తమ సందేహాలు, భయాలు తొలగిపోయేలా… ఎవరేం చెప్తారన్నది వారు గమనించారు. ఓటేయడానికి మాత్రం, ఓటర్లు ఇది వరకెప్పుడూ లేనంత ఉత్సాహంగా ఉన్నారు. ‘ఎన్నికల బహిష్కరణ’ విధానం నుంచి, 370 పునరుద్ధ్దరించే వరకు ఎన్నికల్లో పాల్గొనేది లేదన్న పట్టుదల నుంచి…. క్రమంగా వైదొలగి, 58 శాతానికి పైబడి మొన్న (2024 ఎన్నికలు),

59 శాతానికి పైబడి నిన్న (తొలివిడత) ఓటేసిన ‘ఔత్సాహిక’ పాత్రలోకి వారు వచ్చేశారు. జిల్లా అభివృద్ధి మండళ్ల (డిడిసి) ఎన్నికల్ని బహిష్కరించే తప్పుచేశామన్న భావన అత్యధికుల్లో ఉన్నట్టు ‘పీపుల్స్ పల్స్’ క్షేత్ర అధ్యయనంలో వెల్లడయింది. ఎన్నికల తర్వాత… తమను వినే, అర్థం చేసుకునే, స్పందించే ప్రభుత్వం కావాలనేది సగటు కశ్మీరీల కోరిక. సాధారణ అధికారాలతోనో, విశేషాధికారాలతోనో పనిచేసే లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి)లనూ వారు కోరుకోవడం లేదు. అధికరణం 370 ఎత్తివేత మీద కన్నా, రాష్ర్ట హోదా తొలగిపోవడంపట్ల స్థానికులు కినుకవహించి ఉన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఎప్పుడనే విషయంలో ఇంకా నీలినీడలు పరచుకొనే ఉన్నాయి. ‘తగిన సమయంలో… అని ప్రధాని మోడీ పార్లమెంటులో, అమిత్ షా బయటా చెప్పారు కదా!’ అంటున్న లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాటలు, విపరీతార్థాలు ఇస్తున్నట్టే కొందరు భావిస్తున్నారు. బారాముల్లా నుంచి లోక్‌సభకు ఎన్నికైన రషీద్ పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసి, తిరిగి జైలుకు వెళ్లాక కేంద్రంలో ఓ పరిణామం చోటుచేసుకుంది. ఎల్‌జి అధికారాల పరిధి విస్తరిస్తూ, న్యాయ పోలీసు ఆర్థిక అధికారాలను మరిన్ని జతచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం పట్ల కశ్మీరీలకు భయసందేహాలు ఇంకా పెరిగాయి. ఇవన్నీ స్థానికాంశాలను, సగటు సమస్యలను కమ్మేస్తున్న అసాధారణాంశాలు. ఇవి ఏ మేరకు ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.

పెనం నుంచి పొయ్యిలో పడొద్దని
పార్టీల రాజకీయ ఆలోచనలెలా ఉన్నా… ప్రజల మనసెరిగి పాలించడంలోనే ప్రజాస్వామ్యపు రమ్యత ఉంది. ఆనాటి పరిస్థితుల్ని బట్టి జమ్మూకశ్మీర్‌కు రాజ్యాంగ చట్టం ద్వారా సంక్రమించిన ప్రత్యేక రక్షణలు అవసరమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ఏది అవసరమో ఆ మేరకైనా పాలకులు పూచీకత్తుగా నిలవాలి. ముస్లింలకు భరోసా ఇచ్చే, వారికి రక్షణ కల్పించే వ్యవస్థలు, అవెంత బలహీనంగా ఉన్నాసరే సమూలంగా తొలగించే పాలకుల ప్రయత్నాలు ప్రజల దృష్టికి ఆనకుండా పోవు. ఆధునిక నిర్ణయాలు, చర్యలు… చారిత్రక తప్పిదాలను, అన్యాయాలను సరిదిద్దకపోగా, మరింత విశృంఖలత్వపు కొనసాగింపయితే… అది శాపగ్రస్తమే! అధికణం 370 ఎత్తివేస్తున్నపుడు మాట ఇచ్చిన ప్రకారమే ప్రక్రియలు సాగుతుంటే, వాటిని ప్రజలు ఆహ్వానిస్తే… ఎన్‌సి, పిడిపి, కాంగ్రెస్ వంటి పార్టీలూ స్వాగతించాలి. రాజకీయ పార్టీలు తమ భాష, విషయాల అవగాహన, అభివ్యక్తి సరళి.. అదే వరుసలో మార్చుకోవాలనే కశ్మీరీలు కోరుకుంటారు. అలా కాకుండా, శాసనసభ పునరుద్ధరించినట్టే చేసి, రాష్ట్ర హోదా ఇచ్చినట్టే ఇచ్చి… మళ్లీ ఎల్‌జి దొడ్డిదారి పెత్తనంతో ఢిల్లీ బాద్ షాలే రాజ్యమేలితే కశ్మీరీలు సహించే యోచనలో లేరనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. రేపటి, మిగిలిన రెండు విడతల ఎన్నికల్లో… అటో, ఇటో ముద్ర వేసి, తమ మనోగతాన్ని కశ్మీరీలు విస్పష్టంగా వెళ్లడించడం ఖాయం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News