Wednesday, January 22, 2025

ఓరుగల్లులో నారీమణులు

- Advertisement -
- Advertisement -

(వి. వెంకటరమణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి)
ఓరుగల్లులో ఎన్నికల తెర మీద నారీమణులు హల్ చల్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది మంది మహిళలు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నా రు. ఆషామాషీగా కాకుండా….రాజకీయ ఉద్దండులను ఢీ కొడుతున్నారు. తొలిసారి ఎన్నికల బరిలోకి వచ్చినా… నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నేతలకు తమ దూకుడుతో చెమటలు పట్టిస్తున్నారు. తమ రాజకీయ అనుభవం అంత వయసు లేదనుకున్న ఉద్దండులకు.. మహిళా నేతలంతా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి దూకుడుగా ప్రచారం చేస్తుండడంతో కలవరపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో మహిళలు అడపా దడపా బరిలో ఉండగా,

ఈసారి మాత్రం ఏడు అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచారు. వీరిలో నలుగురు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల పోరులో తలపడుతున్నారు. మిగతా నలుగురిలో ఇద్దరికీ అసెంబ్లీ ఎంట్రీ ఉండగా..మరో ఇద్ద రు గత ఎన్నికల్లో ఓటమిపాలై రెండోసారి తాడో పేడో తేల్చుకునేందుకు ఎన్నికల పోరులో నిలిచారు. ప్రధానంగా జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరిలకు మహిళల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. అందరూ కూడా ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. ఉమ్మ డి వరంగల్ జిల్లాలో నారీమణులు పోటీ చేస్తున్న స్థానాలను పరిశీలిస్తే….

పాలకుర్తిలో నువ్వా నేనా…
పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి తలపడుతున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపి గా గెలిచిన ఎర్రబెల్లి ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. ఇక్కడినుంచి కొత్త గా రాజకీయాల్లోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని తొలిసారి పోటీ చేస్తూ మంత్రితో ఢీ అంటే ఢీ అంటున్నా రు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఎర్రబెల్లితో 26 ఏళ్ల యశస్విని పోటీ ఆసక్తిని కలిగిస్తున్నది. ఏడవసారి విజయం కోసం చెమటోడ్చుతున్నారు.
దాస్యంతో పద్మ ఢీ…
వరంగల్ పశ్చిమ నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడనుంచి బిజెపి అభ్యర్థిగా రావు పద్మ తొలిసారి పోటీ పడుతున్నారు. నాలుగుసార్లు విజయం సాధించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో రావు పద్మ తలపదుతున్నారు. ఇద్దరి కుటుంబాలకు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నది.

కడియం వర్సెస్ ఇందిర…
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సింగపురం ఇందిర రేసులో ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను మార్చిన బిఆర్‌ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీగా ఉన్న కడియంను ఖరారు చేసింది. ఎమ్మెల్యేగా, ఎంపిగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా విశేష అనుభవం ఉన్న కడియంతో ఇందిర తలపడుతున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇక్కడినుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓటమిపాలైన ఇందిర రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
రెడ్యానాయక్‌తో భూక్య సంగీత ఢీ…
డోర్నకల్ అసెంబ్లీ నుంచి ఆరుసార్లు గెలిచి మరోసారి పోటీలో ఉన్న బిఆర్‌ఎస్ అభ్యర్థి డిఎస్ రెడ్యానాయక్ తో బిజెపి అభ్యర్థిగా భూక్య సంగీత తలపడుతున్నారు. బిఆర్‌ఎస్ జెడ్పీటీసీగా ఉన్న సంగీత బిజెపిలో చేరి తొలిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగారు.

వరంగల్ తూర్పులో కొండా సురేఖ...
వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి కొండా సురేఖ పోటీ చేస్తున్నారు. 2014లో తూర్పు నుంచి గెలిచిన సురేఖ.. 2018లో పరకాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో పరకాల నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. మరోసారి తూర్పు నుంచి బరిలో ఉన్న సురేఖకు బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల నుంచి గట్టిపోటీ ఎదురవుతున్నది.
ములుగులో మాజీ నక్సల్స్ వార్…
ములుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అధికార బిఆర్‌ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతి బరిలో ఉన్నారు. మూడోసారి గెలుపు కోసం పోరాడుతున్న సీతక్కకు తొలిసారి ఎన్నికల పోరులో నిలిచిన నాగజ్యోతి సవాల్ గా నిలుస్తున్నది. ఢీ అంటే ఢీ అంటున్నది. ఏజెన్సీ ప్రాంతానికి తోడు ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడం, అలాగే ఇద్దరికీ కూడా నక్సల్స్ నేపథ్యం ఉండడం ఉత్కంఠత కలిగిస్తున్నది. సీనియర్ అయినప్పటికీ సీతక్క మాత్రం…నాగజ్యోతి దూకుడుతో పరేషాన్ అవుతున్నారు.

గండ్రలతో కీర్తిరెడ్డి ఢీ…
భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా డాక్టర్ కీర్తిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడనుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి, కాం గ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయ ణ రావు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కీర్తిరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News