Wednesday, January 22, 2025

ఆత్మరక్షణలో అగ్రనేతలు

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే సగానికిపైగా స్థానాలకు లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగా, ఎన్నికల ప్రచారం గతి తప్పుతున్నట్టు స్పష్టం అవుతుంది.ఎన్నికల్లో ప్రజాతీర్పుపై ఎంతో భరోసాతో ప్రచారం ప్రారంభించిన కీలక నేతలు ఆత్మరక్షణలో పడి తమ రాజకీయ మనుగడ కోసం విలువలకు తిలోదకాలిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ‘ఇండియా’ కూటమి ద్వారా నరేంద్ర మోడీ ప్రభంజనాన్ని అడ్డుకోగలననే ధీమాతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు తమ కుటుంబానికి బలీయమైన రెండు నియోజకవర్గాలలో ఎక్కడినుండి పోటీ చేయాలో తేల్చుకోలేక, చివరకు ఒక చోట నుండి పోటీ చేస్తున్న దృశ్యం కనిపిస్తున్నది.

1980 నుండి గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉండటమే కాకుండా వరుసగా ఐదుసార్లు సోనియా గాంధీని ఎన్నుకున్న రాయబరేలి కేవలం సురక్షిత స్థానం అని మాత్రమే ఎంచుకొన్నట్లు స్పష్టం అవుతుంది. వరుసగా ఐదోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాహుల్ చెల్లెలు ప్రియాంక గాంధీని ఎన్నికల్లో దింపేందుకు ప్రధాని మోడీ చేస్తున్న ‘కుటుంబ రాజకీయాలు’ విమర్శలకు భయపడి వెనుకడుగు వేసినట్టు కూడా తెలుస్తున్నది. ఒక వంక ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలలో ‘యువరాజు’(రాహుల్ గాంధీ)ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండగా, ఆయన మాత్రం తన సీటు విషయంలో తికమక పడుతున్నట్లు వెల్లడవుతున్నది. ఎందుకంటె రాయబరేలి, అమేథీ సీట్లను గెల్చుకోవడం ద్వారా మాత్రమే ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ తన ఉనికి కాపాడుకోగలదు.

అప్పుడు మాత్రమే జాతీయ స్థాయిలో ఇతర రాజకీయ పక్షాలను తనవైపు తిప్పుకోగలదు. ఈ సందర్భంగా ఎన్నికల అనంతరం చిన్న చిన్న రాజకీయ పక్షాలు కాంగ్రెస్‌తో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎన్‌సిపి అధినేత శరద్ పవర్ చేసిన ప్రకటన బిజెపి శిబిరంలో కలకలం రేపుతున్నట్లు ఉంది. శరద్ పవర్, ఉద్ధవ్ థాకరే వర్గాలు కాంగ్రెస్ లో విలీనం అవుతున్నాయని అంటూ ఈ మాటలకు ప్రధాని మోడీ స్వయంగా భాష్యం చెప్పారు. మునిగిపోయే కాంగ్రెస్‌లో కాకుండా ఎన్‌డిఎలో చేరమని వారిని బహిరంగంగా ఆహ్వానించారు.

వరుసగా కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే అనేక ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్ధకం కాగలదు అనే అంశం ఈ సందర్భంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉంటె తమతో కలిసి ఉండాలి లేదా అటువంటి వారి ఉనికి ప్రశ్నార్థకం కాగలదని హెచ్చరికలను ప్రధాని స్వయంగా ఇచ్చినట్లయింది. ఎన్నికల పొత్తుకోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో జూన్ 4 తర్వాత ఒడిశాలో బిజెడి ఉనికి ప్రశ్నార్థకం కాగలదని ఈ సందర్భంగా సంకేతం ఇవ్వడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు సైతం అటువంటి హెచ్చరికలు వెలువడుతున్నాయి. నేడు జెఎంఎం అధినేత హేమంత్ సొరేన్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు ఇటువంటి హెచ్చరికలను ఖాతరు చేయకుండా కాంగ్రెస్‌తో పొత్తులు చేసుకున్న కారణంగానే జైళ్లలో గడపాల్సి వస్తుందని మరచిపోలేము. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత సైతం అందుకోసమే జైలుకు వెళ్లాల్సి వచ్చిందని స్వయంగా కెసిఆర్ ఆరోపిస్తున్నారు. ఇటువంటి సవాళ్ళను కేజ్రీవాల్, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవర్, హేమంత్ సోరెన్, కెసిఆర్ వంటి వారు ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవంక ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం పాకిస్తాన్, ముస్లింల చుట్టూ తిరుగుతూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. మన సరిహద్దుల్లో ఇంకా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలను సైతం చేబడుతున్న చైనా గురించి మాట్లాడే ధైర్యం చేయడం లేదు. కానీ రాహుల్ గాంధీ గెలుపొందాలని పాకిస్తాన్ కోరుకుంటుందని అంటూ అక్కడ అధికారం కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో పని చేసిన ఒకరి మాటలను పట్టుకొని ప్రచారం చేయడం గమనిస్తే తమ ప్రభుత్వ పనితీరు ఆధారంగా మరోసారి గెలుపొందగల నమ్మకం సడలుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. సామ్ పిట్రో, మణిశంకర్ అయ్యర్ వంటి కాలంచెల్లిన నాయకులు ఎన్నికల సమయంలో చేస్తున్న బాధ్యతారహిత వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలో పడవేస్తున్నా బిజెపికి బలమైన ప్రచార ఆయుధాలు సమకూరుస్తున్నా అటువంటి వారిని కట్టడి చేయడంలో రాహుల్ ఓ విధంగా నిస్సహాయంగా కనిపిస్తున్నారు.

తనదారి తనదే గాని, మొత్తం పార్టీని తనతో తీసుకెళ్లడంలో మొదటి నుండి విఫలమవుతున్నారు. అందుకనే రాహుల్ నాయకత్వం సామర్థ్యంపై కాంగ్రెస్‌లోనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్‌కు మాత్రమే కాకుండా అనేక దేశాలకు ఆందోళనకరంగా మారిన చైనా ధోరణులను కట్టడి చేసేందుకు దృఢవైఖరిని అవలంబించలేకపోతున్నాము. ముఖ్యంగా వాణిజ్యలోటు ప్రతి ఏడాది పెరుగుతున్నా తగ్గించే ప్రయత్నం చేయలేకపోయాము. కీలక రంగాలలో చైనా పై ఆధారపడటం జాతీయ భద్రతకు ప్రమాదరకరమనే హెచ్చరికలను పట్టించుకోలేక పోతున్నాం. భారత్ అని బూచిని చూపి పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు రాజకీయాలను శాసిస్తూ వస్తున్న సైన్యం ఆధిపత్యానికి గండిపడుతోంది. కానీ భారత్ నాయకత్వం మాత్రం పాకిస్తాన్ బూచి చూపిస్తూ ఇక్కడ తమ రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది.

కొంతకాలంగా దేశంలో ముస్లింలో ఓ విధమైన నాయకత్వం సంక్షోభం ఎదుర్కొంటున్నది. వారి వాదనలను బలంగా వినిపించే నేతలు కనిపించడం లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని అక్కడక్కడా కొన్ని దురహంకార వర్గాలు తామే ముస్లింల ప్రతినిధులమనే విధంగా వ్యవహరిస్తున్నాయి. మొదటి నుండి కాంగ్రెస్ ముస్లింలను ‘ఓట్ బ్యాంకు’గా ఉపయోగించుకోవడమే గాని వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభ్యున్నతికి తోడ్పడ లేదనే విమర్శలు ఉన్నాయి. స్వయంగా ప్రధాన మంత్రి మోడీ వారిలో బాగా వెనుకబడిన ‘పసమానంద’ ముస్లింల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు చేపట్టాలని చెప్పారు. వారిని దగ్గరకు చేర్చుకొని ప్రయత్నాలు చేపట్టారు. కానీ ఇప్పుడు వారి గురించి కూడా మరిచిపోయినట్టున్నారు. ముస్లింలను ‘చొరబాటుదారులు’, ‘ఎక్కువ మంది సంతానం’ గలవారుగా అభివర్ణించడం ఓ ప్రధాని స్థానంలో ఉన్నవారి నుంచి ఊహింపలేము.దేశంలో విద్వేష, అసహన ధోరణులు ప్రదర్శించే పదజాలం అనే ఆందోళన కలుగుతుంది.

నేడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలలో తమ నాయకత్వంపై ఓ విధమైన ‘అసహనం’, ‘అవిశ్వాసం’ వెల్లడి కావడం నేడు భారత రాజకీయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా భావించవచ్చు. బిజెపి అభ్యర్థులలో నాలుగోవంతు మంది ఎన్నికల సమయంలో పార్టీలో చేరినవారే. నిన్నటి వరకు తాము అవినీతిపరులుగా, ప్రజావ్యతిరేకమైన వారుగా విమర్శలు కురిపించిన వారి విజయం కోసం ఇప్పుడు తామెందుకు పని చేయాలనే నిర్ల్లిప్తత ఆ పార్టీ శ్రేణులలో వ్యక్తం అవుతుంది. తమపై దాడులకు తలపడిన వారు కొందరు ఇప్పుడు తమ అభ్యర్థులుగా రావడాన్ని సహింపలేకపోతున్నారు. సుమారు 120 మంది ప్రస్తుత ఎంపిలను, వారిలో పలువురు తిరిగి గెలుపొందే అవకాశం ఉందని అంతర్గత సర్వేలు వెల్లడించిన్నప్పటికీ తిరిగి సీటు ఇవ్వకుండా మార్చడం బిజెపిలో అంతర్గతంగా నాయకత్వం ధోరణుల పట్ల అసహనం వ్యక్తం అవుతుంది. ఇటువంటి ధోరణి కాంగ్రెస్‌తో పాటు పలు ప్రాంతీయ పార్టీలలో సైతం వెల్లడి అవుతుంది. పార్టీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు బలమైన పార్టీ నాయకులను కాదని పార్టీ అభ్యర్థులుగా పోటీకి దిగడాన్ని ఆయా పార్టీల శ్రేణులు తమాయించుకోలేకపోతున్నారు. తాము ఆయా పార్టీల జాతీయ నాయకులకు ‘ముడుపులు’ చెల్లించి తాను సీటు కొన్నానని అర్ధాంతరంగా చివరి నిమిషంలో పార్టీలో చేరి, సీటు కైవసం చేసుకున్న పలువురు అభ్యర్థులు స్థానికంగా ప్రచారం చేసుకొంటూ ఉండటంతో ఆయా పార్టీల నాయకులు తలలుపట్టుకోవలసి వస్తుంది.

నాలుగైదు ఏళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, నిలదొక్కుకొంటూ వస్తుంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీకి సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా తీసుకు రావడం, ఆ అభ్యర్థి ఎన్నికల అనంతరం కనిపించని పరిస్థితి నెలకొనడం ఇప్పుడు పలు చోట్ల, పలు పార్టీలలో జరుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా బిజెపి బలహీనపడితే తమ సీట్లు పెంచుకోవాలనే ఎత్తుగడ కాంగ్రెస్‌లో ప్రధానంగా కనిపిస్తున్నది. బిజెపి ప్రచారం అంతా ప్రధాని మోడీ చుట్టూ జరుగుతుంది. ‘మోడీ గ్యారంటీ’ పేరుతో ప్రచారం చేస్తున్నారు. కేవలం ఆయనకున్న ప్రజాదరణ ఆధారంగానే ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో విజయం పొందే ప్రయత్నం చేస్తున్నారు.

అందుకనే అభ్యర్థులు ఎవరైనా సంబంధం లేదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. మోడీ మంచి పాలన అందించడంలో విఫలమయ్యారని, ప్రజల కీలక సమస్యలను పట్టించుకోవడం లేదని భావించేవారు ఆయనకు వ్యతిరేకంగా తమకు ఓటు వేస్తారని ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. అందుకనే స్వాతంత్య్రం అనంతరం బహుశా మొదటిసారి ఎటువంటి విధానాలు, అంశాలు ప్రస్తావించకుండా ఓ వ్యక్తి చుట్టూ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో 1971లో బంగ్లా యుద్ధం, 1984లో ఇందిరా గాంధీ దుర్మరణం అనంతరం జరిగిన ఎన్నికల్లో సైతం ఇటువంటి పరిస్థితులే నెలకొన్నా అప్పుడు భావోద్వేగాలు ఎక్కువ ప్రభావం చూపాయి. ఇపుడు అటువంటి పరిస్థితులు కూడా లేవు. అందుకనే ప్రస్తుత ఎన్నికలు పూర్తిగా విలక్షణమైనవి అని చెప్పవచ్చు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News