Sunday, December 22, 2024

సభలో సవాళ్ల పర్వం

- Advertisement -
- Advertisement -

24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే బిఆర్‌ఎస్ శాసనసభా పక్షం మొత్తం రాజీనామా చేస్తుంది రుణమాఫీ
వంద శాతం పూర్తయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అసెంబ్లీలో కెటిఆర్ సవాల్ నల్లగొండ
జిల్లాలో కాళేశ్వరం నీళ్లు ఒక్క ఎకరాకు వచ్చినట్లు నిరూపించినా రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి ప్రతి సవాల్
భగీరథ నీళ్లు గ్రామాలకు రావడం లేదని నిరూపిస్తా.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: మంత్రి జూపల్లి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు ప్రా రంభం కాగానే సభలో అధికార, విపక్షల మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. రైతు భరోసాపై జరిగిన చర్చలో అధికార పార్టీ, విపక్ష సభ్యుల మధ్య వార్ జరిగింది. రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అదానీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ రైతులను జైల్లో పెట్టారని మండిపడ్డారు. కేవలం అనుముల కుటుంబం కోసం, బామ్మర్ది కోసం, అన్నదమ్ముల కోసం పని చేయకండని హెచ్చరించారు. అన్నదాతను దృష్టి లో పెట్టుకుని ప్రభుత్వం పనిచేయాలని కోరారు. రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందని అంటున్నారని, 60 శాతం అయ్యిందని మరొకరు అంటున్నారని చెప్పారు. రైతు రుణమాఫీ ఎంత మేర జరిగిం దో స్పష్టంగా చెప్పాలన్నారు. 25 శాతం, 50 శాతమా మీకే స్పష్టత లేదని విమర్శించారు. కోత లు పెడితే అది మీ ఇష్టమని అన్నారు.

కౌలు రైతులకు ఇస్తారా లేదా క్లారిటీ ఇవ్వాలన్నారు. \రాష్ట్ర రైతాంగం కోసం పనిచేయాలని కేటీఆర్ చెప్పారు. సాగు విస్తీర్ణం పెరగాలనే ఉద్దేశంతోనే రైతుబంధు ఇచ్చామని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 201920లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలుందని, 2020-21లో సాగు విస్తీర్ణం 204 లక్షల ఎకరాలని నివేదికలో చెప్పారన్నారు. రైతుబంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ఇదే విషయాన్ని ప్రభుత్వం ఇచ్చిన నోట్ స్పష్టం చేస్తోందన్నారు. 4.50 లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామని చెప్పారు. పోడు పట్టాలున్న గిరిజనులకు రైతుబంధు ఇస్తారో, లేదో ప్రభుత్వం చెప్పాలని కోరారు. రైతుబంధుకు కోతలు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని, లేకపోతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మంత్రి చెప్పేవారు కాదన్నారు.

తెలంగాణలో పీఎం కిసాన్ సమ్మాన్ 20 శాతం మంది రైతులకే వస్తోందని, రైతుబంధు యథాతథంగా ఇస్తామంటే ఈ చర్చ ఎందుకు? అని ప్రశ్నించారు. పత్తి, కంది 8 నెలల పంట అని, ఆర్థిక సాయం ఒక పంటకు ఇస్తారా? రెండు పంటలకు ఇస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పామాయిల్, మామిడి, ఉద్యాన పంటలకు రైతుభరోసా ఇస్తారా? 3 పంటలు సాగు చేసే రైతులకు మూడు విడతలుగా ఇస్తారా? మూడో పంటకు ఇవ్వాలని గతంలో రేవంత్ అన్నారని, అసెంబ్లీ సమావేశాలు పది రోజులు పొడిగించాలని కోరారు. ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మిషన్ భగీరథపై చర్చ చేపట్టాలని, నల్గొండ జిల్లా అభివృద్ధిపై కూడా ఒకరోజు చర్చ చేపట్టాలని సూచించారు.

గతంలో జరిగిన తప్పులు ఎత్తిచూపితే మీకు ఇబ్బందిగా ఉందని, గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టడం సబబా? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ హయాంలో 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని తప్పుదోవ పట్టిస్తున్నారని, బిఆర్‌ఎస్ పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్ ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారన్నారు. కాంగ్రెస్ పాలనలో 24 గంటలు ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారని, సభ వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి పరిస్థితులు పరిశీలిద్దామని, 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చూపెడితే బిఆర్‌ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తుందని సవాల్ విసిరారు. రైతుబంధు మీద కాంగ్రెస్ విపరీతమైన దుష్ప్రచారం చేసిందని, రైతు బతుకును మార్చిన గేమ్ ఛేంజర్ రైతుబంధు అని కేటీఆర్ అన్నారు.

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విపిరారు. రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. రైతు రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విసిరారు. కొండారెడ్డి పల్లి, పాలేరు ఎక్కడికైనా వెళ్దామని ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీలో రుణమాఫీపై చర్చలో రైతులను అడుగుదామని, వంద శాతం రుణమాఫీ అయినట్లు నిరూపించాలని కేటీఆర్ అన్నారు. రైతుబంధుపై సమగ్ర చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు. రైతు భరోసాను ప్రారంభించింది తామేనని స్పష్టం చేశారు. రైతుబంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగిందని గుర్తుచేశారు. రైతుబంధుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు. రైతుబంధు ఒక పంటకు ఇస్తారో లేక..రెండు పంటలకు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

నిరూపిస్తే రాజీనామా చేస్తా : నల్గొండ జిల్లాలో కాళేశ్వరం నీళ్లు ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజీనామా చేస్తానని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఛాలెంజ్ విసిరారు. నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడుగుదామని, హరీష్‌రావు, కేటీఆర్ చర్చకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కేసీఆర్ కట్టారా..వాళ్ల నాన్న కట్టిండా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ హయాంలో తాను ఒక సబ్ స్టేషన్ వెళ్లి లాగ్ బుక్ చేశానని గుర్తుచేశారు. 10గంటలు మాత్రమే కరెంట్ వస్తుందని సబ్ స్టేషన్ సిబ్బంది చెప్పారని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో 24గంటల కరెంట్ ఇవ్వలేదని చెప్పారు. 24గంటల కరెంటు ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు ఉపసంహరించుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్ పాలనలో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు.

నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తుచేశారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మోసం చేసి పదేళ్లు పాలించారన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పుణ్యాన ఏఎంఆర్‌బీ వచ్చిందని గుర్తుచేశారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయలేదు. ఆధారాలు పంపిస్తాం. నల్గొండ జిల్లాలో ఆ పార్టీ హయాంలో కొత్తగా ఒక ఎకరా సాగులోకి వచ్చినా నేను రాజీనామా చేస్తా. ఉచిత విద్యుత్ అందించింది కాంగ్రెస్ పార్టీ అని, దాని పేటెంట్ హక్కూ కాంగ్రెస్‌దే అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో నీళ్లు, విద్యుత్, ఏమీ ఇవ్వలేదని, వాళ్ల పాలనలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. మిషన్ భగీరథ ద్వారా కుళాయి నీళ్లు వచ్చాయని ప్రజలు చెబితే మరో సారి ఓట్లు అడగమన్నారు. మిషన్ భగీరథలో రూ.50 వేలకోట్లు తినేశారని కోమటిరెడ్డి ఆరోపించారు.

బావ బామ్మర్ది అడ్డు పడుతున్నారు : బావ బామ్మర్ది హరీష్‌రావు, కేటీఆర్ కలిసి నల్గొండ ప్రజలను చంపేస్తారా..చంపేయండని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీని బాగుచేస్తున్నారని, దానికి కూడా బావ బామ్మర్ది అడ్డు పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహించారు. రైతు భరోసాపై సూచనలు చేయాలని కోరారు. కేటీఆర్ ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారని, మరి బీఆర్‌ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. దళితుడిని సిఎం చేస్తామని చెప్పి మోసం చేయలేదా అని నిలదీశారు. ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్పకండని అన్నారు. అబద్దాల మేనిఫెస్టో మీది. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ మీరు అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అని చెప్పి కూలేశ్వరం కట్టారని విమర్శించారు. రైతు భరోసాపై సలహాలు, సూచనలు ఉంటే చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

అసెంబ్లీ ఆలస్యంపై హరీష్‌రావు ఫైర్ : శాసనసభ పది నిమిషాల ఆలస్యంగా ప్రారంభం కావటంపై మాజీ మంత్రి హారీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 10గంలకు ప్రారంభంకావాల్సిన సభ 10.10గంకు ఎందుకు ప్రారంభం అయిందని ప్రశ్నించారు. సభను సమయానికి ఎందుకు నడపడం లేదని హరీష్‌రావు నిలదీశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు సభను సమయానికి నడిపామని హరీష్‌రావు గుర్తుచేశారు. చట్టాలు చేసే మనం ఆదర్శంగా ఉండాలని హరీష్‌రావు చెప్పారు. సభను సమయానికి ప్రారంభించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.

మిషన్ భగీరథలో అవినీతి ఎలా జరిగింది : మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు

మిషన్ భగీరథ ఖర్చే రూ.28 వేల కోట్లు అయిందని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. అందులో రూ.50వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. మంత్రికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను డిమాండ్ చేశారు. నల్గొండకు ఏం చేయలేదు అనడం సరికాదని హరీష్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా నల్గొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని, నల్గొండలో వైద్య కళాశాల పెట్టింది కేసీఆర్ అన్నారు. ఉమ్మడి నల్గొండలో యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని హరీశ్ రావు అన్నారు.

రైతుబంధులో కోతలు విధిస్తామని మేం చెప్పలేదు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శాసనసభలో శనివారం ఆయన మాట్లాడారు. మేం ఇచ్చిన నోట్‌లో రైతు భరోసాపై ఏమీ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగిన విధివిధానాలే సభ ముందు ఉంచాం. బిఆర్‌ఎస్ ఏది చెబితే అది అమలు చేయాలనే ఆలోచన వారికి ఉంది. ఏ పంటకు ఎంత ఇస్తామనేది ఇంకా నిర్ణయించలేదు. సభలో సభ్యుల సూచనల తర్వాతే నిర్ణయిస్తామన్నారు. పత్తి, చెరకుకు ఏం చేయాలనేది సభ్యులు చెబితే చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రైతుబంధులో కోతలు విధిస్తామని మేం చెప్పలేదని, ప్రజలు, సభ్యుల అభిప్రాయం ప్రకారం విధివిధానాలు నిర్ణయిస్తామని ని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు

గ్రామీణ ప్రాంతాలకు నీళ్లు రావడం లేదని నిరూపిస్తా : మంత్రి జూపల్లి కృష్ణారావు

మిషన్ భగీరధ ద్వారా అనుకున్న లక్షాలను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించలేక పోయిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రైతు భరోసా విధివిధానాలపై కొనసాగిన స్వల్పకాలిక చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై మంత్రి జూపల్లి తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పధకం, ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులో ఏం జరిగిందో తెలుసని మంత్రి ఆరోపించారు. రూ.లక్షల కోట్లు అప్పు చేసి కూడా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. మిషన్ భగీరధ ద్వారా 60 నుంచి 70 శాతం గ్రామాలకు తాగునీరు సరఫరా కావడంలేదని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాలకు నీళ్లు రావడం లేదని నిరూపిస్తానని, నిరూపించలేకపోతే రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News