Sunday, December 22, 2024

ఓరుగల్లులో టఫ్ ఫైట్

- Advertisement -
- Advertisement -

(వి. వెంకట రమణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఓరుగల్లులో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్ పక్షాన నిలిచారు. ప్రతిపక్ష పార్టీలకు అరకొర సీట్లు దక్కాయి. గడిచిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో టిఆర్‌ఎస్ అభ్యర్థులు సునాయాసంగా గెలుపొందారు. ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్ లలో హోరాహోరీ పోరు నడుస్తున్నది. బిఆర్‌ఎస్ అభ్యర్థులు సిట్టింగ్ లే కావడంతో సహజంగా కొంత వ్యతిరేకత ఉండడం…కాంగ్రెస్ పార్టీ ఆచితూచి టికెట్లను కేటాయించడంతో పోరు రసవత్తరంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉండగా ఆరు చోట్ల ముఖాముఖి పోరు కొనసాగుతున్నది. మరో ఆరు చోట్ల త్రిముఖ పోటీ నెలకొంది. అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారంలో స్పీడ్ పెంచారు.

ఆరుచోట్ల నువ్వానేనా..?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నది. పాలకుర్తి, జనగామ, స్టేషన్ ఘనపూర్, ములుగు, నర్సంపేట, డోర్నకల్ అసెంబ్లీ సెగ్మెంట్ లలో నువ్వా? నేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది.
పాలకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మామిడాల యశస్విని రెడ్డి, బిజెపి అభ్యర్థిగా లేగా రామ్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన మంత్రి ఎర్రబెల్లికి యశస్విని రూపంలో గట్టి పోటీ ఎదురవుతున్నది. ఇక్కడ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. సభలు, సమావేశాలు కూడా పోటా పోటీగా సాగుతున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ యశస్విని రెడ్డి…40 ఏళ్ల అనుభవం ఉన్న ఎర్రబెల్లికి చెమటలు పట్టిస్తున్నది.

జనగామలో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా ఆరుట్ల దశమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కాదని పల్లాకు బిఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నది. ఇంటింటి ప్రచారంలో బిఆర్‌ఎస్ దూసుకుపోతున్నది. బిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభ నాటినుంచి పార్టీ శ్రేణులు ఏకమై పనిచేస్తున్నారు. అయితే బిఆర్‌ఎస్ తో పాటుగా కాంగ్రెస్ సభలకు కూడా ప్రజలు భారీగానే వస్తున్నారు. రెండు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతున్నది.
స్టేషన్ ఘనపూర్ నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పోటీ చేస్తుండగా…కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిర, బిజెపి అభ్యర్థిగా మాజీమంత్రి విజయరామారావు బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను మార్చిన బిఆర్‌ఎస్ పార్టీ కడియంకు టికెట్ ఇచ్చింది. తొలినాళ్లలో రాజయ్య వర్గీయులు వ్యతిరేకించినా సర్దుకుని పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర మరోసారి అభ్యర్థిగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరి ప్రచారంలో విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కింది.

ఏజెన్సీ ప్రాంతమైన ములుగు నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఇంచార్జి జెడ్పీ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి పోటీ చేస్తుండగా..కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క, బిజెపి అభ్యర్థిగా మాజీమంత్రి చందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. బిఆర్‌ఎస్ టికెట్ ఆశించి బయటకు వెళ్లిన ప్రహ్లాద్ బిజెపి నుంచి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచిన సీతక్క…కొత్త అభ్యర్థి నాగజ్యోతితో సవాల్ ఎదుర్కొంటున్నారు. తొలిసారి ఎన్నికల రణరంగంలోకి దిగినప్పటికీ సీతక్కతో ఢీ అంటే ఢీ అంటూ నాగజ్యోతి ప్రచారం చేస్తున్నారు. ఇద్దరికి కూడా నక్సల్స్ నేపథ్యం ఉండడం మరో ఆసక్తికర అంశం.
నర్సంపేట నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపి అభ్యర్థిగా కంభంపాటి పుల్లారావు పోటీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మధ్య నువ్వా? నేనా అన్న రీతిలో పోరు ఉన్నది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న పేటలో తెలంగాణ ఉద్యమం నుంచి బిఆర్‌ఎస్ పాతుకుపోయింది. కాంగ్రెస్ కు కూడా బలమైన కేడర్ ఉన్నది. 2014లో ఇండిపెండెంట్ గా పెద్ది మీద గెలిచిన దొంతి…2018లో పెద్ది చేతిలో ఓడిపోయారు. మరోసారి ఈ ఇద్దరు అభ్యర్థులే ముఖాముఖి తలపడుతున్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది.

డోర్నకల్ అసెంబ్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ బిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రామచంద్ర నాయక్, బిజెపి అభ్యర్థిగా భూక్య సంగీత పోటీ చేస్తున్నారు. వరుసగా గెలుస్తూ వస్తున్న రెడ్యాతో గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రామచంద్ర నాయక్ మరోసారి తలపడుతున్నారు. బిఆర్‌ఎస్ జడ్పీటిసి సంగీత బిజెపిలో చేరడంతో ఆమెకు టికెట్ దక్కింది. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉన్నది.
ఆరు స్థానాల్లో త్రిముఖ పోరు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉన్నది. వరంగల్ తూర్పులో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ, బిజెపి నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముగ్గురి మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్నది. మూడు పార్టీలకు కూడా బలమైన కేడర్ ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. 2014లో సురేఖ గెలుపొందగా..2018లో నరేందర్ గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిన ప్రదీప్ రావు అమీతుమీకి సిద్ధమై ఇద్దరికి గట్టి పోటీ ఇస్తున్నారు.
వరంగల్ పశ్చిమ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మరోసారి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా రావు పద్మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మూడు పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నది.

నాలుగుసార్లు గెలిచిన వినయ్ తో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు నాయిని, రావు పద్మ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రచారంతో మూడు పార్టీలు హోరెత్తిస్తున్నాయి.
వర్ధన్నపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మరోసారి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రిటైర్డ్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, బిజెపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ బరిలో ఉన్నారు. రెండుసార్లు భారీ మెజారిటీతో గెలిచిన బిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్, బిజెపి నుంచి సవాల్ ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్, బిజెపి లకు కూడా సాంప్రదాయక ఓటు బ్యాంకుతో పాటుగా కేడర్ ఉండడంతో ముగ్గురి మధ్య పోటీ కొనసాగుతున్నది.
పరకాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా డాక్టర్ కాళీప్రసాదరావు బరిలో ఉన్నారు. ఇక్కడ బిఆర్‌ఎస్ కు ఎదురులేదని భావించిన తరుణంలో కాంగ్రెస్, బిజెపిల నుంచి అన్యూహ్యంగా కొత్త అభ్యర్థులు రావడంతో అంచనాలు తారుమారయ్యాయి. అధికార బిఆర్‌ఎస్ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. ముగ్గురి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్నది.

భూపాలపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణ రావు, బిజెపి అభ్యర్థిగా డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర బిఆర్‌ఎస్ లో చేరి తొలిసారి పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కూడా ఈ అభ్యర్థులే ఎన్నికల రంగంలో నిలిచారు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే మూడుసార్లు ఓటమి చవిచూసిన గండ్ర సత్యనారాయణరావు నుంచి బిఆర్‌ఎస్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డి కూడా సవాల్ గా మారింది
మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి డాక్టర్ మురళీ నాయక్, బిజెపి అభ్యర్థిగా హుస్సేన్ నాయక్ పోటీ చేస్తున్నారు. రెండుసార్లు గెలిచిన శంకర్ నాయక్‌తో కాంగ్రెస్, బిజెపి ఢీ అంటే ఢీ అంటున్నది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సింపతీ కలిసి వస్తుందని బిజెపి అభ్యర్థి హుస్సేన్ నాయక్ భావిస్తున్నారు. రెండుసార్లు గెలిచిన శంకర్ నాయక్ మీద ఉండే వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్ కు ఒకప్పటి కంచుకోటను నిలుపుకోవాలని కాంగ్రెస్ తహతహ లాడుతున్నది. కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపి అమీతుమీకి సిద్దమైంది. రెండుసార్లు గెలిచి తాను చేపట్టిన అభివృద్ధి గెలిపిస్తుందని బిఆర్‌ఎస్ ధీమాతో ఉన్నది. ముగ్గురి మధ్య పోరు మాత్రం రసవత్తరంగా సాగుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News