Sunday, December 22, 2024

రిజర్వేషన్లపై రాజకీయ దుమారం

- Advertisement -
- Advertisement -

రిజర్వేషన్లపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికే తాము ప్రాధాన్యం ఇస్తామని, ముస్లింలకు మాత్రం తాము అంగీకరించేది లేదని కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోడీ నోట పదేపదే వినిపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది.ఈ నేపథ్యంలో మళ్లీ అధికారం లోకి వస్తే బిజెపి ముస్లింలకే కాదు మొత్తం రిజర్వేషన్లనే రద్దు చేస్తుందన్న ప్రచారం ఊపందుకోంది. అందుకే మోడీ 400 స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారని, అలా వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని విపక్ష కూటమి ప్రచారం చేస్తోంది. రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు ఉన్నాయి.

పైగా సిఫార్సుల మేరకు నివేదికలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకునే రాజ్యాంగం ఉంది.ఇన్ని ఉంటుండగా, మోడీ ఏకపక్షంగా ముస్లింలకు తానున్నంత కాలం రిజర్వేషన్లను దక్కనివ్వనని ఘంటా పథంగా చెబుతున్నారు. చివరకు అమిత్‌షా, రాజ్‌నాథ్ వంటి ప్రముఖ మంత్రులు కూడా ఇదే పాట పాడుతున్నారు. ఈ పరిస్థితి లో రాజ్యాంగం మార్చకపోయినా, లోలోపల తన అజెండా చెల్లించుకునే లోపయికారీ ప్రయత్నమేదో ఉండవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.ఇదిలా ఉండగా రిజర్వేషన్లను ఎత్తివేస్తామని అమిత్ షా ప్రకటించినట్టు ఫేక్ వీడియోలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. దీనికి బిజెపి పాలక వర్గం తీవ్ర కలవరం పడుతోంది. ప్రజల్లో దీని ప్రభావం విపరీతంగా ఉంటుందన్న భయంతో అలా అనలేదన్న వివరణలు ఎక్కడికక్కడ ఇచ్చుకుంటోంది. ఫేక్ వీడియోలు ప్రచారం చేసిందెవరో ఆరా తీసి కొందర్ని అరెస్ట్ చేస్తోంది. ఏదేమనుకున్నా గత కొంత కాలంగా షెడ్యూల్డు కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు, అర్హులైన మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు ఉద్యోగాల్లోను, విద్యాసంస్థల ప్రవేశాల్లోను తప్పనిసరిగా ఉండాలన్న ఏకాభిప్రాయం రాజకీయ పార్టీల్లో గూడుకట్టుకుని ఉందన్నది వాస్తవం.

సంఘ్ పరివార్ విభాగాలు కూడా బహిరంగంగా దీనికి గట్టి మద్దతునే ఇస్తున్నాయి. రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లకు ముగింపు పలకడానికి లోక్‌సభలో ఏకగుత్తగా 400 సీట్లు తెచ్చుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేసిన ఆరోపణలు ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నాయి. దీని వల్ల కలిగే నష్టం పూడ్చుకోడానికి సంఘ్ పరివార్ రంగంలోకి దిగి బహిరంగంగా రిజర్వేషన్లకు మద్దతు పలికిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రిజర్వేషన్లకు తమ సంస్థ వ్యతిరేకం కాదని, సమాజంలో వర్గ వివక్ష ఉన్నన్నాళ్లూ రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ను తాను వ్యతిరేకిస్తూ వచ్చిన వీడియోను ఆయన తోసిపుచ్చారు.

ఇదే సమయంలో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కోటాల జాబితాను మోడీ గ్యారంటీలుగా కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ కోటాలను తొలగించే ప్రసక్తే లేదని, అలాంటి ప్రయత్నాలు ఎవరినీ చేయనీయమని షా ప్రకటించారు. రాహుల్ గాంధీ కేవలం ఆధారాలులేని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇండియా కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే కులగణన కచ్చితంగా నిర్వహిస్తామని ప్రకటించిన దగ్గర నుంచే ఎన్నికల ప్రచారం లో ఈ రిజర్వేషన్ల చర్చ వేడెక్కింది. కులగణన కాదు, ప్రజల ఆస్తులను గుర్తిస్తారని, దాంతో ఎవరెంత సంపాదించారో ఆరా తీసి ఆ సంపదను వారనుకున్న వారికి పంపిణీ చేస్తారన్న అంశం కూడా ప్రచారంలో వివాదాస్పదమైంది. 2008 లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తామని ప్రకటించినట్టు మోడీ ప్రచారంలో పదేపదే తన ఉపన్యాసాలలో ప్రస్తావించారు.

దీని ద్వారా కాంగ్రెస్‌ను ప్రజల ముందు ఒక దోషిగా నిలబెట్టాలన్న ప్రయత్నం బిజెపి వర్గాల్లో కనిపిస్తోంది. ఇదిలా ఉండగా స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత అట్టడుగున ఉన్న అన్ని వర్గాల పురోగతి కోసం అనేక చర్యలు తీసుకోవడమైంది. టాప్ 1 శాతంగా ఉన్న జనాభా గుప్పిటలో 40 శాతం ఆస్తులు ఉన్న దేశం గా భారత్ రికార్డుకెక్కింది. ఆర్థిక అసమానతలు ఊహించలేని స్థాయిలో పెరిగాయి. దీనికి తోడు నిరుద్యోగం తీరని సమస్యగా వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువగా ఇవే అంశంపై ఆందోళన చెందుతున్నా ఎన్నికల ప్రచారంలో ఇదేమీ రాకపోవడం ఓటర్లు గమనిస్తున్నారు. సంపద తిరిగి పంపిణీ అన్న చర్చ విపక్షం ప్రారంభించిన తరువాతనే బిజెపి రిజర్వేషన్ల గురించి తెరపైకి తెచ్చింది. భారీ ఎత్తున వివక్షకు గురవుతున్న జనాభా దేశంలో తమ భాగం పొందడానికి రిజర్వేషన్ ఒక ఊతంగా కనిపిస్తోంది. అంటే సంపద పొందడం కాదు. ఆర్థిక అసమానతలు నివారించాలన్న ఏకాభిప్రాయం అందరిలో వినిపిస్తోంది. ఈ దశలో దీనిపై చర్చలో మరింత పురోగతి అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News