Monday, December 23, 2024

రాజకీయ కుస్తీ

- Advertisement -
- Advertisement -

రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్
రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మాలిక్

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ ఘన విజయం సాధించారు. సంజయ్ సింగ్ రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా తదితరులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజా ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ ప్యానల్‌కు చెందిన సంజయ్ సింగ్ ఎన్నిక కావడం స్టార్ రెజ్లర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. దీనికి నిరసనగా రెజ్లింగ్ నుంచి వైదొలుగుతున్నట్టు సాక్షి మాలిక్ ప్రకటించింది. బ్రిజ్ భూషణ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. బిజెపి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత్‌కు చెందిన పలువురు స్టార్ రెజ్లర్లు రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సుదీర్ఘ రోజుల పాటు ధర్నా చేశారు. ఈ ధర్నాకు దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.

దీంతో దిగివచ్చిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భారత రెజ్లింగ్ సమాఖ్య పాలక వర్గంపై వేటు వేసింది. సమాఖ్యపై నిషేధం విధించడంతో రెజ్లింగ్ సమాఖ్య రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణ కోసం భారత ఒలింపిక్ సంఘం అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం పలుసార్లు ప్రయత్నించగా కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ తరచూ వాయిదా పడుతూ వచ్చింది. రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించకుండా పంజాబ్, హర్యానా హైకోర్టు స్టేను విధించింది. ఈ స్టేను దేశ అత్యున్నత న్యాయం స్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఎత్తివేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా గురువారం నిర్వహించిన రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో బ్రిజ్‌భూషన్ వ్యాపార భాగస్వామి సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్ ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. కాగా, గురువారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ భారీ తేడాతో కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత, రెజ్లర్ అనితా శ్యోరాణ్‌ను ఓడించారు. మొత్తం 47 ఓట్లకుగాను సంజయ్ సింగ్‌కు ఏకంగా 40 ఓట్లు రావడం విశేషం.

రెజ్లింగ్‌కు సాక్షి గుడ్‌బై..
ఎన్నికల ఫలితాలపై తీవ్ర నిరాశకు గురైన స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఫలితం తనను తీవ్ర ఆవేదన కలిగించిందని తెలిపింది. ఎవరికి వ్యతిరేకంగా తాము పోరాడామో వారికే విజయం దక్కడం ఎంతో బాధించిందని పేర్కొంది. ఇలాంటి స్థితిలో తాను రెజ్లింగ్‌లో కొనసాగడంలో అర్థం లేదని సాక్షి వాపోయింది. బ్రిజ్‌భూషణ్ వ్యాపార భాగస్వామి, సన్నిహితుడు సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికైతే తాము రెజ్లింగ్‌లో కొనసాగి ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. దీంతో ఆట నుంచి పూర్తిగా తప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు సాక్షి వివరించింది. ఇదిలావుంటే ఎన్నికల ఫలితాలపై భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్ సింగ్ ఎన్నిక తమను మనోవేదనకు గురి చేసిందని వాపోయారు. వినేశ్ ఫొగాట్ తాజా ఫలితంపై కన్నీళ్ల పర్యంతరమైంది. ఇలాంటి ఫలితం వస్తుందని తాము ఊహించలేక పోయామని వినేశ్ వాపోయింది. ఎన్నికల ఫలితాల అనంతరం సాక్షి మీడియా సమావేశంలో పాల్గొంది. ఈమెతో పాటు వినేశ్, భజరంగ్ కూడా పాల్గొన్నారు.

Sakshi Malik

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News