Friday, November 22, 2024

రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

ఆయా రాజకీయ పార్టీల వారీగా చూస్తే నేరచరిత ఎక్కువగా ఉన్న శాసన సభ్యులలో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వారు అగ్రభాగాన నిలవడం గమనార్హం. అనునిత్యం ప్రజాస్వామ్య ప్రవచనాలు వల్లించే ఈ భారతీయ జనతా పార్టీకి చెందిన 1356 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించగా ఏకంగా 473మంది అంటే 35శాతం నేరచరిత్రని కలిగి ఉండడమే కాకుండా వారిలో 337 మంది అంటే 25శాతం సీరియస్ నేరాల్లో నిందితులుగా ఉండడం అప్రజాస్వామిక రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కాంగ్రెస్ రెండవ స్థానంలోను, డి.ఎం.కె మూడవ స్థానంలోను ఉండడం గమనార్హం. జాతీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రాంతీయ పార్టీలు సైతం నేరమయ రాజకీయాలలో అందెవేసిన చేయిగా ఉండడాన్ని చాలా నిశితంగా గమనించవచ్చు.

రాష్ట్రాల వారిగా చూస్తే 135 మంది శాసనసభ్యులలో 95 మందికి అంటే 70 శాతం నేర చరితులతో కేరళ ముందు వరుసలో ఉంది. అనునిత్యం ’సమసమాజం’ అని గొంతు చించుకునే కమ్యూనిస్ట్ కేరళ రాష్ట్రం సైతం నేర రాజకీయాలలో అగ్ర స్థానంలో నిలవడం సమసమాజ స్వాప్నికులను కడు విస్మయానికి గురిచేసింది. అదే విధంగా శాసనసభ్యుల ఆస్తుల పరంగా చూస్తే కర్ణాటక రాష్ట్రం రూ.64.39 కోట్లతో 14 శాతంతో మొదటి స్థానంలో ఉండగా శాసన సభ్యులలో అత్యంత ధనికుడిగా అదే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ రూ.1,413 కోట్లతో ముందు వరుసలో ఉండడం గమనార్హం. నేడు భారతదేశ రాజకీయాలు ఓట్లు, నోట్లు, సీట్లు అనే విధంగా మార డం అసలు సిసలైన ప్రజాస్వామ్యాన్ని పాతాళంలోకి తొక్కి వేశాయి. చెమట చుక్కలు చిందించకుండా ప్రజల సొమ్ముని దోచుకుని రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా ఎదిగే అవకాశాలు భారతదేశ రాజకీయాలు కల్పించడం కడు విచారకరం.

అలాగే ప్రజాప్రతినిధులు మహిళలను వేధించడం, వారిపై హత్యా ప్రయత్నాలకు పాల్పడడం, దూషించడం తదితర ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడిన శాసనసభ్యుల సంఖ్య 114 కాగా వీరిలో 14 మంది 376 సెక్షన్ కింద అత్యాచార నిందితులు కావడం సిగ్గుచేటైన విషయం. ఈ రకంగా దేశ రాజకీయాలలో ప్రజాప్రతినిధుల నేరాలు రోజురోజుకు పెరుగుతుండడం కడు విచారకరం. నేరాలను నిలువరించే దిశలో ప్రభుత్వాలు తగిన విధంగా వ్యవహరించడం లేదు విమర్శలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ నివేదికను చాలా సునిశితంగా పరిశీలిస్తే ఆయా పార్టీలు అన్ని కూడా ధన మరియు నేర రాజకీయాలలో పాలుపంచుకుంటూ ప్రజాస్వామ్య పునాదులను సైతం పెకిలిస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయి అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈరోజుల్లో గ్రామ పంచాయితీ సర్పంచ్ గాను గెలవడానికి కూడా కోటి రూపాయల దాకా కూడా ఖర్చు చేస్తున్న హెచ్చు ఘటనలు చాలా సృష్టంగా కనిపిస్తున్నాయి. తీరా ఎన్నికల్లో గెలిచాకా దోచుకోవడం మరియు దాచుకోవడమే తప్పితే వారు ప్రజలకు ఒరగబెట్టేది ఏమి ఉండదు. డబ్బులు ఉన్నవారే నేడు రాజకీయాలలో రాణిస్తున్నారు తప్ప సామాన్యులకు రాజకీయాలలో రాణించే అవకాశాలు కనుచూపుమేరలో కూడా కనబడడం లేదు. ఎన్నికలను సజావుగా అవినీతి మరియు అన్యాయాలకు తావు ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమీషన్లు సైతం విఫలం కావడం కూడా నేరమయ రాజకీయాలు మరింతగా పెట్రేగిపోవడానికి దోహదం చేస్తుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందువల్ల ఎన్నికల కమీషన్ నిద్రావస్థ నుండి మేల్కొని నేరమయ రాజకీయాలను పూర్తిగా నిలువరించే దిశగా ప్రక్షాళన గావించే విధంగా తగిన చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News