Sunday, December 22, 2024

జర్మనీలో మారుతున్న రాజకీయం

- Advertisement -
- Advertisement -

ఇండియాలోనే కాక ప్రపంచమంతా మత వాద పక్షాలు అధికారానికి రావడానికి అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి. వాటిల్లో జర్మనీ ఒకటి. ఉత్తర జర్మనీలో హాంబర్గ్ నగర సమావేశ మందిరం (సిటీ హాల్) ముందు జనవరి 28 న తీవ్రవాద మత రాజకీయాలకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం లేదు అని రాసి ఉన్న నినాద పత్రాలతో (ప్లకార్డులతో) నిరసన కారులు ఆందోళన చేశారు. ఆరు వారాలుగా మితవాద తీవ్రవాదానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి మద్దతుగా పదుల లక్షల్లో ప్రజలు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అనేక నగరాలు, పట్టణాలలో ఈ ఆందోళనల, ప్రదర్శనల హోరు రేకెత్తింది. వ్యాపించింది.జర్మనీ మితవాద పార్టీ, ఆల్టర్నేటివ్ ఫర్ డ్యూచ్ ల్యాండ్ (ఎఎఫ్‌డి), ప్రాంతీయ ఎన్నికలలో తక్కువ తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి ఎఎఫ్‌డి కి గట్టి దెబ్బ. విదేశీయుల సామూహిక బహిష్కరణకు సంబంధించిన దాని హేయమైన ప్రణాళికలు ఇటీవల బహిర్గతమయ్యాయి.

ఇది దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దారితీసింది. ఎఎఫ్‌డి అమానవీయ చర్యల తర్వాత ఈ ఎన్నికలు దానికి మొదటి పరీక్ష. ఇందులో అది విఫలమైంది. ఆగ్నేయ రాష్ట్రమైన తురింగియాలోని గ్రామీణ జిల్లా సాలే-ఓర్లాలో జనవరి 28 నాటి జిల్లా ఎన్నికలకు ముందు, వలస వ్యతిరేక విధానాలకు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్న ఎఎఫ్‌డి తన రెండవ స్థానిక ప్రభుత్వ అధికారాన్ని పొందే అవకాశం ఉందని సర్వే సూచించింది. జనవరి 2024 మొదట్లో పరిశోధనాత్మక వార్తా సంస్థ ‘కరెక్టివ్’ ఒక నివేదికను ప్రచురించింది. అందులో 2023 నవంబర్ సమావేశ నిర్ణయాలను బయటపెట్టింది. ఆ సమావేశంలో ఎఎఫ్‌డి, ఇతర తీవ్ర మితవాద పక్షాల నాయకులు వలసదారు విదేశీయులను, అసమీకృత అనగా జర్మన్ జాతీయులు కాని జర్మన్ పౌరులను మొత్తంగా బహిష్కరించే ప్రణాళికలను చర్చించారు. ఈ నివేదిక ప్రకటన తర్వాత జరిగిన ఈ మొదటి ఎన్నికల ఫలితాలను ప్రజలు గుర్తించారు.

కన్జర్వేటివ్ క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్టియన్ హెర్గోట్, ప్రాంతీయ ఎన్నికలలో ఎఎఫ్‌డి అభ్యర్థి ఉవే థ్రమ్‌ను ఓడించారు. కరెక్టివ్ నివేదిక విడుదల కాకముందు పోటీలో బాగా ముందంజలో ఉన్నప్పటికీ, థ్రమ్ 47.6% ఓట్లను మాత్రమే పొందగలిగారు. హెర్గోట్ 52.4% ఓట్లతో గెలిచాడు. తురింగియా రాష్ట్రం ఎఎఫ్‌డికి బలమైన కోటగా పరిగణించబడుతుంది. అనేక ఇతర తూర్పు రాష్ట్రాలలో ఉన్నట్లుగా, ప్రస్తుతం అక్కడ ఎఎఫ్‌డి 30శాతానికి పైగా ఆమోదం కలిగి ఉందని, జర్మన్ సమాఖ్య పన్నుల ఆదాయం ద్వారా నిధులు పొందుతున్న జర్మన్ ప్రభుత్వ, ప్రజా యాజమాన్య అంతర్జాతీయ ప్రసార సంస్థ డ్యుయిష్ వెల్లే నివేదించింది. ఎఎఫ్‌డి మద్దతు దేశ వ్యాప్తంగా పెరుగుతూ 20% మార్కులకు చేరువలో ఉంది.
ఎఎఫ్‌డి రాజకీయ నాయకుల, ఇతర మితవాద తీవ్రవాదుల బహిష్కరణ ప్రణాళికను ఇటీవల కనుగొన్న తర్వాత, వలస వ్యతిరేక ఎఎఫ్‌డికి వ్యతిరేకంగా పౌర సమాజం సమీకరణకు జనవరి 28 జిల్లా ఎన్నికల ఫలితం విస్తృత సంకేతంగా పరిగణించబడిందని ‘ది గార్డియన్’ పత్రిక నివేదించింది. సాలె-ఓర్లా జిల్లాలో దాదాపు 66 వేల ఓటర్లు ఉన్నారు.

జర్మన్ దేశ గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం ఈ జిల్లా దేశంలోని అత్యంత పేద జిల్లాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గత వేసవిలో ఎఎఫ్‌డి అభ్యర్థి రాబర్ట్ సెసెల్మాన్ తురింగియాలోని సోన్నెబర్గ్‌లో పార్టీ మొదటి కౌంటీ అడ్మినిస్ట్రేటర్ పదవిని గెలుచుకున్నారు. ఈ గెలుపు ఎఎఫ్‌డికి ఒక ముఖ్యమైన ప్రతీకాత్మక మైలురాయి. అతి ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడే తురింగియా రాష్ట్ర ఎఎఫ్‌డి నాయకుడు బ్జోర్న్ హాక్, సెప్టెంబరులో జరగబోయే రాష్ట్రవ్యాప్త ఎన్నికలను సమాఖ్య ప్రభుత్వంలోకి ప్రవేశించడానికి సంభావ్య దూకుడు బల్లగా పార్టీ చూస్తుందని పేర్కొన్నారు. జూన్‌లో సోన్నెబెర్గ్‌లో విజయం సాధించిన తర్వాత తమ మద్దతుదారులతో, ఇది ప్రారంభం మాత్రమేనని హాక్ అన్నారు. సోన్నెబెర్గ్‌లో పార్టీ విజయం 2025 లో సమాఖ్య ప్రభుత్వంలోకి తమ ప్రవేశానికి మార్గం సుగమం చేయగలదని ఎఎఫ్‌డి నాయకురాలు అలిస్ వీడెల్ గత వారం అన్నారు.
ప్రస్తుతం సెంట్రల్- లెఫ్ట్ రాజకీయాల సోషల్ డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు ఓలఫ్ స్కోల్జ్ జర్మన్ ఛాన్సలర్.

ఇప్పుడు ఎఎఫ్‌డి జర్మనీలోని మొత్తం 16 రాష్ట్రాలలో అధికారం నుండి మినహాయించబడింది. ఎందుకంటే ఇతర పార్టీలు దానితో ఎలాంటి కూటమిని ఏర్పాటు చేయడాన్ని తోసిపుచ్చాయి. దీనికి కారణం దాని వివాదాస్పద వలస వ్యతిరేక, జర్మన్ జాతి సమీకరణ ప్రణాళిక.ఎఎఫ్‌డి మన మతోన్మాద కార్పొరేట్ ఫాసిస్టు బిజెపి లాంటిది. ఇండియాలో ముస్లింలకు భారత పౌరసత్వాన్ని రద్దు చేసి, పౌరసత్వ, ఓటు, మానవ హక్కులను లేకుండా చేయడానికి బిజెపి ప్రభుత్వం జాతీయ పౌరసత్వ జాబితాపట్టిక, జాతీయ జనాభా నమోదు లాంటి చట్టాలను చేసింది. ఇండియాకు వలస వచ్చిన వైదిక విదేశీయులకు మతాధారంగా భారత పౌరసత్వం కట్టబెట్టే పౌరసత్వ సవరణ చట్టం చేసింది. అస్సాం, అనేక ఉత్తర భారత రాష్ట్రాలలో ఈ చట్టాలకు వ్యతిరేకంగా, తీవ్ర నిరసన ఉద్యమాలు జరిగాయి. వాటిలో ఢిల్లీలో జరిగిన షాహీన్‌బాగ్ ఉద్యమం ప్రత్యేకమైంది. అందులో ముస్లిం మహిళలు మాత్రమే పాల్గొన్నారు.భారత రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ, జాతీయ గీతాలను భక్తి శ్రద్ధలతో ఆలాపిస్తూ అలుపెరుగని శాంతియుత ఉద్యమం నడిపారు.

కోవిడ్ సాకుతో బిజెపి కేంద్ర ప్రభుత్వం బలవంతంగా నిరసన శిబిరాన్ని ఎత్తివేసింది. 2024 సాధారణ ఎన్నికల ముందు బిజెపి అనేక భావజాల మతపర ఎత్తుగడల పనులు చేసింది. చేస్తోంది. ఈ ఎన్నికల్లో రాబోయే పార్లమెంటు సీట్ల సంఖ్య లో మోడీ గారడీ నినాదాలు ఇస్తున్నారు. బిజెపి అనుకూల కార్పొరేట్ మాధ్యమాల అంచనాలు మోడీని మేఘాలపై కూర్చోబెడుతున్నాయి. జర్మనీలో మధ్యేమార్గ పార్టీలతో సహా సోషల్ డెమొక్రాటిక్ పార్టీలు ఎఎఫ్‌డిని దూరం పెట్టాయి. ఇండియాలో కూడా వామపక్షాలు, కాంగ్రెస్, సోషలిస్టులతో పాటు మధ్యేమార్గ, సున్నిత మెతక ధోరణి ప్రతిపక్షాలన్నీ బిజెపి మతవాద, కార్పొరేట్ ఫాసిజాన్ని తిరిగి కుర్చీ ఎక్కకుండా చేయడానికి కలిసిమెలిసి పని చేయాలి. తిండి ఉంటే ఎవరు ఎంత తినాలో నిర్ణయించుకోవచ్చు. అందుకే ముందుగా గెలుపు కోసం పోరాడాలి. సాధించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News