అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొన్నిచోట్ల పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. 80 శాతం వరకు ఓటర్లు ఓటేశారు. ఎన్నికల సంఘం ప్రకారం అయితే 78.36 శాతం ఓట్లేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని చింతల, అనకాపల్లి జిల్లాలోని గోటివాడ అగ్రహారం, విశాఖపట్నంలోని భీమునిపట్నంలలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది.
తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఊర్లకు వచ్చి ఓటేశారు. కొందరైతే విదేశాల నుంచి కూడా స్వస్థలానికి వచ్చి మరీ ఓటేశారు. ఆంధ్రలో 25 లోక్ సభ స్థానాలకు సింగిల్ ఫేజ్ పోలింగ్ జరిగింది. దీంతో పాటు అసెంబ్లీ 175 సీట్లకు కూడా ఏక కాలంలో పోలింగ్ జరిగింది. 4.14 కోట్ల కంటే ఎక్కు ఓటర్లు ఓటేయడానికి అర్హులయ్యారు. ఎన్నికల అధికారులు ఏపి వ్యాప్తంగా 46389 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 2841 అభ్యర్థుల తలరాతను ఆంధ్ర ఓటర్లు నిర్ణయించేశారు.
వామపక్ష తీవ్రవాదుల ప్రభావం ఉన్న అరకు, పాడేరు, రంపచౌడావరంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఇక పాలకొండ, కురుపం, సాలూరు లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది.