సేదతీరేందుకు నేతల విహారయాత్రలు
ఓట్ల లెక్కింపునకు 21 రోజుల సమయం
ఉండటంతో రిలాక్స్ అవుతున్న అభ్యర్థులు
మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్షంగా గత రెండు నెలలుగా తీరికలేకుండా ప్రచారం నిర్వహించి అలిసిపోయిన ప్రధాన పార్టీలు నాయకులు, అభ్యర్థులు ఇప్పుడు కొంచెంది విరామం లభించింది. రాష్ట్రంలో పోలింగ్ ముగియడంతో నాయకులు, అభ్యర్థులకు ఒక్కసారిగా తలపై బరువు దిగిపోయినట్లు అయ్యింది. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, కార్నర్ మీటింగ్‌లు, బైక్ ర్యాలీలతో తీరిక లేకుండా తిరిగిన నాయకులు కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపునకు ఇంకా 21 రోజుల సమయం ఉండడంతో ఇక చేసేదేమీ లేక విహార యాత్రలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతుండగా మరికొందరు ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళుతున్నారు. పోలింగ్ ముగియడంతో పాటు ప్రస్తుతం ఎండాకాలం కూడా కావడంతో శీతల ప్రదేశాలకు దేశంలోని శీతల ప్రదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
17న లండన్‌కు జగన్
ఎన్నికల ప్రచారం, రోడ్ షోలతో బిజీగా గడిపిన ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలు ముగియడంతో రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లారు. విరామ సమయంలో కుటుంబంతో గడిపేందుకు ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. తాజాగా జగన్ విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు జగన్ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా జగన్ లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలలో పర్యటించనున్నట్లు తెలిసింది. అక్కడే దాదాపు 14 రోజుల పాటు గడపనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు మూడు రోజుల ముందు తిరిగి ఎపి రాష్ట్రానికి రానున్నారు.
అనుచరులతో కలిసి కొచ్చిన్ వెళ్లిన పొంగులేటి
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగియడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం కొచ్చిన్‌కు వెళ్లారు.ఆయనతో ఎంఎల్‌ఎ తెల్లం వెంకట్రావు, మాజీ ఎంఎల్‌ఎలు పైలెట్ రోహిత్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, అనుచరులు మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, ఆదినారాయణలతో పాటు 106 మంది పొంగులేటితో కలిసి కొచ్చిన్‌కు బయలుదేరి వెళ్లారు. ఎ
కుటుంబ సభ్యులతో గడుపుతున్న అభ్యర్థులు
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ముఖ్యనేతలు దాదాపు రెండు నెలల పాటు విరామం లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారికి ఇప్పుడు కొంచెం విరామం దొరకడంతో ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం కేటాయిస్తున్నారు. రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న సొంత పనులను చక్కదిద్దుకోవడంపైనా, కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కుటుంబ సమేతంగా సేదతీరేందుకు పార్కులు, రిసార్టులకు వెళుతున్నారు.
శీతల ప్రదేశాలకు హాలిడే ట్రిప్పులు
ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ఇతర రాష్ట్రాల్లో శీతల ప్రదేశాలకు హాలీ డే ట్రిప్పులకే వెళ్లేందుకు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. కౌంటింగ్‌కు మూడు వారాల సమయం ఉంటంతో కనీసం వారం రోజులైనా సేదతీరాలని అభ్యర్థులు, నాయకులు భావిస్తున్నారు. ఎక్కువగా కేరళ, ఊటీ, కొడైకెనాల్,కులు మనాలి,కొచ్చిన్, గోవా, హిమాచల్‌ప్రదేశ్ తదితర ప్రదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అభ్యర్థుల్లో అదే ఆందోళన
ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో కొంతమంది కచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉండగా, మరికొంతమంది ఈసారి ఓడిపోతామేమో అన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత రిలాక్స్ అవుతున్నట్లు బయటకి కనిపిస్తున్నప్పటికీ అభ్యర్థుల్లో మాత్రం లోలోపల గెలుపు ఓటముల గురించే ఆలోచిస్తున్నారు. పోలింగ్ సరళిని చూసిన తర్వాత నియోజకవర్గాలలో అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటున్నారు. పోలింగ్ శాతం పెరగడం, పోలింగ్ జరిగిన తీరు ఎలాంటి పరిణామాలకు దారిస్తుందోనని వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. పార్టీల పరంగా నియోజకవర్గాలలో తమ బలం, బలహీనతలను అంచనా వేసుకుంటూ గెలుపు ఓటములపై అభ్యర్థులు విశ్లేషించుకున్నారు. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు గెలుపు ఓటములపై ఓ స్పష్టమైన అంచనాకు రాగా, మరికొంతమంది కొంచెం అటుఇటూగా ఉన్నారు.