Wednesday, January 22, 2025

నేడే తొలి సమరం

- Advertisement -
- Advertisement -
 21 రాష్టాలు, యుటిలు : 102 లోక్‌సభ సీట్లు
 92 అసెంబీ సీట్లకూ నేడే పోలింగ్
 ఎన్నికల బరిలో 1600కి పైగా అభ్యర్థులు
 41 హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు
 1.87 లక్షల పోలింగ్ బూత్‌లు… 16.63 కోట్ల మంది ఓటర్లు

న్యూఢిల్లీ: తొలి దశ లోక్‌సభ ఎన్నికలు శుక్రవారం జరగనుండటంతో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్య మంత్రులు, ఒక మాజీ గవర్నర్‌తో సహా 1600 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 102 పార్లమెంటరీ నియోజకవర్గాలలో పోలింగ్ జరగనున్నది. ఏడు దశలలో జరగనున్న ఈ ఎన్నికలలో తొలి దశలోనే అత్యధిక స్థానాలలో పోలింగ్ జరగనున్నది. లోక్‌సభ స్థానాలతోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలోని 92 అసెంబ్లీ స్థానాలలో సైతం శుక్రవారం పోలింగ్ జరగనున్నది. తొలిదశ పోలింగ్ 102 లోక్‌సభ నియోజకవర్గాలలో 39 స్థానాలలో బిజెపి 2019 ఎన్నికలలో గెలుపొందింది. ఇవిఎంలతో 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనున్నది.

కొన్ని సీట్లలో మాత్రం పోలింగ్ ముగింపు సమయం మారుతుంది. మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా, 18 లక్షల మందికి పైగా పోలింగ్ సిబ్బందిని ఎన్నికల కమిషన్ నియమించింది. 16.63 కోట్ల మంది ఓటర్లు తొలి దశలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు, 11,371 మంది థర్డ్ జెండర్‌కు చెందిన వారు ఉన్నారు. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నవారు 35.67 లక్షల మంది ఉన్నారు. వీరుగాక 20 ఏళ్ల వయస్సు నుంచి -29 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు సుమారు 3.51 కోట్ల మంది ఉన్నారు. ఎన్నికల విధుల కోసం పోలింగ్ సిబ్బందిని, భద్రతా సిబ్బందిని తరలించేందుకు 41 హెలికాప్టర్లు, 84 ప్రత్యేక రైళ్లు, దాదాపు ఒక లక్ష వాహనాలను వినియోగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

50 శాతానికి పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరుగుతుందని, అన్ని పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామని ఇసి తెలిపింది. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందే అదనంగా నియమించిన 361మంది పరిశీలకులు (127 మంది జనరల్, 67 మంది పోలీసు, 167 మంది వ్యయ పరిశీలకులు) ఆయా నియోజకవర్గాలకు చేరుకున్నారు. కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక పరిశీలకులను కూడా ఇసి నియమించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గత రెండు సంవ త్సరాలుగా లోక్‌సభ ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తున్నారు.

తొలి దశ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేంద్ర మంత్రులలో నితిన్ గడ్కరీ (నాగపూర్), కిరణ్ రిజిజు (అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ), అర్జున్‌రాం మేఘావల్ (రాజస్థాన్‌లోని బికనేర్), సర్బానంద సోనోవాల్ (అస్సాంలోని దిబ్రూగఢ్), జితేంద్ర సింగ్ (జమ్మూ కశ్మీరులోని ఉధంపూర్), భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్‌లోని ఆల్వార్) ఉన్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు, కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపి నకుల్ నాథ్ ఛింద్వారా నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాలలో ఒకటైన పశ్చిమ త్రిపుర స్థానానికి తొలి దశలో పోలింగ్ జరగనున్నది. ఈ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి బిప్లబి కుమార్ దేబ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిష్ కుమార్ సాహా తలపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News