Sunday, December 22, 2024

పెరిగిన పోలింగ్ శాతం

- Advertisement -
- Advertisement -

ఎవరికి లాభం…ఎవరికి నష్టం
ప్రధాన పార్టీల నేతల్లో అంతర్మథనం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్షంగా మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బిజెపి, రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 62.77 శాతం పోలింగ్ నమోదు కాగా,ఈ సారి 66.3 శాతం పోలింగ్ నమోదయ్యింది.

సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 9 గంటల వరకు 9.51 శాతం మంది ఓట్లు వేశారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో పుంజుకొని 11 గంటలకు పోలింగ్ శాతం 24.31 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.38 శాతం పోలింగ్ పెరిగింది. ఇలా క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతానికి, సాయంత్రం 5 గంటలకు 61.16 శాతానికి పెరిగింది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సారి ఇంటి నుంచి ఓట్లు వేసిన వారు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న వారితో కలిపి తుది ఓటింగ్ శాతం 66.3గా నమోదయ్యింది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ శాతం తగ్గడం, గత లోక్‌సభ పోల్చుకుంటే పెరగడం ఎవరికి లాభం చేస్తుంది..? ఎవరికి నష్టం చేస్తుందో అని ఆయా పార్టీల నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 71.34 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 62.77 శాతం పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే పెరిగిన పోలింగ్ శాతం తమకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్ని పార్టీలు ఆరా తీస్తున్నాయి.

రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా భువనగిరిలో అత్యధికంగా 76.47 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా ఎప్పటిలాగే హైదరాబాద్‌లో తక్కువ ఓటింగ్ నమోదైంది. నగరంలో 46.08 శాతం పోలింగ్ నమోదైంది. రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్లలో 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని, అందుకే తమకు అనుకూలంగా పోలింగ్ నమోదైందని కాంగ్రెస్ నాయకులు ధీమాతో ఉండగా, కేంద్రంలో మళ్లీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించి ప్రజలు తమకు అనుకూలంగా ఓటు వేశారని, అందుకే పెద్ద సంఖ్యలో పోలింగ్ జరిగిందని బిజెపి ధీమా వ్యక్తం చేస్తున్నది. తమ పాలనలో కరెంట్ కష్టాలు, సాగు, తాగు నీరుకు ఇబ్బందులు లేవని, కానీ, కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని బిఆర్‌ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News