Thursday, November 21, 2024

కాలుష్య కారకులే ఖర్చు భరించాలి

- Advertisement -
- Advertisement -

ఆచరణ లేకుంటే అంతర్జాతీయ అంగీకారాలన్నీ… యేళ్ల తరబడి వెక్కిరింపుల తెల్లకా గితాలే! వాతావరణ మార్పు దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు అజర్‌బైజాన్‌లోని ‘బాకు’లో ఇపుడు జరుగుతున్న భాగస్వామ్య పక్షాల సదస్సు, ‘కాప్29’ తీరు ఇందుకు భిన్నంగా ఏం లేదు. సదస్సు మొదలై వారం దాటినా…. ‘ఎడతెగని భేటీ లు ముందుకుపడని అడుగులు’ అన్నట్టుంది పరి స్థితి! అందుకే, భారత్ తన తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్నీ వ్యక్తం చేసింది. మాట ప్రకారం, ఇస్తానన్న ‘క్లైమెట్ ఫైనాన్స్’ నిధుల విడుదలపై నిబద్ధ్దత చూపండని అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేసింది. మరోవంక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా ఎన్నికవడంతో మొత్తం ‘క్లైమెట్ ఫైనాన్స్’ నిధి మీదే నీలినీడలు కమ్ముకున్నాయి. మాటలకు చేతలకు పొంతన లేని సంపన్న దేశాల వైఖరి, ‘ఐక్యరాజ్యసమితియుఎన్’ లక్ష్యాలనే దెబ్బతీసేలా ఉంది. ‘ఎందుకీ పరి స్థితి? ఎవరు కారకులు?’ అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం!

తిండికి తిప్పరాజు పనికి పోతరాజు’ అనేది పాతబడిన సామెత. ప్రపంచంలో కొన్ని సంపన్న దేశాల వైఖరి అలానే ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు… ఆ స్థితిని సాధించడంలో ప్రకృతి వనరుల్ని ఇబ్బడి-ముబ్బడిగా వాడుకున్నాయి. వాతావరణ కాలుష్యానికి కారణమయ్యాయి. కాలక్రమంలో అదేమో, అందరి సమస్య అయి కూర్చుంది. ‘ఇప్పటికే హద్దులు దాటాం, బొగ్గు, పెట్రోలు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలను అడ్డదిడ్డంగా వాడటం వల్ల పర్యావరణం పాడై వైపరీత్యాలు వస్తున్నాయి, అందుకని పరిమితులు విధించుకుందాం, సహజవనరుల్ని ఇకపై ఎవరమూ వాడొద్దు, ప్రత్యామ్నాయాలకు వెళ్దాం’ అంటూ, అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు నీతి సూక్తులు వల్లిస్తున్నాయి. ఎలా ఉందంటే, నూరు ఎలకల్ని తిన్న పిల్లి ‘హజ్’కు బయల్దేరినట్టుంది. ‘అలా కాదు, ఇన్నేళ్లుగా మీరే అన్నీ అనుభవించారు, మీ జనాభాకు మించి ఎన్నో రెట్లు అధికంగా ఉమ్మడి ఆస్తి అయిన ప్రకృతి సహజ వనరుల్ని వాడారు, ఇంకా వాడుతున్నారు.

అలా, ఈ ప్రపంచ ప్రమాదం మీరే తెచ్చిపెట్టారు. మేం ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటపట్టాం. మమ్మల్ని అవేవీ వాడొద్దంటే ఎలా? మీ బాధ్యత ఎక్కువ కనుక కొంచెం నిధులు, కొంచెం సాంకేతిక సహాయం మాకు అందించండి, అందరం కలిసి పరిస్థితిని మెరుగుపరుద్దాం’ అన్నాయి, అభివృద్ధ్ది చెందుతున్న సమాజాలు. ఇది సమంజసమైన ప్రతిపాదనే అని యుఎన్ సమక్షంలో ప్రపంచ దేశాలు అంగీకరించాయి. 1972 లో స్టాక్‌హోమ్ (స్వీడన్)లో జరిగిన ప్రపంచ పర్యావరణ సదస్సు నుంచి ఎన్నెన్నో భేటీలు జరిగాయి. 1992 రియో (బ్రెజిల్) ‘ధరిత్రి సదస్సు’, 1992లోనే యుఎన్ ప్రత్యేక సదస్సు న్యూయార్క్‌లో జరిగాయి. 1997 క్యోటో (జపాన్) ప్రోటోకాల్ ఏర్పడింది. ‘సమస్య ఉమ్మడిదే కానీ, వారి వారి పరిస్థితి సామర్థ్యాలను బట్టి విభిన్న బాధ్యతలు’ అనే అంగీకారం కుదిరింది. 2002లో జోహనెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా) లో జరిగిన సుస్థిరాభివృద్ధి సదస్సు కూడా కీలకమైందే!

దయ కాదు బాధ్యత

వాతావరణ కాలుష్యం, ముఖ్యంగా శిలాజ ఇంధనాల వినియోగం వల్ల కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి వచ్చి భూగ్రహం వేడెక్కుతోంది. దాని ఫలితంగా ‘వాతావరణ మార్పు’ ఎన్నో అనర్ధాలకు కారణమవుతోంది. ఆ దుష్పరిణామాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు యుఎన్ నిర్దేశించిన ఫ్రేమ్‌వర్క్ ప్రకారం నడుచుకునేలా దాదాపు రెండొందల దేశాలు అంగీకరించి, సంతకాలు పెట్టాయి. ఏటా భేటీ అవుతున్నాయి. పారిశ్రామికీకరణ కాలంనాటి సగటు ఉష్ణోగ్రతలపై, 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు పెరగనీయకుండా నియంత్రించాలని ‘పారిస్ సదస్సు- 2015’లో నిర్ణయించారు. పర్యావరణవేత్తలు అంచనా వేసిన దాని కన్నా వేగంగా ప్రమాదం ముంచుకు వస్తోందని చెప్పిన, ‘వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వాల బృందం’ (ఐపిసిసి) నివేదికల్ని బట్టి తర్వాత ఆ లక్ష్యాన్ని కూడా సవరించారు.

1.5 డిగ్రీల సెల్సియస్ లోపలే కట్టడిచేయాలని కొత్త లక్ష్యం నిర్దేశించారు. దీనికి, ప్రధానంగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని కట్టడి చేసి, సౌరపవన -జల-హైడ్రోజన్ విద్యుత్తు వంటి పునర్వినియోగ -పునరుత్పాదక ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లాలని నిర్ణయించారు. యేటా భాగస్వామ్య పక్షాలు పాల్గొంటూ ‘కాప్’ సదస్సులు నిర్వహించి, ఎప్పటికప్పుడు లక్ష్యాల సాధన దిశలో నడకను సమీక్షించుకుంటున్నాయి. అలాంటి 29వ సదస్సు ఇప్పుడు అజర్‌బైజాన్ (పాత రష్యా సంయుక్త రాష్ట్రాల్లో భాగం) లోని ‘బాకు’లో జరుగుతోంది. ఈ పరంపరలో 15వ సదస్సు కోపన్‌హెగన్ (డెన్మార్క్)లో, 2009 లో జరిగినప్పుడు ఒక నిర్దిష్ట అంగీకారం కుదిరింది. వాతావరణ మార్పు విపరిణామాల్ని ఎదుర్కొంటూ, వాటి ప్రభావాల్ని తగ్గించేందుకు ఒక నిధిని ప్రతిపాదించారు.

అభివృద్ధి చెందిన దేశాలు ఉమ్మడిగా ఏటా లక్ష కోట్ల (వంద బిలియన్) డాలర్ల చొప్పున ఆర్థిక సహాయం (క్లైమెట్ ఫైనాన్స్) అభివృద్ధి చెందుతున్న దేశాలకు అయిదేళ పాటు అందిస్తామని, 2020 నుంచి అది మొదలవుతుందని ప్రకటించాయి. సమస్య అందరిది, ప్రభావాలు ఉమ్మడిగానే ఉన్నాయి, కాని కారకుల్లో వ్యత్యాసాలున్నాయనే కారణంగానే అభివృద్ధి చెందిన దేశాలు ఈ బాధ్యత తీసుకున్నాయి. ఆర్థిక సహాయంతో పాటు సాంకేతిక సహాయాన్ని, ఉపకరణాల్ని అందించాలనే అంగీకారం కుదిరింది. ప్రతి కాప్ సదస్సులోనూ దీనిపై చర్చిస్తారు. కానీ, కార్యాచరణలో ఏమీ ఉండట్లేదు. అందుకే, అడుగు ముందుకు పడట్లేదు.

2030 నాటికి భూతాపోన్నతిని 1.5 డిగ్రీల సెల్సియస్ లోపు నియంత్రించాల్సిన లక్ష్యాలు కళ్ల ముందుంటే, క్లైమెట్ ఫైనాన్స్ సమకూర్చే ప్రక్రియనే లేదు. ఎప్పుడో 2020 లోనే మొదలు కావాల్సింది. ఏది ‘క్లైమెట్ ఫైనాన్స్’ అనేది స్పష్టపరిచే నిర్వచనమే లేకపోవడం కాప్- 29 సదస్సులోనే ఓ హాస్యాస్పదంగా మారింది. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్’ (ఒఇసిడి) కథనం ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు యేటా లక్ష కోట్ల (వంద బిలియన్) డాలర్ల అభివృద్ధ్ది చెందిన దేశాల ఆర్థిక సహాయ లక్ష్యాలను ఎప్పుడో సాధించామని ఒక ప్రకటన ఇచ్చారు. ఆశ్చర్యపోవడం కాప్ నిర్వహకుల వంతైంది. ఎందుకంటే, ‘ఆక్స్‌ఫామ్ 2022’ నివేదిక ప్రకారం, ఇంకా 75 శాతం లక్ష్యాలు అభివృద్ధి చెందిన దేశాలు బాకీ ఉన్నట్టు పేర్కొంది.

More pollution in Musi river

‘క్లీన్ ఎనర్జీ రంగంలో, ప్రాజెక్టుల్లో సంప్రదాయ వ్యాపార పెట్టుబడులే ఆర్థిక సహాయమా? అంతకు మించి ఇచ్చే సహాయమా స్పష్టం చేయాలని, ‘క్లైమెట్ ఫైనాన్స్’ని విస్పష్టంగా నిర్వచించాలని అభివృద్ధి చెందని మూడో ప్రపంచ సమాజాలు కోరుతున్నాయి. పదిహేనేళ్ల కిందటి అంచనాలకు, తాజా పరిస్థితికి ఎంతో వ్యత్యాసం ఉందని, నిజానికి సహాయ నిధిని ఇంకా పెంచాల్సి ఉందనే డిమాండ్ వస్తోంది. ‘నూతన ఉమ్మడి నిర్దేశిత లక్ష్యాల’ (ఎన్‌సిక్యూజీ) ప్రకారం నిధిని పెంచాల్సి ఉండగా, ఇవ్వని ఆర్థిక సహాయాన్ని ఇచ్చేసినట్టు చెప్పటమేమిటని ఆశ్చర్యపోతున్నాయి.‘మేము వివిధ రకాల ఆర్థిక సహాయాలకు సంసిద్ధంగా ఉన్నాం, పారదర్శకంగా ఉన్నాం’ అని చెబుతారే తప్ప ఏదీ విదిల్చటం లేదని అభివృద్ధి చెందిన దేశాలపై విమర్శ ఉంది.‘ఇదుగో అదుగో అంటూ తీవ్ర జాప్యం చేస్తున్నారు, ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని కాప్- 29లో భారత్ వైపు నుంచి సంప్రదింపుల్లో పాల్గనే డిప్యూటీ నరేశ్ సాహ పేర్కొన్నారు.

ఎక్కువ జనాభాతో, తక్కువ కర్బన ఉద్గారాలకు కారణమవుతున్న దక్షిణ ప్రపంచం (సౌత్ గ్లోబ్) ‘వాతావరణ మార్పు’ దుష్పరిణామాల్ని ఎదుర్కొనే, తగ్గించుకునే, అవర్చుకునే… ఆర్థిక- సాంకేతిక వనరుల లేమితో సతమతమవుతోందని ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పు దుష్ప్రభావాల వల్ల ఎక్కువగా నష్టపోయేది వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలేనని ఐపిసిసి నివేదికలు కూడా చెబుతున్నాయి. రుతుక్రమం మారటం వల్ల అసాధారణ ఎండలు, వానలు, చలి తీవ్రతకు తోడు అతి, -అనావృష్టి వల్ల కరవులు-, వరదలు తలెత్తి ఆహారోత్పత్తి గణనీయంగా తగ్గే ప్రమాదన్ని కూడా ఈ నివేదికలు హెచ్చరించాయి.

కారకులే ఖర్చు భరించాలి

చైనా, ఆమెరికా, ఐరోపా సంఘం వంటి దేశాలు, సమాజాల కర్బన ఉద్గారాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. యేటా పెరుగుతున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం- కాల్చడంతో పాటు ఆయా దేశాల్లోని మానవ చర్యల వల్ల కార్బన్ డైయాక్సైడ్, ఇతర కర్బన ఉద్గారాలు (గ్రీన్‌హౌజ్ గ్యాసెస్) వాతావరణంలోకి విడుదలై భూగ్రహాన్ని వేడెక్కిస్తున్నాయి.ఫలితంగా వాతావరణ మార్పులు జరిగి, ధ్రువాల వద్ద మంచు కరిగి, సముద్ర మట్టాలు పెరిగి…. మరిన్ని ఉపద్రవాల పరిస్థితిని పెంచుతోంది. జీవవైవిధ్యానికీ పెనుప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే పలు జాతులు అంతరించిపోయాయి. మరెన్నో జంతు-వృక్ష జీవజాతులు అంతరించిపోయే ప్రమాదపు అంచుల్లో తచ్చాడుతున్నాయి.

చైనా, అమెరికా, భారత్, ఐరోపా సంఘం, రష్యా, బ్రెజిల్…. ఈ ఆరు కలిసి ప్రపంచ జనాభాలో 50.1 శాతానికి ఆశ్రయమిస్తున్నాయి. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 61.2 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రపంచంలో వినియోగంలో ఉన్న మొత్తం శిలాజ ఇంధనాల్లో 63.4 శాతం వాటాను ఇవి పొందుతున్నాయి. అదే సమయంలో, 61.6 శాతం కర్బన ఉద్గారాల (గ్రీన్‌హౌజ్ గ్యాసెస్) కు కారణమవుతున్నాయి.

ప్రఖ్యాత భారత న్యాయ కోవిధుడు, దివంగత జస్టిస్ కృష్ణఅయ్యర్, మన సుప్రీం కోర్టు వేదికగా ఒక చారిత్రక తీర్పు ఇస్తూ, కాలుష్య కారకులైన వారే పరిస్థితిని సరిదిద్దాలి, అందుకయ్యే ఖర్చు భరించాలి, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు. అటువంటి ప్రోటో కాల్స్ అంతర్జాతీయంగా కూడా ఉన్నాయి. తలసరి ఇంధన వినియోగం-ఉద్గారాల విడుదల లెక్కలు చూసినా, స్థూలంగా వారు వాతావరణంలోకి వెలువరిస్తున్న మొత్తం కర్బన ఉద్గారాల పరంగా చూసినా…. కొన్ని దేశాలే ప్రపంచ పర్యావరణానికి ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి. కారకులే దిద్దుబాటు చర్యల ఖర్చయినా, నష్టరిహారాలైనా భరించాల్సిందే! ఇదే సహజ న్యాయ సూత్రం!!

దిలీప్‌రెడ్డి

సమకాలీనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News