Tuesday, January 7, 2025

కాలుష్య నియంత్రణపై విధిగా ఉద్యమించాలి: కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌: జీవమున్న ఏకైక గ్రహమైన భూమిని భవిష్యత్ తరాల మనుగడుకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మానవులకు ప్రాణాధారమైన గాలి, నీరు, నేల రోజు రోజుకీ విషతుల్యమై, ప్రాణాలను హరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణ దిశగా ప్రభుత్వానికి సహకరిస్తూ, విధిగా ఉద్యమించాల్సిన అత్యయిక పరిస్థితి నెలకొన్నదని మంత్రి సురేఖ తెలిపారు.

డిసెంబర్ 2 జాతీయ కాలుష్య నియంత్రణ దినం సందర్భంగా మంత్రి కొండా సురేఖ కాలుష్య నియంత్రణపై తన భావాలను పంచుకున్నారు. భారతదేశంలో 1984 డిసెంబర్ 2న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్ క్బాడ్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఘోరమైన పారిశ్రామిక విపత్తుగా నిలిచిందని మంత్రి అన్నారు. ఈ దుర్ఘటనలో విడుదలైన ప్రమాదకరమైన మిథైల్ ఐసోసైనేట్ అనే విష రసాయనంతో కూడిన గాలిని పీల్చి వేల మంది మరణించగా, దాదాపు ఆరు లక్షల మంది ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం నాడు దేశాన్ని కంపింపచేసిందని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ ప్రతీ ఏడాది డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమల కాలుష్యాన్ని నివారించడంతో పాటు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడేలా ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ రోజున జాతీయ కాలుష్య నియంత్రణ దినాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ యేడు స్వచ్ఛమైన గాలి, పచ్చని భూమి – సుస్థిరమైన జీవనం వైపు అడుగు అనే నేపథ్యంతో ప్రజలకు కాలుష్య నియంత్రణ పై అవగాహన కల్పిచే దిశగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య నియంత్రణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పెరుగుతున్న వాయు కాలుష్యంపై అవగాహన కల్పించడం, పారిశ్రామిక విపత్తులను నిర్వహణ, నియంత్రణ పై కార్యక్రమాలు చేపట్టడం, మానవ నిర్లక్ష్యం వల్ల రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యంతో సంభవిస్తున్న దుష్పరిణామాలు, కాలుష్య నియంత్రణకై ఆచరించాల్సిన కార్యాచరణను ప్రచార చేయడం, పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి సురేఖ వివరించారు.

ప్రతి ఏటా మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం కారణంగా సంభవిస్తున్న లక్షలాది మరణాలు కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతూ పోతుందో తెలియజేస్తున్నదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాలుష్య నియంత్రణ దినం స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పర్యావరణ అనుకూల వస్తువులను వాడటంతో పాటు, మొక్కలను నాటుతూ, పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాచరణకు తోడుగా ప్రజలు ఉద్యమిస్తేనే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News