ఆందోళనకర స్థాయిలో వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: దీపావళి టపాసులకు తోడు పంట వ్యర్థాలు తగులబెట్టిన ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం దట్టమైన కాలుష్య వాయువు అలుముకుని ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శుక్రవారం వాయు నాణ్యత 36కు చేరుకుని అక్కడి వాతావరణం ఆందోళనకర పరిస్థితికి చేరుకుంది. అనేక చోట్ల ప్రజలు గొంతు నొప్పి, కళ్ల మంటలను ఎదుర్కొంటున్నారు. దీపావళి పండుగకు ముందే ఢిల్లీ ప్రభుత్వం బాణసంచాపై వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు నిషేధం విధించింది. బాణసంచా అమ్మకాలు, వినియోగానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రజలు మాత్రం నిషేధాన్ని పలుచోట్ల ఉల్లంఘించడంతో సమస్య ఏర్పడింది.
గురువారం రాత్రికి ఢిల్లీకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఎక్యుఐ) ఆందోళనకర పరిస్థితికి చేరుకోగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అది 463కు చేరుకుంది. ఢిల్లీకి పొరుగున ఉన్న ఫరీదాబాద్(464), గ్రేటర్ నోయిడా(441), ఘజియాబాద్(461), గురుగ్రామ్(470), నోయిడా(471)లో కూడా వాయు ప్రమాణం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ఎక్యుఐ ప్రకారం 0-50 మధ్య ఉంటే ఉత్తమమైనది. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరంగా, 101-200 మధ్య ఉంటే మోస్తరుగా, 201-300 మధ్య ఉంటే నాసి రకంగా, 300-301 అత్యంత నాసి రకంగా, 401-500 మధ్య ఉంటే ఆందోళనకరంగా పరిగణిస్తారు.