Thursday, April 24, 2025

ప్రజారోగ్యంపై కాలుష్యం కాటు

- Advertisement -
- Advertisement -

‘లాన్సెట్’ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన అధ్యయనంలో ‘కాలుష్యం’ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి తక్షణ గండంగా మారిందని వెల్లడించింది. కాలుష్యం వల్ల 2019లో 9 మిలియన్లమంది చనిపోవడానికి కారణమైందని ఈ నివేదిక పేర్కొంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరి మరణానికి కారణమని చెప్పవచ్చు. గాలికాలుష్యం అత్యంత ప్రాణాంతక రూపంగా 6.7 మిలియన్ల మరణాలకు కారణమైంది. ఆ తరువాత నీటికాలుష్యం కూడా విషపూరిత రసాయనాల వల్ల కలిగే ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. ఈ కాలుష్యంతో మృతిచెందిన వారిలో అధిక శాతం మధ్య-తక్కువ ఆదాయ దేశాల్లో ఉన్నారు. భారతదేశం, దక్షిణా ఆసియాలో ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా సంభవించే మరణాలలో ముఖ్యంగా 2.4 మిలియన్ల వరకు భారతదేశంలోనే చోటుచేసుకున్నాయి. గృహ గాలి కాలుష్యం, తాగడానికి అనుకూలంగా లేని నీటికొరత, తగిన శుభ్రతాలోపం ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి. దేశరాజధాని ఢిల్లీ ప్రపంచం లో అత్యంత కాలుష్యగ్రస్త నగరాల్లో ఒకటిగా నిలిచింది. 2022లో ‘ఐక్యూఎఐర్’ నివేదిక ప్రకారం 100 అత్యంత కాలుష్యగ్రస్త నగరాల్లో 63 నగరాలు భారతదేశంలోనే ఉన్నా యి. భారతదేశంలో ‘యునిసెఫ్’, ‘ప్యూర్ ఎర్త్’ నివేదిక ప్రకారం 275 మిలియన్లకు పైగా చిన్నారులు రక్తంలో అధిక లీడ్‌స్థాయిలకు గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. కాలుష్యం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతోంది. లాన్సెట్ నివేదిక ప్రకారం, పపంచవ్యాప్తంగా కాలుష్యం- సంబంధిత వ్యాధుల వల్ల 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం సంభవిస్తోంది. ఇది ప్రపంచ జిడిపి 6.2 శాతం. భారతదేశం కేవలం గాలి కాలుష్యంవల్లే సంవత్సరానికి 150 బిలియన్ డాలర్లకుపైగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నదని ‘అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి సంస్థ’ నివేదిక పేర్కొంది.

మన దేశం కాలుష్యాన్ని తగ్గించేందుకు కొన్ని చర్యలను ప్రారంభించింది. ‘నేషనల్ క్లీన్‌ఎయిర్ ప్రోగ్రామ్’ ద్వారా 2024 నాటికి పార్టిక్యులేట్ మ్యాటర్ సాంద్రతలను 20-30 శాతం వరకు తగ్గించే లక్ష్యంతో చర్యలు చేపట్టారు. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ శానిటేషన్ కవరేజీలో కొంతమేరకు ప్రగతిని సాధించగలిగింది. అయినప్పటికీ ఇప్పటికీ బొగ్గుఆధారిత విద్యుత్ కేంద్రాలు భారత గాలి కాలుష్యంలో 60% పైగా వాటాను కలిగి ఉన్నందున దీని ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంది. ప్రత్యేకించి పంజాబ్, హర్యానా వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల్లో వ్యర్ధాలు కాలుష్యాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. పట్టణాలు, మహానగరాల్లో గాలి కాలుష్యానికి 40 శాతం కారణం అయిన ట్రాన్స్‌పోర్ట్ రంగం కూడా సమర్థవంతమైన సంస్కరణలను అవసరపడుతోంది. కాలుష్యాన్ని తగ్గించడానికి సమన్వయ పూర్వక చర్యలు అవసరం.

శక్తివంతమైన పర్యావరణ నియంత్రణ, శుభ్రమైన శక్తిమార్పిడి, అలాగే నిలకడైన మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు అత్యవసరం. బొగ్గును తగ్గించడంలో, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులను విస్తరించడం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భారత్ కీలకమైన చర్యలను తీసుకోవాలి. అదనంగా కాలుష్య ప్రభావంపై ప్రజలలో అవగాహన పెంచడం మరీ అవసరం . కాలుష్యం అనేది ఒక్క పర్యావరణ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రజారోగ్యాన్ని, అలాగే ఆర్థిక సంక్షోభానికి మూలం కూడా. దీని ప్రభావం తీవ్రతను అధిగమించాలంటే తక్షణ చర్య అవసరం. భారతదేశానికి ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని పరిష్కరించగల అవకాశాలు కూడా ఉన్నాయి. సమష్టి ప్రయత్నాలతో భారతదేశం కాలుష్యాన్ని తగ్గించడంలోనూ ప్రజలకోసం ఒక శుభ్రమైన, ఆహ్లాదకమైన భవిష్యత్తును నిర్ధారించడంలో ఆదర్శంగా నిలువగలదు.

కోలాహలం రామ్ కిశోర్, 9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News