రాష్ట్రంలో అన్‌లాక్ ప్రారంభమైన తర్వాత మొదటి సెట్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా, అగ్రికల్చర్, హార్టికల్చర్ డిప్లొమా, బాసర ఆర్‌జియుకెటిలో ప్రవేశాలకు శనివారం(జులై 17) పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమై అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత శనివారం మొదటి ప్రవేశ పరీక్ష జరుగనుంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 411 పరీక్షా కేంద్రాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పాలిసెట్ కన్వీనర్ సి.శ్రీనాథ్ తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించమని స్పష్టం చేశారు. ఎస్‌బిటిఇటి యాప్‌లో విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయగానే పరీక్షా కేంద్రానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ వస్తుందని వివరించారు. పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,02,496 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో ఎంపిసికి 29,552 మంది బాలురు, 25,346 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఎంబైపిసికి 19,064 మంది బాలురు, 15,534 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు.