నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉన్నట్లు కెటిఆర్, హరీష్‌రావులు నిరూపించాలి
ఇంట్లో ఒక్క ఇటుక కూడా బఫర్ జోన్‌లో ఉంటే హైడ్రా కమిషనర్ కూల్చేయాలి
బిఆర్‌ఎస్ నేతలు నా సవాల్‌ను స్వీకరించాలి
సామాన్యుల కోసమే హైడ్రా ఏర్పాటు
రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులు
అదనపు మొత్తం చెల్లిస్తే వారికి కూడా రుణమాఫీ వర్తింపచేస్తాం
ఇకపై ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్ పరిధిలో నిర్మాణాలను అనుమతించేది లేదు
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉన్నట్లు కెటిఆర్, హరీష్‌రావులు నిరూపించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు. తన ఇంట్లో ఒక్క ఇటుక కూడా బఫర్ జోన్‌లో ఉన్నట్టుయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూలగొట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. హైడ్రా అధికారుల బదులు మీరే వెళ్లి తన ఇంటిని కొలవాలని, అది అక్రమమని తేలితే కూల్చేయాలని మంత్రి బిఆర్‌ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. సామాన్యుల కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు.
రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులు అదనపు మొత్తం చెల్లిస్తే వారికి కూడా రూ.2 లక్షలు రుణ మాఫీ ప్రభుత్వం చేస్తుందని పొంగులేటి వెల్లడించారు. దీనికి కూడా ఒక కటాఫ్ తేదీన పెట్టి ఆ లోపు చెల్లించిన వారికి రుణమాఫీని పూర్తి చేస్తామని ఆయన వివరించారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసేందుకు ఇంకా రూ.12 వేల కోట్లు అయినా, రూ.13వేల కోట్లు అయినా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. గాంధీభవన్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించేందుకు హైడ్రాను తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. హిమాయత్ సాగర్ ప్రాంతంలో ఎఫ్‌టిఎల్ పరిధిలో తన ఫాంహౌస్ ఉందని బిఆర్‌ఎస్ పార్టీ మీడియా బురదజల్లుతోందన్నారు.
అవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన కట్టడాలే..
ఇకపై ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను అనుమతించేది లేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అలాంటి కట్టడాలను కూల్చుతున్నామని, అవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన కట్టడాలని పొంగులేటి తెలిపారు. బిఆర్‌ఎస్ నాయకులతో తాను చెప్పించుకునే పరిస్థితుల్లో ఈ పొంగులేటి లేడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో చేసేందుకు తనను బూచిగా చూపాలని చూస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. బిఆర్‌ఎస్ నేతలు తన సవాల్‌ను స్వీకరించాలని మంత్రి స్పష్టం చేశారు. అక్కడ తానే నివసిస్తున్నానని, బిఆర్‌ఎస్ నేతల మాదిరి ఫాంహౌస్ నాది కాదని, స్నేహితులదంటూ తప్పించుకోనని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఆనాడు రేవంత్ రెడ్డి ఫాంహౌస్ పై డ్రోన్ తిప్పితే కెటిఆర్ కేసు పెట్టారని, ఇప్పుడు అది తనది కాదని కెటిఆర్ అంటున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు.
అప్పులున్నా ఆరు గ్యారంటీల అమలు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని మంత్రి తెలిపారు మొత్తం మూడు దశల్లో రుణమాఫీని తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. సాంకేతిక కారణాలతో ఇంకా రూ.12వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ధనిక తెలంగాణ అని చెప్పి కెసిఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మంత్రి ఫైర్ అయ్యారు.
తెలంగాణలో తాము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర అప్పు రూ.7.19 లక్షల కోట్లు ఉందని ఆయన వెల్లడించారు. రూ.7 లక్షల కోట్ల అప్పులున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు హామీలు అమలు చేస్తున్నామన్నారు. రైతు రుణమాఫీ కోసం గత ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్మేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20 వేల కోట్లు రావాల్సిన ఓఆర్‌ఆర్‌ను బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.7 వేల కోట్లకు తాకట్టు పెట్టి ఎన్నికల సమయంలో రైతుల మీద ప్రేమ ఉన్నట్లుగా రుణమాఫీకి ఆ డబ్బును బదలాయించిందని మంత్రి ఆరోపించారు. రుణమాఫీపై బిఆర్‌ఎస్ నేతల్లాగా తమకు అబద్ధాలు చెప్పడం రాదని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని ఆయన గుర్తు చేశారు.
26 రోజులు… రూ.18 వేల కోట్లు ఖర్చు…
కేవలం 26 రోజుల్లో రూ.18 వేల కోట్లతో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా రూ. 12 వేల 300 ల కోట్లు రుణమాఫీ కింద ఖర్చు చేయాల్సి ఉందని, ఆ మొత్తం బ్యాంకుల్లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతలుగా రైతులకు వారి ఖాతాలో వేసిందని మంత్రి గుర్తు చేశారు. రూ. 2 లక్షలకు పైబడి రుణం ఉన్న వారికి ప్రభుత్వం రూ.2 లక్షలు చెల్లిస్తుందని, మిగతా మొత్తం రైతులు చెల్లించుకోవాలన్నారు. దీనిని త్వరలోనే అమలు చేస్తామన్నారు. రూ. రెండు లక్షలకు పైగా ఉండే అమౌంట్ పెద్ద మొత్తంలో ఉంటే దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెడుతామని మంత్రి తెలిపారు. ఆ కట్టే డబ్బు లక్షల్లో ఉంటే రైతులు ఇప్పటికిప్పుడు కట్టలేరని, అందుకే కొంత సమయం ఇచ్చేలా కట్ ఆఫ్ తేదీ పెడతామని పొంగులేటి వివరించారు.
మూడురోజుల పాటు కొత్త చట్టంపై సదస్సులు
ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లలో సమావేశాలు పెట్టి కొత్త రెవెన్యూ చట్టంపై సదస్సులు నిర్వహించి ప్రజలు, మేథావుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని మంత్రి అన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రేషన్ కార్డులను రెండు సెక్టార్‌లుగా విభజిస్తామని, ఒకటి రేషన్ కార్డు, రెండోది హెల్త్ కార్డు అని, అవి కూడా త్వరలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
తమ కేబినెట్‌కు స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది
రుణమాఫీ విషయంలో మంత్రులకే సమన్నయం లేదని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. తమ కేబినెట్‌కు ఎంత స్వేచ్ఛాయుత వాతావరణం, ఏ రకమైన అధికారాలు ఉన్నాయో తమకు తెలుసన్నారు. ఈ సూచన ఇచ్చినందుకు థాంక్స్ అంటూ బిఆర్‌ఎస్ నాయకులకు ఆయన సెటైర్ వేశారు. నిజమే తమ కేబినెట్‌కు మీకు మాదిరిగా అబద్ధాలు చెప్పుకోవడం, గోబెల్స్ ప్రచారం చేసుకోవడం రాదని మంత్రి పొంగులేటి అన్నారు. చేసిన మంచి పనిని కూడా తాము ప్రచారం చేసుకోవడం లేదని, గత ప్రభుత్వం వల్లే ప్రభుత్వ సొమ్ముతో వేలాది కోట్ల రూపాయల పబ్లిసిటీకి ఉపయోగించుకోవడం లేదని, భవిష్యత్‌లోనూ వాడుకోబోమని ఆయన అన్నారు. తాము మాటలు చెప్పమని, చేతనైతే చేస్తామని, చేయని పక్షంలో అంతే ధైర్యంగా చేయలేకపోతున్నామని చెబుతామని మంత్రి తెలిపారు.
మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు విషయంలో నిబంధనల ప్రకారం..
గత ప్రభుత్వంలో జర్నలిస్టుల మీద చాలా కేసులు పెట్టారని, ఇప్పటి వరకు తాము ఎవరిపై కేసులు పెట్టలేదని మంత్రి పొంగులేటి తెలిపారు. గురువారం ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎవరైనా అధికారులు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తన ఇంటి ముందు ఒక యూట్యూబ్ చానల్ మిత్రుడు వెళ్లి వీడియో చేశారని, అయినా తాము ఆయన మీద కేసు పెట్టలేదని మంత్రి తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు కుటుంబ సభ్యులకు చెందిన బిల్డింగ్‌ను సైతం హైడ్రా అధికారులు కూల్చేశారని పళ్లంరాజు మా పార్టీ అయినా తాము నిబంధనల ప్రకారం నడుచుకున్నామని ఆయన తెలిపారు. కెటిఆర్ ఆ ఫాంహౌస్‌ను తన ఫ్రెండ్ దగ్గర లీజు తీసుకున్నానని చెబుతున్నారని, ఆ లీజుకు ఎంత చెల్లిస్తున్నారో చెబితే తాము కూడా లీజుకు తీసుకుంటామని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని ఆయన తెలిపారు.
త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అప్పగిస్తాం
త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అప్పగిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. జవహల్ లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి సంబంధించి సుమారు వెయ్యికి పైగా సీనియర్ జర్నలిస్టులకు 72 ఎకరాల్లోని ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాల పంపిణీని కార్యక్రమాన్ని సిఎం చేతుల మీదుగా నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.