Friday, November 15, 2024

కాంగ్రెస్ లోకి పొంగులేటి..!

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో చేరికల పర్వం మొదలైంది. మాజీ ఎంపీ పొంగులేటి ఎంట్రీ తో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయం ఆషామాషీగా జరగలేదు. సుదీర్ఘ కసరత్తు..పక్కా వ్యూహంతో డిసైడ్ అయింది. పొంగులేటి తన సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేత. పొంగులేటి చేరిక పార్టీకి ఖచ్చితంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు పొంగులేటి కాంగ్రెస్ లో చేరటం వలన తమకు జరిగే నష్టం పై బీఆర్ఎస్ లోనూ చర్చకు దారి తీస్తోంది.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణతో పాటుగా ఢిల్లీ స్థాయిలోనూ మంచి పలుకుబడి ఉన్న నేత. 2014లో ఖమ్మం ఎంపీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలోనూ పొంగులేటికి అనుచర వర్గం ఉంది. వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి ఆ తరువాత టీఆర్ఎస్ కు దగ్గరయ్యారు, ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ కోసం పని చేసారు. 2018 ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించినా ముఖ్యమంత్రి హామీతో సీటు దక్కక పోయినా పార్టీ అభ్యర్ధి గెలుపుకు సహకరించారు. అప్పటి నుంచి పార్టీ కోసం పని చేస్తూ..వ్యయ ప్రయాసలను తట్టుకొని నిలబడ్డారు. యూజ్ అండ్ త్రో పాలసీ అమలు చేసే బీఆర్ఎస్ నేతల వైఖరితో మనస్థాపానికి గురైన పొంగులేటి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ వైపు అడుగులు వేసారు.

పొంగులేటిని చేర్చుకోవటానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ నేతలు రంగంలోకి దిగారు. కోరిన సీట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పార్టీలో పదవుల పై హామీలు గుప్పించారు. కానీ, క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో ఉన్న మూడ్ గుర్తించిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ను మట్టు బెట్టాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని తేల్చారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. ఖమ్మం జిల్లాలో సీట్ల గురించి మద్దతు దారుల నుంచి హామీ పొందాలనే ఒత్తిడి ఉన్నా..అవసరమైతే నాలుగు అడుగులు వెనక్కు తగ్గుదామని పొంగులేటి చెబుతున్నారు. అందరి లక్ష్యం బీఆర్ఎస్ ను ఓడించటమేనని తేల్చి చెప్పారు. ఆ దిశగా కాంగ్రెస్ లో ఏ బాధ్యతలు అప్పగించినా…పని చేసేందుకు సిద్ధమని పొంగులేటి స్పష్టం చేసారు.

తాజాగా సీఎల్పీ నేత మల్లు భట్టిని పొంగులేటి కలిసారు. మండుటెండల్లో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండ వంద రోజుల పాదయాత్ర చేయటం పైన అభినందించారు. పార్టీలో చేరిక అంశంతో పాటుగా ఖమ్మం జిల్లాలో రాహుల్ సభ పైన చర్చించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతల కలయికతో వచ్చే ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లు క్లీన్ స్వీప్ చేయటం ఖాయమనే అంచనాలు కనిపిస్తున్నాయి.

ఇక పొంగులేటి కాంగ్రెస్ లో చేరిక ద్వారా తమ పైన పడే ప్రభావం పైన బీఆర్ఎస్ ఆరా తీస్తోంది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం పోలరైజ్ అయ్యే అవకాశం ఉందనే నివేదిక లు ఇప్పుడు బీఆర్ఎస్ కు గుబులు పెంచుతున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉంది. ఆ జిల్లాల్లోని ఆ వర్గానికి చెందిన నేతలతో పొంగులేటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్దికంగానూ.. రాజకీయ వ్యూహాల్లోనూ పొంగులేటికి పట్టు ఉంది. బీఆర్ఎస్ ను ఓడించటం..తనను అవమానించిన వారిని రాజకీయంగా కనుమరుగు అయ్యేలా చేయటం తన లక్ష్యమని ప్రకటించిన పొంగులేటి రాక ఇప్పుడు కాంగ్రెస్ కు అదనపు బలంగా మారనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News