Sunday, January 19, 2025

ముందస్తు చర్యల వల్ల 3 వేల మందిని రక్షించాం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
రాష్ట్ర వ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలు
వరద ప్రాంతాలల్లో ఆహారం, త్రాగునీరుకు ఎలాంటి లోటు రావద్దు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: కష్ట కాలంలో ఉన్న ప్రజలను కాపాడుకునేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితులను మంగళవారం ఆయా జిల్లా కలెక్టర్‌లతో ఆయన టెలిఫోన్ లో సమీక్షించారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలయపాలెం మండలాల్లో పర్యటించారు.

గంట గంటకు హైదరాబాద్‌లోని విపత్తుల నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడుతూ వారిని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేశారు. వరద ప్రభావిత ప్రాంతాలల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విపత్తుల నిర్వహణ విభాగంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు వస్తున్న ఫిర్యాదులు, తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని పూర్తి వివరాలను జిల్లాల నుంచి తెప్పించుకోవాలని ఆయన సూచించారు.

117 గ్రామాల్లో 67 వేల మంది
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 117 గ్రామాల్లో 67 వేల మంది భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితమయ్యారని, ఇందులో ఒక ఖమ్మం జిల్లాలోనే 49 వేల మంది ఉన్నారని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 10,538 మందిని తరలించినట్టు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల 3,039 మందిని రక్షించుకోగలిగామని ఆయన తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటి వరకు 44 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారికి కొత్తగా మంజూరుచేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు వెంటనే మరమ్మతులను చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. 51 బ్రిడ్జిలు, 249 కల్వర్ట్, 166 ట్యాంక్‌లు దెబ్బతిన్నాయని, 13,342 జీవాలు మృతి చెందాయని ఆయన తెలిపారు.

ఆహారం, త్రాగునీరుకు ఏలోటు రాకుండా
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, త్రాగునీరుకు ఏలోటు రాకుండా అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వరద భాదితులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు కల్పించకుండా సమయానికి ఆహారాన్ని అందించాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అసలైన సవాలు ఇప్పుడు ఎదురవుతుందని మానవీయ కోణంలో సహాయ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, పసిపిల్లలు, దివ్యాంగుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. మరికొన్ని రోజులు ఇదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని, నష్ట పోయిన వారిని ఆదుకుంటూ కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మళ్లీ సాధారణ జీవితం గడిపేలా చరవేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వర్షాలు తగ్గడంతో వరదలు తగ్గుముఖం పట్టి బురదమయమైన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News