చినుకు పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నాం
ముందస్తు చర్యల వల్ల వీలైనంత ప్రాణ నష్టం తగ్గించగలిగాం
గత ప్రభుత్వం పదేళ్లలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం చేసింది
బిఆర్‌ఎస్ నాయకులకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ మాదిరిగా విదేశీ కుట్ర అంటూ ఫాంహౌస్‌లో కూర్చోలేదని, చినుకు పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నామని, మా ముందస్తు చర్యల వల్ల వీలైనంత ప్రాణ నష్టం తగ్గించగలిగామని, గత ప్రభుత్వం పదేళ్లలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బిఆర్‌ఎస్ నాయకులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజల రక్షణే తమకు ముఖ్యమన్నారు. వరదలపై మంగళవారం ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను బుధవారం మంత్రి పొంగులేటి తప్పుబట్టారు. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన భారీ వర్షాలు, వరదలు నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచడానికి వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి క్లౌడ్-బరస్ట్, విదేశీ కుట్ర అంటూ మతిలేని ప్రకటనలు చేసిన బిఆర్‌ఎస్ నాయకులకు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆ ప్రకటనలో ప్రశ్నించారు. విదేశీ కుట్ర అని ఫాంహౌస్ దాటని బిఆర్‌ఎస్ పార్టీ పెద్దలు ఈరోజు వరదల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆనాడు ప్రకృతిపరంగా కురిసిన వర్షాలను కూడా కుట్రకోణంలో చూసిన ఆ పెద్దమనిషి, ఆయన అల్లుడు హరీష్ రావు కూడా ఇప్పుడు వచ్చిన వర్షాలను కుట్ర కోణంలోనే చూస్తున్నారా అని మంత్రి వ్యాఖ్యానించారు.
కెటిఆర్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు..
వరదల్లో కారు కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు నునావత్ అశ్విని కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేబినెట్ సహచర మంత్రులందరం పరామర్శించి, భరోసా కల్పించామన్నారు. కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలన్న సోయి కూడా బిఆర్‌ఎస్ పెద్దలకు లేకపోవడం దురదృష్టకరమని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. జైలు నుంచి వచ్చిన బిడ్డను ఆశీర్వదించడానికి ప్రతిపక్ష నేత కెసిఆర్‌కు సమయం ఉంటుందని, కానీ, వరద కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి గడప దాటడం లేదని మంత్రి పొంగులేటి దుయ్యబట్టారు. పదేండ్ల పాలన అనుభవంతో ప్రతిపక్ష నేత కెసిఆర్ ఒక సలహానైనా, సూచననైనా చేస్తారని భావించామని, కానీ, ఆయన పెదవి కూడా విప్పకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇంకా ఆయన కుమారుడు కెటిఆర్ అమెరికాలో ఉండి, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా, అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నారు. ఆయన ఎందుకు అమెరికా వదిలి రావడం లేదు ? అధికార పార్టీని తిట్టడమే ప్రతిపక్ష పార్టీ పని అన్నట్టుగా తమ మీద దాడి చేస్తున్నారని ఆయన అన్నారు.
డిప్యూటీ సిఎం, ఇద్దరు మంత్రులం అప్రమత్తంగా ఉండడంతో
ఓటు వేసిన వేలుకు సిరా చుక్క కూడా తొలగిపోయిందో లేదో అప్పటినుంచే తమ ప్రభుత్వం దాడి మొదలుపెట్టారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. పది సంవత్సరాల్లో విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఒక్క నాడైనా ప్రకృతి విపత్తుల మీద సమావేశం నిర్వహించారా ? దానిని బలోపేతం చేయాలన్న ఆలోచన చేశారా ? దానిని బలోపేతం చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? కొంతలో కొంతైనా ముప్పు తగ్గేది కదా, రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా ఆకాశం నుంచి నీళ్లు గుమ్మరించినట్టుగా, తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో ఊహించని నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలు, వర్షం అనంతరం ప్రజలను రక్షించడంలో, వారికి కావాల్సిన వసతులు కల్పించి ఆదుకోవడంలో చూపిన చొరవ, అందించిన సహాయ, సహకారాల కారణంగా అపారనష్టాన్ని తగ్గించగాలిగామన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి తనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అందరం కలిసి సమన్వయంతో పని చేయడం వల్లే ప్రాణ నష్టాన్ని, కనిష్ట స్థాయికి తగ్గించగలిగామని మంత్రి పొంగులేటి తెలిపారు.
బురద రాయకీయాలను మేము పట్టించుకోవడం లేదు
ప్రజలను ఆదుకోవడానికి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, కోడి పిల్లలను కాపాడినట్టు జిల్లా ప్రజలను రక్షిస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఖమ్మం జిల్లాలో పర్యటించి, పరిస్థితిని పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు అక్కడే రాత్రిపూట బసచేసి మరీ ప్రజలను ఆదుకున్నామన్నారు. గతంలో ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే పదివేలు చొప్పున సహాయం చేస్తామని చెప్పి చేతులెత్తేసిన వారు ఇప్పుడు యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఇంకా ప్రజలు మరచిపోలేదని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ బురద రాయకీయాలను తాము పట్టించుకోవడం లేదని, తమకు ప్రజలు ముఖ్యమని, వారి రక్షణ ముఖ్యమని, రాష్ట్రంలో చివరి బాధితుడికి కూడా ప్రభుత్వ సాయం అందేటట్టు చూడటమే తమధ్యేయమని మంత్రి పొంగులేటి అన్నారు.