తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం 2025 సామాన్య రైతులకు న్యాయం జరిగేవిధంగా ఉంటుందని, రైతుల కళ్లలో ఆనందం చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి కార్యక్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూ భారతి రెవన్యూ సదస్సుకు రాష్ట్ర రెవన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ద ప్రకాష్ లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై భూ భారతి రెవెన్యూ సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ దేశానికి వెన్నముక రైతు అని, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుల సమస్యలు తీర్చుతామంటూ 2020 సంవత్సరంలో ధరణి పోర్టల్ తీసుకువచ్చి గులాబీ నాయకులు ఇష్టా రీతిని వారి పేర్లపై వందల ఎకరాలు పట్టాలు చేయించుకుని, చట్టాన్ని చుట్టంగా మలుచుకుని రైతు బంధు పొందారు తప్పా సామన్య పేదరైతుకు న్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడగానే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపి సామాన్య రైతుకు శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా భూ భారతి చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చిన మేరకు భూ భారతి చట్టం 2025 తీసుకువచ్చామని పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సాదా బైనామాద్వారా రైతులు పెట్టుకున్న దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 24 వేలు ఆన్‌లైన్ లో ఉన్నాయని, అన్నింటికీ భూ భారతిలో అవకాశం కల్పించి రైతులకు న్యాయం జరిగేవిధంగా కృషి చేస్తామన్నారు. పేదల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రైతులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా భూ భారతి చట్టం రూపొందించి, చట్టం చేసిన 90 రోజుల్లోనే విధి, విధానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భూ భారతి పోర్టల్‌లో రైతు సమస్యలపై దరఖాస్తు చేస్తే ముందుగా తహశీల్దార్ పరిధిలో ఉంటుందని, తహశీల్దార్ చేయకపోతే ఆర్డిఓ, అదనపు కలెక్టర్ సరిచేయాలని, కలెక్టర్ చొరవ తీసుకుని పరిష్కారం చూపాలని చూపినట్లయితే ఉమ్మడి జిల్లాకు ఒక సిసిఎల్‌ఏ, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్లు అందులో సమస్యలకు పరిష్కారం అయ్యే విధంగా ఉంటుందని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే హైదరాబాద్‌లోని రెవెన్యూ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. రైతుల సమస్యలు తీర్చడానికి భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగిందని, చట్టాన్ని అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అధికారులు నిబద్ధతలో పనిచేయాలని, గ్రామాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి స్వయంగా కలెక్టర్లు వెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.
గత బిఆర్‌ఎస్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చెప్పిన మాట వినలేదని విఆర్వో, విఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి, 23 వేల మంది ఉద్యోగులను రోడ్డు పాలు చేసారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఒక అధికారి ఉండాలనే ఉద్ద్ధేశంతో తిరిగి గ్రామపాలనాధికారుల వ్యవస్థ తీసుకురావడం జరిగిందన్నారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల సమస్యలు పరిష్కంచేందుకు కృషి చేస్తారన్నారు. పేదవారికి, సామాన్య రైతులకు ఉపయోగపడే విధంగా భూ భారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.