Monday, March 31, 2025

ఇందిరమ్మ ఇళ్ల వేగం పెరగాలి

- Advertisement -
- Advertisement -

బేస్‌మెంట్ పూర్తయిన ఇళ్లకు
తక్షణమే చెల్లింపులు చేయాలి
ఇళ్ల స్థలాలు లేని వారికి డబుల్
బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి
ఏ గ్రామంలోనూ తాగునీటి
సమస్య రానీయొద్దు
జూన్ చివరినాటికి వరంగల్
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
పనులు పూర్తికావాలి
మడికొండ డంపింగ్ యార్డుకు
శాశ్వత పరిష్కారం చూపాలి
రెవెన్యూ, హౌసింగ్, సమాచార
పౌరసంబంధాల శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ను వేగవంతం చేయాలని, బేస్‌మెంట్ పూర్తయిన ఇళ్లకు తక్షణమే చెల్లింపులు చేయాలని, ఏ గ్రామంలోనూ త్రాగునీటి సమస్య రానీయొద్దని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్‌లకు సూచించారు. జూన్ చివరినాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తికావాలని, మడికొండ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. శుక్రవారం సచివాలయంలో వరంగల్ స్మార్ట్ సిటీ పనులు , వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, త్రాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులు,

కలెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని దీనిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు పనిచేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లింపులు చేస్తుందని, మొదటి విడతలో బేస్ మెంట్ లెవెల్ పూర్తయిన ఇళ్లకు లక్ష రూపాయిలు ఇస్తుందని, బేస్‌మెంట్ పూర్తయిన ఇళ్ల వివరాలను హౌసింగ్ విభాగానికి పంపిస్తే తక్షణమే చెల్లింపులు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఇళ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించని 2 బిహెచ్‌కే ఇళ్లను కేటాయించాలని అలాగే మొండి గోడలతో ఉన్న ఇళ్లను పూర్తిచేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే ఆ ఇళ్లను పూర్తిచేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించాలని మంత్రి పొంగులేటి సూచించారు.

బోర్లు, హ్యాండ్‌పంప్‌లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి
వేసవి కాలంలో ఏ గ్రామంలో, పట్టణంలో త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి కలెక్టర్‌లకు సూచించారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్లు ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని అధికారులు వారంలో మూడు రోజులు గ్రామాల్లో పర్యటించాలని మంత్రి సూచించారు. వచ్చే మూడు నెలలు చాలా కీలకమని ప్రజలకు ఎక్కగా త్రాగునీటి గురించి ఇబ్బంది కలగకుండా నీళ్లు రావడం లేదన్న విమర్శ రాకుండా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. నీటికొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయడం, చెడిపోయిన బోర్లు, హ్యాండ్‌పంప్‌లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మంత్రి పొంగులేటి సూచించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి ఆ తర్వాత మరో నెలరోజుల్లో వైద్య సేవలకు అవసరమైన పరికరాలను అమర్చి జూన్ చివరినాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

శాశ్వత డంపింగ్ యార్డు కోసం 150 నుంచి 200 ఎకరాల భూమిని సేకరించాలి
మడికొండ డంపింగ్ యార్డు సమస్యకు వారం రోజుల్లో తాత్కాలిక పరిష్కారం చూపించి ఆ తర్వాత శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. దీనికి సంబంధించి సిడిఎంఎ డైరెక్టర్ శ్రీదేవిని స్వయంగా అక్కడ పర్యటించి పరిష్కార మార్గాలను సూచించాలని ఆయన ఆదేశించారు. వరంగల్, కరీంనగర్ రహదారి ప్రాంతంలో శాశ్వత డంపింగ్ యార్డు కోసం 150 నుంచి 200 ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీత పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలన్నారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనుల విషయంలో అధికారులు ప్రణాళికా బద్ధంగా వ్యవహారించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు కడియం శ్రీహరి, నాయని రాజేందర్, యశస్విని రెడ్డి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, మురళీనాయక్, రామచంద్ర నాయక్, రేవూరి ప్రకాష్రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, ఆర్ అండ్ బి సెక్రటరీ హరిచందన, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News