డిఎంకె సీనియర్ నేత కె పొన్ముడి శుక్రవారం తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర వివాదాస్పద గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆయనతో ఇక్కడ రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ప్రమాణం చేయించారు. మంత్రిగా ఆయన కొనసాగింపు విషయంలో అభ్యంతరాలు వద్దని పేర్కొన్పప్పటికీ తమ రూలింగ్‌ను గవర్నర్ బేఖాతరు చేయడంపై ఒక్కరోజు క్రితమే సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ధర్మాసనం ఆదేశాలనే ధిక్కరిస్తారా? అని చురకలకు దిగింది. ఈ దశలో మరుసటి రోజే గవర్నర్ ఆయనతో మంత్రిగా ప్రమాణం చేయించారు. ఇప్పుడు ఆయన తిరిగి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మద్రాసు హైకోర్టు పొన్ముడిని దోషిగా తీర్పు వెలువరించింది. దీనితో గవర్నర్ రవి ఆయనపై బర్తరఫ్ వేటు వేశారు. ఇప్పుడు మూడు నెలల వ్యవధి తరువాత తిరిగి ఆయన మంత్రి అయ్యారు. ఇప్పుడు జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇతర మంత్రులు , ఎంఎ సుబ్రమణియన్ హాజరయ్యారు.
మంత్రి పదవి నుంచి పొన్ముడి తొలిగింపు వ్యవహారం సిఎం గవర్నర్ మధ్య తీవ్రస్థాయి చిచ్చుకు దారితీసింది. ఈ నెల 13న సిఎం గవర్నర్‌కు ఓ లేఖ రాశారు. ఇందులో పొన్ముడికి తాము తిరిగి పాత మంత్రిత్వశాఖను అప్పగిస్తున్నామని, ఆయనతో మంత్రిగా ప్రమాణం చేయించి, బాద్యతల స్వీకరణకు వీలు కల్పించాలని కోరారు. అయితే గవర్నర్ ఈ అభ్యర్థన లేఖను తోసిపుచ్చారు. పొన్ముడి దోషిత్వ నిర్థారణను కోర్టు తాత్కాలికంగా పక్కకు పెట్టిందని, కొట్టివేయలేదని గవర్నర్ తిరుగుటపా సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన దోషిత్వ విషయాన్ని తాము సస్పెండ్ చేసినప్పుడు, సిఎం సలహా మేరకు మంత్రిగా నియామకం జరగాల్సిందే, గవర్నర్ ఈ విషయంలో తప్పిదానికి పాల్పడినట్లు నిర్థారించుకుంటూ ఆయన ఈ విషయంలో 24 గంటలలో స్పందించాల్సి ఉంటుందని పేర్కొంది.