అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేసిందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. రైతుల పంటలు ఎండిపోతుంటే అసలు ఏమాత్రం పట్టింపులేనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజర్వాయర్లు అన్నీ నింపితే తొమ్మిది టీఎంసీల నీళ్లు ఉండేవని, కానీ ప్రభుత్వం అలాంటి పనులు చేయడం లేదన్నారు. ఏమైనా బీఆర్‌ఎస్‌పై బురదజల్లేడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా ఇంకా పరిపాలనపై కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ అవగాహన రావడం లేదన్నారు.
ఇచ్చిన గ్యారంటీలన్నీ అటకెక్కించారని తెలిపారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వడం లేదని, స్కూటీలు ఇవ్వడం లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని ఆరోపించారు. రైతు భరోసా కూడా సరిగా అమలు చేయడం లేదని, రైతు కూలీలకు ఇస్తామన్న రూ.12 వేల సంగతే మర్చిపోయారని విమర్శించారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుని అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించారన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు.