Thursday, December 26, 2024

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు: పొన్నాల లక్ష్మయ్య

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కెసిఆర్‌కు గోదావరి జలాలపై అవగాహన లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాధ్యత లేకుండా పారిపోయింది ఎవరో తెలియదా..? అని ప్రశ్నించారు. మంత్రుల మాటల్లో ఆవేశం, అవగాహన లోపం, అనుభవ రాహిత్యం మాత్రమే ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డితో కలిసి పొన్నాల లక్ష్మయ్య మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్ సొంత జిల్లాకు, సొంత ఊరికి వచ్చే ప్రాజెక్టు గురించి ఏనాడైనా మాట్లాడారా..? అని నిలదీశారు. సిఎం బిజీగా ఉన్నట్లున్నారు, రాత్రి క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లారు అని, మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య ఉంటే, అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి ఎందుకు ఎత్తిపోయలేదో సమాధానం చెప్పాలని అడిగారు.

అన్నారం, సుందిళ్లలోని నాలుగు టిఎంసిలు ఎత్తిపోయకుండా కిందకు ఎందుకు వదిలారు..? అని ప్రశ్నించారు. తప్పుడు సమాచారంతో నీచ రాజకీయాలకు పాల్పడిన వారు క్షమాపణ చెప్పాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఇంతటి నీటి ఇబ్బందులు ఉంటే బిఆర్‌ఎంబి సమావేశానికి ఇంజనీర్లు ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. కృష్ణా బోర్డును నీరు అడగలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజలను భ్రమల్లో పెట్టాలని 25 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లో చేరతారని అంటున్నారని, నీళ్లకు, ఎంఎల్‌ఎల చేరికలకు ఏం సంబంధమని అడిగారు. రైతులకు భరోసా ఇవ్వకపోగా కెసిఆర్, బిఆర్‌ఎస్‌ను ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారని బిఆర్‌ఎస్ నేత, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి అన్నారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి చేయని కాంగ్రెస్ పార్టీ… మళ్లీ ఇప్పుడు ప్రజలకు మోసం చేసేందుకు సిద్దమైందని విమర్శించారు. ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏనాడైనా తెలంగాణ అంశాల గురించి మాట్లాడారా..? అని ప్రశ్నించారు. పార్టీ మారితే అసెంబ్లీ సభ్యత్వం రద్దు కావాలి అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు అని, మరి తెలంగాణలో ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇక్కడి కాంగ్రెస్‌కు వర్తించదా..? అని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News