మన తెలంగాణ/హైదరాబాద్: పరువునష్టం కేసులో సూర్యాపేట అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మంగళవారం హాజరయ్యారు. స్కాలర్ షిప్ కుంభకోణంలో.. మంత్రి జగదీష్ పాత్ర ఉందని అప్పట్లో ఆయన ఆరోపించిన సంగతి విదితమే. దాంతో మంత్రి జగదీష్‌రెడ్డి పొన్నం ప్రభాకర్ మీద అప్పట్లో పరువు నష్టం కేసు వేశారు. కోర్టుకు హాజరయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పొన్నం మాట్లాడుతూ.. కష్టపడి కూడబెట్టిన ఆస్తులను బిజెపి అమ్ముతోందని ఆరోపించారు.
మతపరమైన అంశాలను లేవనెత్తి ఓట్లు దండుకునేందుకు బిజెపి యత్నిస్తోందని విమర్శించారు. దేశ సార్వభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసి.. విభజన రాజకీయాలకు బిజెపి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌ని అగౌరవపరిచే ప్రధానమంత్రిని రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు నిలదీయడం లేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లేకుండా కూటమి సాధ్యం కాదని కాంగ్రెసేతర పార్టీలే చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ లేని కూటమిని ఏర్పాటు చేయడం అసంభవమని తెలిపారు. సంకీర్ణాలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు.. టిఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాల్సిన అవకాశం ఊహాజనితమేనన్నారు.
బిజెపి తెచ్చిన ప్రతి బిల్లును సమర్థించిన టిఆర్‌ఎస్.. ఇప్పుడు వ్యతిరేక గళం ఎందుకు వినిపిస్తోంది? అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర నిఘా సంస్థలను ప్రతిపక్షాల మీద ఉపయోగించే బిజెపి.. తెలంగాణలో మౌనం ఎందుకు? అని.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే టిఆర్‌ఎస్, బిజెపిలు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ల వ్యవహారం మ్యాచ్‌ఫిక్సింగ్‌లా ఉందని ఆరోపించారు. 105 సీట్లలో డిపాజిట్ కోల్పోయిన బిజెపి.. తెలంగాణలో ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం బిజెపి నేతలు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.