Thursday, February 27, 2025

బిఆర్ఎస్, బిజెపి ఒక్కటే: పొన్నం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులపై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బిజెపిని బిఆర్ఎస్ పార్టీ ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం కావాలో కెసిఆర్ అడగలేదని, ముఖ్యమంత్రిగా ప్రధాని మోడీ వస్తే కలువలేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి ఏమేమి కావాలో ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ టౌన్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు  తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేరు వేరు క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పట్టబద్రునిగా ఓటు హక్కు వినియోగించుకున్నానని, మిగతా పట్టభద్రులు అందరి విధిగా ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టు రాకపోయినా రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బిజెపి ఎంపిలు బాధ్యులు అవుతారని, ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు. ఇప్పటివరకు మెట్రో మలిదశ, మూసి, ఓఆర్ఆర్ అవతల ట్రిపుల్ ఆర్, హైదరాబాద్ తాగు నీటి సమస్య ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించామని, మోడీ ప్రభుత్వం స్పందించడం లేదని పొన్నం విమర్శలు గుప్పించారు.

కేంద్రం తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలు నెరవేర్చాల్సి ఉందని, తాము కాలికి బలపం కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతున్నామని, ఇవి రాకపోతే బిజెపి బాధ్యత అని కాంగ్రెస్ పై బిజెపి నాయకులు దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు.  కేంద్రంలో ఉన్న అధికార పార్టీ మంత్రులు తెలంగాణ ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి నిధులు తీసుకరావాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు తేకపోతే తెలంగాణ ప్రజలు బిజెపి కేంద్ర మంత్రులు  కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను అసమర్థులుగా భావిస్తారన్నారు.  బిఆర్ఎస్, బిజెపి వేరు కాదు అని, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తి మాదిరిగా రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని, తెలంగాణ ప్రభుత్వముగా ప్రతి రూపాయి జిఎస్టి రూపంలో కేంద్రానికి పంపుతున్నామని, కానీ మాత్రం తెలంగాణకు నిధులు ఇవ్వడంలేదని పొన్నం ధ్వజమెత్తారు.

తెలంగాణలో జరిగిన కులగణన దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని, కుల సర్వేపై మొదటి వారంలో శాసన సభలో చట్టం చేసి రాజకీయ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసే తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామన్నారు. ఎప్పుడైతే ఇబిసికి సంబంధించి బిజెపి షెడ్యూల్లో మార్పులు చేసిందని, ఇప్పుడు బిసి రిజర్వేషన్ల కోసం మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో బిజెపి నాయకులు రాజకీయం చేస్తే సరపోదని, బిసి కులగణనపై తప్పుడు ప్రచారాలు చేసి మత పరమైన పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. క్రికెట్, పాకిస్తాన్ ఇండియా అంటూ రాజకీయాలు రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ కు తెలంగాణ ప్రయోజనాలు ప్రజల అభివృద్ది ముఖ్యమన్నారు.

తమిళనాడులో రాజకీయ విభేదాలు ఉన్న అభివృద్ధి ప్రయోజనాలు విషయంలో అందరి మాట ఒక్క మాట మీద ఉంటారని ప్రశంసించారు. తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కేంద్రంలో ఉన్న బిజెపి కలిసి వచ్చి పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. కేంద్రం నుంచి నిధులు కేటాయించే ప్రయత్నం చేయాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కోరారు. లేదంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చూస్తూ ఊరుకోదని పొన్నం హెచ్చరించారు.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాటలు వింటే జనాలు నవ్వుతున్నారని, ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోతే ట్వీట్ చేస్తున్నారని,  పంటలు ఎండిపోతే ట్వీట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందరూ మంచిగా ఉండలని మొక్కుకోవాలని, వర్షాలకు ఎవరు ఏం చేయలేరన్నారు. ఈ ప్రభుత్వం తాగు, సాగు నీటికి చర్యలు తీసుకుంటుందన్నారు. అందరూ మంచిగా ఉండలని సమృద్ధిగా వర్షాలు ఉండలని శివరాత్రి సందర్భంగా దేవుడిని మొక్కుకున్నానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News