వేములవాడ: ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే సర్వే చేస్తున్నామని మంత్రి చెప్పారు. సోమవారం కార్తీక మాసం సందర్భంగా పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజన్నకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నామన్నారు. ప్రభుత్వం బలవంతంగా ఆధార్, పాన్ వివరాలు సేకరించలేదని.. ఇష్టముంటేనే ఆ వివరాలు చెప్పొచ్చని అన్నారు. ఎన్యూమారేటర్ల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వేను వ్యక్తిగతంగా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. గతంలో చేసిన సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని.. ఆ సర్వే వివరాలు ఎక్కడున్నాయో తెలియదని మంత్రి పొన్నం చెప్పారు.