పోంజీ స్కీంతో చీటింగ్
అధిక వడ్డీ ఇస్తామని రూ.850కోట్లు కొట్టేసిన
నిందితులు రూ.1,700కోట్లు వసూలు
చేసిన కేటుగాళ్లు ఇద్దరిని అరెస్టు చేసిన
సైబరాబాద్ ఈఓడబ్లూ పోలీసులు
మన తెలంగాణ/సిటి బ్యూరో: తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ ఇస్తామని వందల కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. బాధితులను నమ్మించిన నిందితులు రూ.850కోట్లు కొట్టేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం…అమర్ దీప్‌కుమార్ ఫాల్కాన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్యన్ సింగ్, యోగేందర్ సింగ్, పవన్‌కుమార్ ఓదేలా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కావ్యా నల్లూరి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పవన్‌కుమార్ ఓదేలా, కావ్యా నల్లూరిని అరెస్టు చేశారు. అందరు నిందితులు కలిసి 2021లో కంపెనీని ప్రారంభించారు. మొబైల్ అప్లికేషన్, వెబ్‌సైట్ ద్వారా నిందితులు డబ్బులు సేకరించారు.
తమ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పారు. ఏజెంట్లను నియమించుకుని రూ.25వేల నుంచి రూ.9లక్షల వరకు డిపాజిట్లు చేయించుకున్నారు. 45 రోజుల నుంచి 180 రోజుల్లో డిపాజిట్ చేసిన డబ్బులకు 11శాతం నుంచి 22శాతం వడ్డీ ఇస్తామని చెప్పారు. దీంతో 6,979 మంది బాధితులు రూ.1,700కోట్లు డిపాజిట్ చేశారు. ఇందులో నిందితులు రూ.850కోట్లను బాధితులకు వడ్డీతో కలిసి ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా బోర్డు తిప్పేశారు. అమేజాన్, బ్రిటానియా, గోద్రేజ్ సంస్థలు తమ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేశాయని నకిలీ పత్రాలను చూపించడంతో చాలామంది బాధితులు అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు డిపాజిట్ చేశారు. ఇలా డబ్బులు వసూలు చేసిన నిందితులు జనవరి 15,2025న కార్యాలయాన్ని ముసివేశారు.
షెల్ కంపెనీలకు…
డిపాజిటర్ల నుంచి కొట్టేసిన డబ్బులను నిందితులు 14 షెల్ కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. క్రిప్టో కరెన్సీ, మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంలు, గోవాలోని రీసార్ట్‌లు, ప్రైవేట్ చార్టర్ సర్వీసులు, దుబాయ్‌లోని రియల్ ఎస్టేట్‌కు డబ్బులు తరలించారు.