Thursday, January 23, 2025

ఆశలన్నీ పుజారాపైనే..

- Advertisement -
- Advertisement -

లండన్: ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమరం టీమిండియాకు అనుకున్నంత తేలికేం కాదనే చెప్పాలి. భారత ఆటగాళ్లు చాలా రోజులుగా టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉండడమే దీనికి ప్రధాన కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇటు భారత్ అటు ఆస్ట్రేలియా సమానంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లు దాదాపు రెండు నెలలుగా టి20 ఫార్మాట్‌లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఐదు రోజుల పాటు సాగే టెస్టు మ్యాచ్‌కు సిద్ధం కావడం సులువైన అంశమేమి కాదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా ఆశలన్నీ ఒకే ఒక ఆటగాడిపై నిలిచాయి. అతనే నయా వాల్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా. సహచర క్రికెటర్లందరూ ఐపిఎల్‌లో ఆడుతుండడంగా పుజారా మాత్రం ఇంగ్లండ్ గడ్డపై కౌంటీ క్రికెట్ ఆడుతూ వస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ కూడా ఇంగ్లండ్‌లోనే జరుగుతుండడంతో అందరి దృష్టి పుజారాపై నెలకొంది. టెస్టుల్లో పుజారాకు ఎంతో మెరుగైన రికార్డు ఉంది. అంతేగాక ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై పుజారా మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడు. కౌంటీ క్రికెట్‌లో ఆడి పుజారా జోరుమీదున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే పోరులో అతను జట్టుకు ప్రధాన అస్త్రంగా మారాడు. ఈ మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్‌ను ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు. మారథాన్ ఇన్నింగ్స్‌లకు మరో పేరుగా చెప్పుకునే పుజారా తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ఈ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ సమస్య చాలా వరకు తీరిపోతోంది.

టెస్టుల్లో పుజారా ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన బ్యాటర్ అనడంలో సందేహం అవసరం లేదు. సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లో కూడా మెరుగ్గా ఆడడం పుజారా ప్రత్యేకత. ఇక ప్రతిష్టాత్మకమైన డబ్లూటిసి ఫైనల్‌కు కూడా పుజారా ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఒకసారి క్రీజులో నిలదొక్కుకుంటే అతన్ని ఔట్ చేయడం ఎంత పెద్ద బౌలర్‌కైనా చాలా కష్టంతో కూడుకున్న విషయమే. పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాపై పుజారా ఎలా ఆడతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక పుజారాతో కలిసి గతంలో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టిన అజింక్య రహానె, విరాట్ కోహ్లిలు కూడా ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. డబ్లూటిసి ఫైనల్లో ఈ ముగ్గురు తమవంతు పాత్ర సమర్థంగా పోషిస్తే ఆస్ట్రేలియా బౌలర్లకు సమస్యలు ఖాయమని క్రికెట్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News