ప్రపంచంలోని అన్ని మతాల్లో అనేక విశ్వాసాలు, అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటూ వచ్చాయి. వాటన్నిటిని రూపొందించింది ఆయా కాలాల్లోని మతాధిపతులే. కాలం మారుతున్న కొద్దీ, శాస్త్రీయ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆచారాలు, సంప్రదాయాలు అనాగరికమైనవని, అర్థరహితమైనవని జనం గ్రహిస్తూ వచ్చారు. అందుకే కాలానుగుణంగా వాటిని మార్చుకోవడం అవసరమైంది. ఈ మార్చుకోవడమన్నది నిరంతరం జరగవల్సిన ప్రక్రియ. మన దేశంలో బౌద్ధం, జైనం వేల సంవత్సరాల క్రితమే బ్రాహ్మణ మతాన్ని, వర్ణ వ్యవస్థని, మను ధర్మశాస్త్ర నిబంధనల్ని సవాలు చేశాయి. హిందూ ధర్మంలో సైతం వివిధ కాలాల్లో వివిధ ఉద్యమాలు తలెత్తి సంస్కరణలకు దారి తీశాయి. 1216 సి.ఇ శతాబ్దాల మధ్య భక్తి ఉద్యమం బలంగా వ్యాపించింది. అయితే అది కొంత వరకు కుల వ్యవస్థను కూడా ఛాలెంజ్ చేసింది. దురాచారాలను ప్రశ్నించింది. మీరాబాయి, చైతన్యుడు, సూఫీ ఉద్యమం మన తెలుగు నేల మీద వేమన, మొల్ల లాంటి వారు విశ్వాసాల్ని, సంప్రదాయాల్ని ప్రశ్నించిన వారే. ఆ ప్రభావంతో మతాలు ఎప్పటికప్పుడు, ఎంతో కొంత మూఢత్వాన్ని, అనాగరికతను వదులుకుంటూ వచ్చాయి. ఇప్పుడు జరిగే తిరుగుబాట్లకు, నిరంతరం సంఘర్షణలకు అది ఒక ప్రారంభ దశ మాత్రమే!
ఆ తర్వాత రాజా రామ్మోహన్ రాయ్, ఇంకా మరి కొందరు మన తెలుగు గడ్డపై కందుకూరి, గురజాడ లాంటి వారు, దక్షిణాన పెరియార్, నారాయణ గురు మొదలైన వారు ఆధిపత్య భావజాలంపై, దురాచారాలపై నిరంతరం పోరాడిన వారే. వీరందరి పోరాటాల ఫలితంగా మతాలు కొంతలో కొంత సంస్కరించబడ్డాయి. ఉదాహరణకు బాల్య వివాహాల రద్దు, సతి రద్దు, వితంతు వివాహాల ఆమోదం, బహు భార్యత్వ నిషేధం వంటివి ఆ క్రమంలోనే సాధ్యమయ్యాయి. వీరి పోద్బలంతోనే, ఒత్తిడితోనే నాటి బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకు రాగలిగింది. ఆయా కాలాల్లో ఆయా మహనీయులు ఆయా సంస్కరణల కోసం ఉద్యమిస్తున్నప్పుడు… ప్రగతి నిరోధకులైన సంప్రదాయ వాదులు అడ్డుపడ్డారు. సంప్రదాయాలు నాశనమై పోతున్నాయని, హిందూమతం నాశనమై పోతున్నదని గగ్గోలు పెట్టారు. ప్రతిఘటించారు. అయితే అలా అడ్డుకున్న వారంతా బలహీనపడ్డారు. కారణం ప్రజలు సంస్కరణలను కోరుకున్నారు. ప్రగతిశీల భావాలు సమాజంలో వేళ్లూనుకుంటూ వచ్చాయి. ఇక రానున్న కాలంలో మరింత విశాల ప్రాతిపదికన, మరింత వేగవంతంగా మతాలు సంస్కరించబడాల్సి ఉంది.
క్రమక్రమంగా మతాలన్నీ విశ్వమానవ సౌభ్రాతృత్వం వైపు వడివడిగా అడుగులేస్తే, అవి తమ ఉనికినే కోల్పోతాయి. అప్పుడు మనిషిలో మానవత్వం మాత్రమే మిగులుతుంది. ప్రతి ఒక్కడూ విశ్వమానవుడే అన్న ఆలోచన వస్తుంది. దాంతో ‘విశ్వ మానవులాంతా ఒక్కటే’ అని ఆధునిక జన్యుశాస్త్రం ధ్రువీకరించిన విషయాన్ని మనం కళ్లారా చూడొచ్చు. సమాజం ఎప్పుడూ ముందుకే పోతుంది. వెనక్కి లాగాలని ప్రయత్నించే వారు, పురోగమనాన్ని అడ్డుకునే వారు లోగడ కాలగర్భంలో కలిసిపోయారు. ఇక ముందు, జరగబోయేది కూడా అదే భారతీయ సామాజిక వ్యవస్థలో ఉన్న విషాదకర పరిస్థితులను మార్చి, ఈ దేశ మూలవాసులకు అంటే శూద్రులకు, ప్రత్యేకించి మహిళలకు నాటి బ్రిటీష్ ప్రభుత్వం కొన్ని హక్కులు కల్పించింది. చీకటి కూపంలో మగ్గుతూ, బానిసలకు బానిసలుగా బతుకులీడుస్తున్న శూద్రల, మహిళల జీవితాలలో వెలుగు రేఖలు ప్రసరించింది. సమాజంలోంచి కొన్ని దురాచారాల్ని తొలగించే ప్రయత్నం చేసింది.
అదే చేయకపోతే దేశం ఇంకెంత వెనకబడి ఉండేదో ఊహించుకోవాల్సిందే! ఇక్కడ బ్రిటీష్ వారి పాలనను సమర్థిస్తున్నట్టు కాదు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకుంటే, వారు చేసిన చట్టాల వల్ల అణగారిన వర్గాలు చైతన్యమయ్యాయన్నది మాత్రం నిజం! వారు క్రైస్తవ మత ప్రచారం చేసుకున్నది నిజమే. పెద్ద ఎత్తున మత మార్పిడులు చేయించిందీ నిజమే. భారతీయుల్ని బానిసలుగా హింసించిందీ నిజమే. కాని, చేసిన కొద్దిపాటి మంచిలో విద్య, వైద్య రంగాలపై దృష్టి పెట్టడమనేది చాలా ముఖ్యమైంది. రహదారులు, వంతెనలు నిర్మాణాలు కూడా చెప్పుకోవాల్సిందే. అప్పుడు అవన్నీ వారి పరిపాలనా సౌలభ్యం కోసం చేసుకున్నవే కావొచ్చు. కాని, అవి క్రమంగా భారతీయుల జీవన ప్రమాణాల్ని అనూహ్యంగా పెంచుతూ వచ్చాయి. కోహినూర్ వజ్రం తీసుకుపోయారేమోగాని, కోట్లాది భారతీయులార్జించిన విద్యను, వివేకాన్ని తీసుకుపోలేకపోయారు కదా? ఫలితంగా ప్రపంచంలో తలెత్తుకుని చెప్పుకోగలిగే మహినీయులు మన గడ్డ మీద తయారయ్యారు. వీటితో పాటు భాష కూడా ప్రధానమైంది. ఇంగ్లీషు వల్లే మనం ప్రపంచ దేశాల మధ్య సమంగా, సగర్వంగా మనగలుగుతున్నాం. లేకపోతే వైదిక ధర్మం కోసం ఏ కొద్ది మందో సంస్కృత శ్లోకాలు చదువుతుండేవారు.
మిగతా అధిక సంఖ్యాకులు విద్యలేక, నాగరికత లే క, బానిసలకు బానిసలుగా బతుకుతుండే వారు. బ్రిటీష్ కాలంలో జరిగిన సంస్కరణలు, చట్టాలు అంత సులభంగా ఏమీ అమలు కాలేదు. అందుకు వైదిక సంప్రదాయవాదులు, మనువాదులు, ఆర్‌ఎస్‌ఎస్ వారు అనేక రకాలుగా అడ్డుకున్నారు. ఉదాహరణకు 1891లో బాల్య వివాహాలు రద్దయితే, దాన్ని వ్యతిరేకిస్తూ బాల గంగాధర్ తిలక్ రెండేళ్లు పోరాటం చేశారు. అంటే బాల్య వివాహాలు జరుగుతూ ఉండాలని ఆయన ఆరాటపడ్డారు. ఇలాంటి వారంతా దేశభక్తులుగా, స్వాతంత్య్ర సమరయోధులుగా చరిత్రలో నమోదయ్యారు. అందుకే మనం మళ్లీ హేతుబద్ధంగా పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సావర్కర్ పేరు కూడా దేశభక్తుల జాబితాలో మొదట చోటు చేసుకుంది. కాని, తీరా చూస్తే వారికి లొంగిపోయి, స్వాతంత్య్రం పోరాటానికి విఘాతం కలిగించిన దేశద్రోహిగా మిగిలిపోయాడు. బ్రిటీష్ కాలంలో అమలులోకి వచ్చిన కొన్ని చట్టాలను పరిశీలిద్దాం 1773 సి.ఇలో రెగ్యులేటింగ్ చట్టంతో నాటి సంస్కరణలు ప్రారంమయ్యాయి. 1795 సి.ఇలో శూద్రులకు మూలవాసులకు ఆస్తి విషయంలో సమాన హక్కులు ఇవ్వబడ్డాయి. అంతకు ముందు వారికి ఆ వసతి లేదు. కష్టపడి సంపాదించుకున్నా, వాటిని అగ్రవర్ణాల వారు లాక్కోవచ్చని వారి పవిత్ర గ్రంథాలలో రాసుకున్నారు. 1804 లో పురిటిలో ఆడ శిశువుల హత్య నిషేధించబడింది.
1913లో కింది కులాలతో సహా అందరికీ విద్యా హక్కు కల్పించబడింది. దానితో బాటు బానిసత్వం నిషేధించబడింది. దీని వల్ల దేశంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1819లో శూద్రుల వధువు బ్రాహ్మణుడితో మొదటి మూడు రాత్రులు గడపడాన్ని నిషేధించారు. దీని వల్ల కుటుంబ వ్యవస్థకు ఒక గౌరవం ఏర్పడింది. నైతిక విలువలు పెరిగాయి. ఇప్పటికీ వైదిక ధర్మం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో చదివే మంత్రాలలో ఈ బండారం బయటపడుతుంది. వెనిగళ్ల సుబ్బారావుని చదవండి విషయం తెలుస్తుంది. తాపీ ధర్మారావు ‘పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు’ తిరగేయండి. కళ్లు కాస్తా తెరుచుకుంటాయి. 1829లో సతి దురాచారం, దేవదాసి సంప్రదాయాన్ని నిషేధించారు. భర్త చనిపోతే భార్యను సజీవంగా భర్త శవంతో పాటు చితి మీద కాల్చేవారు. అది మనువాదుల సంస్కృతి. దాన్ని నిషేధించడమంటే, బలవంతపు బహిరంగ హత్యల్ని అడ్డుకున్నట్టే. ఇది మానవీయ విలువలకు, జీవ కారుణ్యానికి సంబంధించిన విషయం. ఇక దేవదాసి/ మాతంగి/ జోగిని/ మురళి/ న్నాటి/ బసివి/ మహారి/ మత్తామ్మ వ్యవస్థలన్నీ రద్దు కావడంతో దేవుడి పేరుతో, గుళ్ల పేరుతో జరిగే బహిరంగ వ్యభిచారం ఆగిపోయింది. జీవచ్ఛవాలుగా బతికే దేవుడి భార్యలకు మామూలు కుటుంబ జీవనం లభించింది. ఒక రకంగా ఇది మహిళలకు గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించింది. అలాగే 1856లో విధవా పునర్వివాహాలు చట్టబద్ధమయ్యాయి.
యజ్ఞాలు, యాగాల పేరుతో జంతు బలులు, నరబలులు ఇవ్వడం వైదిక సంప్రదాయం. బుద్ధుని ప్రభావంతో ఒక వెయ్యి సంవత్సరాలు ఇవి తగ్గు ముఖం పట్టాయి. బౌద్ధాన్ని నాశనం చేసిన వైదిక ధర్మ ప్రబోధకులు బలుల్ని మళ్లీ ప్రోత్సహించారు. అయితే, 1830లో పూజల పేరిట జరిగే నరబలిని అధికారికంగా నిషేధించారు. వర్ణ వ్యవస్థ బలంగా ఉన్న మన సమాజంలో ఎన్నో వివక్షలు ఉండేవి. వాటిని ఆపడానికి కొన్ని చట్టాలు వచ్చాయి. ఫలితంగానే 1831లో ప్రభుత్వ సర్వీసులలో కులం/ రంగు ఆధారంగా వివక్ష పాటించడం చట్ట విరుద్ధమైంది. అలాగే శూద్రులు కుర్చీ మీద కూర్చునే హక్కు 1835లో వచ్చింది. ఇప్పటికీ దీని ఛాయలు మనం సమకాలీనంలో ఇంకా చూస్తూనే ఉన్నాం. సర్పంచులుగా ఎన్నికైన దళితుల్ని వారి ఆఫీసుల్లోనే కింద కూర్బోబెడుతున్నారు. అది చట్టరీత్యా నేరం. శూద్రుల్ని మూల వాసుల్ని సజీవంగా పెద్ద భవనాల పునాదుల్లో సమాధి చేయడాన్ని ‘లోచరక్ పూజ’ అని అనేవారు. ఆ దుర్మార్గం 1863లో నిషేధించబడింది. హిందువుల్లోని అన్ని కులాల వారికి శిక్ష సమానంగా ఉండేట్లు 1917లో చట్టం వచ్చింది. అంతకు ముందు వర్ణ వ్యవస్థ ఆధారంగా పై వర్గం వారికి మాఫీ లేదా అతి తక్కువ శిక్ష ఉండేది. కింది వర్గం వారికి కఠినమైన శిక్షలుండేవి. ఇందులో సమ భావం లేనందువల్ల సవరించవలసి వచ్చింది. కేవలం ఇవే కాకుండా, విభజనలు లేకుండా ఇంగ్లీషు విద్యను భారతీయులందరికీ అందించడం వల్లనే.. వారిలోంచి మేధావి వర్గం పుట్టుకొచ్చింది. ఎంతో మంది శాస్త్రవేత్తలు బ్రిటీష్ కాలంలోనే విశ్వవిఖ్యాతులయ్యారు. విశ్వకవి రవీంద్రుడు, సర్ సి.వి. రామన్‌లకు నోబెల్ బహుమతులు దేశానికి స్వాతంత్య్రం రాక ముందే వచ్చాయి.
మరో వైపు బహుజనుల ప్రశ్నలు, పోరాటాలు, సమానత్వం కోసం సంఘర్షణలు తీవ్రమయ్యాయి. ఆ అవలోకనం, ఆ అవగాహన విద్య వల్లనే వచ్చింది. సమ సమాజ నిర్మాణంలో పైన చెప్పుకున్న వన్నీ ఇతోధికంగా ఉపయోగపడ్డాయి. స్వాతంత్య్రానంతరం డా. అంబేడ్కర్ సారథ్యంలో రాజ్యాంగానికి రూపకల్పన జరిగాక, పరిస్థితులు మరింత మెరుగుపడుతూ వచ్చాయి. అయితే మెరుగుపడిన పరిస్థితుల్ని తిరగతోడి, మళ్లీ మనువాద ధర్మాలను ప్రతిష్టించాలని కుట్రలు చేస్తున్న వారిని దేశ ప్రజలు గమనిస్తూ ఉండాలి. ఎక్కడికక్కడి అడ్డుకుంటూనే ఉండాలి. మంచిని సాధించాలంటే చెడును అంతం చేయక తప్పదు. చెడు పేట్రేగి పోతోంది కదా మనమేం చేయగలం? అని నిస్సహాయంగా నీరసపడిపోకూడదు. హేతుబద్ధమైన నిజాయితీయే మనకు ఆయుధం కావాలి. ప్రపంచ దేశాలలో మనం సగర్వంగా తలెత్తుకు నిలబడాలంటే మన రాజ్యాంగాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని మన వైజ్ఞానిక స్ఫూర్తిని మనం పరిరక్షించుకుంటూనే ఉండాలి. అమెరికాకన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంలో భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపన్యసిస్తూ “నిజానికి, నిజాయితీకి, వైజ్ఞానిక దృక్పథానికి” ఓటేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు అని చెప్పారు. “ఎన్నికైన తొలి మహిళనే కాని, చివరి మహిళగా మిగిలిపోగూడదని” కూడా హెచ్చరించారు.
డా. దేవరాజు
మహారాజు