వరంగల్ : శ్రీరామనవమిని పురస్కరించుకొని అందరూ శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకల్లో బిజీగా ఉంటే వరంగల్‌లోని బాలాజీనగర్‌కు చెందిన నిరుపేదలు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాధ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గురువారం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ వైభోగం జరిగే వేళనే పోలీస్ బాస్ ఫ్లెక్సీ వద్ద దేవుడికి చేసిన్నట్లే పూజలు చేసి పాలాభిషేకం చేసి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఎనుమాముల మార్కెట్ ఏరియాలోని బాలాజీనగర్‌కు చెందిన భూబాధితులు లేబర్‌కాలనీకి వెళ్లే సర్కిల్ సెంటర్లో ఎవి రంగనాథ్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేసి సిపి చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదల స్థలాలను ఎనుమాములకు చెందిన భూకబ్జాదారులు ఆక్రమించుకొని బాధితులను భయభ్రాంతులకు గురి చేయడమే కాక భౌతిక దాడులకు తెగబడ్డారు.
కూడబెట్టుకున్న డబ్బులతో కొనుగోళ్లు చేసిన భూములను అన్యక్రాంతం చేయడంతో బాధిత కుటుంబాలు సిపి రంగనాథ్‌ను శరణు కోరారు. రెక్కాడితే డొక్కాడని నిర్భాగ్యుల భూములను కబ్జా చేసే ప్రయత్నంపై సిపి సీరియస్‌గా స్పందించారు. ఈస్ట్‌జోన్ డిసిపి పుల్ల కరుణాకర్, టాస్క్‌ఫోర్స్ ఎసిపి డాక్టర్ జితేందర్‌రెడ్డి, మామునూరు ఎసిపి కృపాకర్, ఎనుమాముల సిఐ మహేందర్ల నేతృత్వంలో ఎస్ఒటి పద్ధతిలో సమగ్ర విచారణ చేపట్టారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాధ్ చూపిన చొరవతో తమ భూములు తమకు దక్కడంతో సంతోషాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో షాబోతు శ్రీనివాస్,కోదాటి రమేష్, గౌసబేగం, అడెపు భిక్షపతి, రాజు, దేవులపల్లి మల్లేష్, బాధితులు పాల్గొన్నారు.