వాటికన్ సిటీ: మయన్మార్‌లో రక్తపాతం అంతమై సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభం కావాలని పోప్ ఫ్రాన్సిస్ బుధవారం పిలుపునిచ్చారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న మయన్మార్‌లో రక్తపాతం పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ వీధులలో సైనికుల ముందు మోకాళ్లపై కూర్చుని శాంతి కోసం వేడుకుంటానని పోప్ భావోద్వేగంతో ప్రకటించారు.
తమ దేశంలో శాంతి కోసం తమ ప్రాణాలనే పణంగా పెడుతున్న మయన్మార్ ప్రజల పరిస్థితి చూస్తుంటే తనకు ఎంతో విచారంగా ఉందని ఆయన అన్నారు. మయన్మార్ వీధులలో సాయుధ సైనిక దళాల ముందు మోకాళ్లపై కూర్చుని ఒక నన్ వేడుకుంటున్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్ ఈ సందేశం విడుదల చేశారు. తాను కూడా మయన్మార్ వీధులలో మోకాళ్లపై కూర్చుని హింసకు స్వస్తి చెప్పి శాంతి పునరుద్ధరణ జరపాల్సిందిగా సైనికులను అర్థిస్తానని పోప్ చెప్పారు. రక్తపాతంతో ఏ సమస్య పరిష్కారం కాదని, చర్చల ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభించగలదని పోప్ పేర్కొన్నారు.