న్యూఢిల్లీ: పాము విషం రేవ్ పార్టీ కేసులో బిగ్‌బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఆదివారం అరెస్ట్ అయ్యారు. శనివారం ఆయన విచారణకు హాజరు కాగా, అరెస్ట్ జరిగింది. త్వరలోనే ఎల్వీష్‌ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. గత ఏడాది రేవ్ పార్టీలతో పాము విషాన్ని వినోదానికి వాడినందుకు అతనితోపాటు మరో ఐదుగురిపై నోయిడాలో వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదైంది. నోయిడా లోని సెక్టార్ 51లో 2023 నవంబర్ 3 న బాంక్వెట్ హాల్‌పై పోలీస్‌లు దాడి చేసి తొమ్మిది మందిని అదుపు లోకి తీసుకున్నారు. వారి నుంచి తొమ్మిది పాములు, విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రేవ్ పార్టీలు, వీడియో షూట్‌ల కోసం ఎల్వీష్ యాదవ్ పాములను వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. తన యూట్యూబ్ ఛానల్‌లో అనేక పాముల వీడియోలు ఉండడంతో పోలీస్‌ల అనుమానాలకు బలం చేకూరింది. యూట్యూబ్‌లో ఎల్వీష్ యాదవ్ వీడియోలను చూసిన తర్వాతే బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ నేతృత్వం లోని జంతుహక్కుల సంఘం పిఎఫ్‌ఎ ( పీపుల్స్ ఫర్ యానిమల్స్)అతనిపై పోలీస్ స్టేషన్‌లోఫిర్యాదు చేసింది. అలా రేవ్ పార్టీ చేస్తున్న నిందితులను పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు.