Monday, December 23, 2024

ప్రత్యామ్నాయ ‘పట్టు’

- Advertisement -
- Advertisement -

Popularity of silk industry in Telangana

వరికి బదులుగా భారీగా మల్బరీ సాగు

సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగే అవకాశం ప్రత్యామ్నాయ పంటల సాగులో పట్టుకు ప్రాధాన్యతనిస్తున్న రైతులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పట్టు పరిశ్రమకు క్రమేపీ ఆదరణ పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయంగా పట్టుకు డిమాండ్ పెరగటం, ఇప్పటిదాక ప్రధాన ఎగుమతి దారుగా ఉన్న దేశాల్లో వాతావరణ ప్రతికూలతలతో మల్బరీ సాగు విస్తీర్ణం తగ్గిపోవటం , పట్టు ఉత్పత్తుల ఎగుమతి కూడా ఆయా దేశాలనుంచి పడిపోతుండటంతో దేశీయంగా పట్టు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిపోయింది. ఏడాది కిందట ఉన్న పట్టుగూళ్ల ధరలు ఇప్పుడు రెట్టింపునకు చేరువయ్యాయి. పట్టు పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కావటం, ఇది గ్రామీణ ప్రాంత ప్రజలకు లాభసాటి ఉపాధి కల్పించే పరిశ్రమ కావటంతో సన్న చిన్న కారు రైతులను కూడా పట్టు పరిశ్రమ ఆకర్షిస్తోంది. మల్బరీ సాగుకు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం, పట్టు పురుగులు పెంపకానికి ఉన్న అనుకూలత , ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలు తదతర అంశాలు మల్బరీ సా గుకు కలిసి వస్తున్నాయి. ఇంతకాలం వరిసాగులో మునిగితేలిన రైతులు వరినాట్లు మొదలుకుని , పంట చేకితికి వచ్చి మార్కెట్లలో ధాన్యం విక్రయించుకునేదాక అష్టకష్టాలు పడుతూ వచ్చారు. ఇంత శ్రమచేసినా పెట్టుబడి ఖర్చులు పోగా పెద్దగా రైతులకు మిగిలిందంటూ లేకపోవటంతో ప్రభుత్వం పిలుపునందుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా మళ్లుతున్నారు.

ఆరుగాలం కష్టానికి తగిన ఫలితం లభించే పంటలవైపు దృష్టి సారించారు. పట్టుగూళ్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ రైతులను మల్బరీ సాగు దిశగా అడుగులు వేయిస్తోంది. యాసంగిలో ఈ పంట సాగును రైతులు ప్రత్యామ్నాయ పంటల్లో ఒకటిగా ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో మల్బరీ సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు పట్టు పరిశ్రమ శాఖ అధికారులు అంచనా వేశారు.రాష్ట్రంలో పట్టు పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వివరిస్తూ ప్రభుత్వం కూడా రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. ప్రతియేటా రాష్ట్రంలో 11వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. పట్టు పురుగుల పెంపకం ద్వారా రా్రష్ట్రం నుంచి ఏటా 2,853మెట్రిక్ టన్నుల మేరకు పట్టు ఉత్పత్తి అవుతున్నట్టు అధికారులు వెల్లడించారు.రాష్ట్రంలో మల్బరీ సాగు ఇప్పటికే అన్ని జిల్లాలకు విస్తరించింది. మల్బరీ , దశలీ అనే రెండు ప్రసిద్ద రకాల పట్టునే ఉత్పత్తి చేస్తున్నారు. మంచిర్యాల , కొమరం భీం, అదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో ఉన్న దసలీ పట్టు సాగు రైతులకు ప్రభుత్వం నాణ్యమైన పట్టుగుడ్ల ఉత్పత్తిలో తగిన సహాయ సహకారాలు అందజేస్తోంది. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో దసలి పట్టు గూళ్ళ దిగుబడికూడా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తేమ వాతావరణం, సమశీతోష్ణ పరిస్థితులు ఉన్నందున పట్టుసాగుకు మంచి అనుకూలతలు ఉన్నట్టు జాతీయ పట్టు అభివృద్ధి మండలి కూడా వెల్లడించింది.

దేశీయ పట్టుకు పెరిగిన డిమాండ్ :

పట్టు ఉత్పత్తి రైతులకు మంచి లాభసాటిగా ఉందని పట్టు పరిశ్రమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ పట్టు పరిశ్రమ అవసరాలకు ఏటా 68వేల మెట్రిక్ టన్నుల పట్టు వినియోగం జరుగుతోంది. అయితే దేశంలో రైతుల నుంచి ఉత్పత్తి అవుతున్న పట్టు 32వేట మెట్రిక్ టన్నులను మించటం లేదు. దేశీయ పట్టు పరిశ్రమ వినియోగంలో ఇది 50శాతానికి కూడ చాలటం లేదు. దీంతో అంతర్జాతీయంగా పట్టును దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. తద్వార దేశంలో ఉన్న విదేశీ మారక ద్రవ్యం పట్టు ఉత్పత్తుల దిగుమతి కోసం వెచ్చించాల్సివస్తోంది. ప్రధానంగా చైనా నుంచే పట్టు దిగుమతి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాతవారణ ప్రతికూలతతో చైనాల కూడా పట్టు ఉత్పత్తి భారీగా పడిపోతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పట్టుకు డిమాండ్ పెరిగిపోయింది. ఆరు నెలల కిందట కిలో పట్టు(సిల్క్ ) ధర రూ.3000ఉండగా, ఇప్పుడు దీని ధర ఏకంగా రూ.5500నుంచి రూ.6000వేలకు చేరుకుంది. పట్టుగూళ్ల ధరలు కూడా గత ఏడాది రూ.270 ఉండగా, ఈ ఏడాది పట్టు గూళ్ల ధరలు కిలో రూ.550వరకు పలుకుతున్నాయి. దీంతో దేశీయంగానే పట్టు ఉత్పత్తి పట్ల ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ పధకాల ద్వార రాయితీలు కల్పిస్తూ మల్బరీ సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. మల్చరి తోటల సాగు, పట్టు పురుగులను పెంచేందుకు షెడ్ల నిర్మాణం తదితర వాటికి ప్రభుత్వమే రాయితీలు ఇచ్చి నిధులు సమకూరుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News