యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడి
లక్నో: జనాభా నియంత్రణ కోసం ఒక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో తీసుకువస్తుందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో జనాభాను నియంత్రించి నిర్ణీత కాల వ్యవధిలో మాతా శిశు మరణాలను తగ్గించే లక్షంతో ఒక నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జులైలో ప్రకటించింది. పెరుగుతున్న జనాభా రాష్ట్ర అభివృద్ధికి ప్రతిబంధకం అవుతోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ సందర్భంగా అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడిక్కడ ఒక కార్యక్రమంలో యోగి ప్రసంగిస్తూ సరైన సమయంలో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయోధ్య రామాలయ నిర్మాణం తేదీని ఎప్పుడు ప్రకటిస్తారంటూ గతంలో బిజెపిని మీడియా ప్రశ్నించేదని, కొవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని యోగి తెలిపారు. అదే విధంగా 370 అధికరణను ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా రద్దు చేశారని ఆయన అన్నారు.