గాంధీనగర్: దేశంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల రానున్న కొన్ని దశాబ్దాలలో దేశంలోని సగం జనాభా నగరాలలోనే నివసిస్తుందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రేపటి నివాసయోగ్యమైన నగరాలు పేరిట నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ప్రసంగిస్తూ భవిష్యత్తులో నగరాలలో పెరిగిపోయే వలసలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ నగరాలలోని మురికివాడ ప్రజల కోసం వివిధ సంక్షేమ పథకాలను ప్రారంభించారని తెలిపారు.
గతంలో 20 శాతం జనాభా నగరాలలో నివసిస్తే 8 శాతం జనాభా గ్రామాలలో నివసించేదని ఆయన అన్నారు. ప్రస్తుతం 30 శాతం ప్రజలు నగరాలలో నివసిస్తుంటే 70 శాతం మంది గ్రామాలలో నివసిస్తున్నారని ఆయన వివరించారు. తమ స్వగ్రామంతోపాటు నగరంలో కూడా సొంతిల్లు ఉండాలన్న నయా పోకడలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నగరాలలో జరుగుతున్న అభివృద్ధి, పెరుగుతున్న పట్టణీకరణను బట్టి చూస్తే వచ్చే కొన్ని దశాబద్దాలలోనే దేశంలో జనాభా 50:50 నిష్పత్తిలో గ్రామాలలో, నగరాలలో ఉంటుందని ఆయన అంచనా వేశారు.