హైదరాబాద్: జిల్లాలో ప్రతి ఉద్యోగి తనకు నిర్దారించిన పని తాను చేసుకుంటూ పోతే ప్రతి కార్యక్రమం సవ్యంగా సాగుతాయని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన పోషణ అభియాన్, పోషణ మాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అని, జిల్లాలో అన్ని సేవలు అందించడంలో ముందు ఉండాలని చెప్పారు. పోషణ లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి అక్వేశ్వర్ రావు వివరిస్తూ సామ్, మాం, అండర్ వెయిట్ పిల్లలపై మానిటరింగ్ పెట్టి వారి ఎదుగుదల సరైన స్దితిలోకి తేవాలని పేర్కొన్నారు. జిల్లాలో రక్తహీనత శాతం చాలా ఎక్కువ ఉందని దానిని తగ్గించాలని, దీని కోసం లైన్ డిపార్టుమెంట్ సహకరించాలని కోరారు.
అంతేగాకుండా పోషణ అభియాన్‌లో భాగంగా ఇచ్చిన ప్రతి టార్గెట్‌ను మనం చేరుకోవాలన్నారు. ఈసందర్భంగా జిల్లా అదనపు వైద్యాధికారి జయలత ప్రసంగిస్తూ రక్తహీనత తగ్గాలంటే పిల్లలు కిశోర బాలికలు ఉన్నప్పటి నుంచి వారికి సరైన ఆహారం తీసుకోవడం పట్ల అవగాహన కలిగించాలని సూచించారు. అంతేగాకుండా ప్రతి ఒకరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని, సురక్షిత ప్రసవాలు, ప్రభుత్వ దవఖానలో జరగుతాయని, దీనికి ప్రజలను మోటివేట్ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఏడి శ్రీనివాస్‌రెడ్డి, చీప్ రేషనింగ్ అధికారి ఆర్.టి. నాయక్, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.