మిడ్జిల్ : మండల పరిధిలోని రాణిపేట గ్రామంలో జీఓ సర్వే నంబర్‌లో క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన దాదాపు రూ. కోటీ విలువ గల కుంటల భూమిని స్థానిక సర్పంచ్ అండదండలతో యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. పంచాయతీ పనుల నిమిత్తం వాడుకోవాల్సిన ట్రాక్టర్‌తో కబ్జా చేసిన స్థలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రైవేట్ వ్యక్తులు యథేచ్ఛగా పంచాయతీ ట్రాక్టర్లను తమ పనులకు వాడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ సెక్రటరీ సుదర్శన్ గానీ, మండల అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
గ్రామంలోని ప్రైమరీ పాఠశాల మన ఊరు .. మన బడిలో భాగంగా పునర్నిర్మాణం కోసం అంటూ కూలగొట్టారు. గతంలో పాఠశాల నిర్మాణం కోసం వాడిన రాయిని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా కబ్జా చేసిన స్థలంలోకి తీసుకువచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. విద్యాశాఖ అనుమతి లేకుండానే పాఠశాలను కూలగొట్టడం ఆ రాయిని ప్రైవేట్ వ్యక్తులు ఉపయోగించడం ఏంటని అధికారులే విస్తుపోతున్నారు. ఈ విషయంపై ఎంపిడిఒ అనురాధను వివరణను కోరగా కబ్జాకు గురైన స్థలాన్ని క్రీడా ప్రాంగణానికి కేటాయించడమైందని అయినా ఆ స్థలం కోర్టు కేసులో ఉన్నందున క్రీడా ప్రాంగణ ఏర్పాట్లు చేయలేదని కబ్జాకు గురైన స్థలంలో ఇంటి నిర్మాణం నిలువుదల చేస్తామని తెలిపారు.