ధరణి పోర్టల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరణి పోర్టల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అప్లికేషన్ ఫర్ పాస్ బుక్ డేటా కరెక్షన్ పేరిట కొత్త మాడ్యూల్‌ను తీసుకొచ్చింది. పాసుపుస్తకాల్లో పేరు మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, రకం మార్పు, విస్తీర్ణం సరిచేయడం, మిస్సింగ్ సర్వే – సబ్ డివిజన్ నెంబర్లు, నోషనల్ ఖాతాల నుంచి భూమి బదిలీ, భూమి అనుభవంలో మార్పుకు అవకాశం కల్పించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు ధరణి పోర్టల్‌లో ఈ వెసులుబాటును ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో పాసు పుస్తకంలో తప్పిదాలను సవరించుకునే అవకాశం కలిగింది. మొత్తం 8 రకాల సవరణలకు ఆస్కారం ఏర్పడిందని అధికారులు తెలిపారు. చిన్నపాటి తప్పులు, పొరపాట్లు, ముద్రణా దోషాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సవరణకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి భారీ సంఖ్యలో విజ్ఞప్తులు అందుతున్నాయి. తాజా మార్పుతో చాలా వరకు సమస్యలు తీరతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే మరికొన్ని మాడ్యూల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.